Friday, December 31, 2010

మనకొద్దీ చెంచాడు కష్టాలు

"అయ్యోలూ..అమ్మోలూ.. ఇంతేనా బ్రతుకు హో హో హో." మీకందరికీ జెమిని టి.వి. లో వచ్చే అమృతం సీరియల్ కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట తెలిసే ఉంటుంది. కారణం తెలియదు కానీ, ఈ పాట వినగానే అప్రయత్నంగా నాకు  ఒక కథ గుర్తొస్తుంది. ఈ పాట వింటే ఎంత నవ్వొస్తుందో, ఆ కథ వింటే అంత ఉద్వేగం ఆవహిస్తుంది. ఈ పాట గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా రెండు విరుద్ధమైన భావాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాను. అందుకే ఇక్కడ హాస్యపూరితమైన వ్యాఖ్యానం, మనసు పలికే బ్లాగులో ఉద్వేగభరితమైన కథనం.
 
ఎప్పుడూ కష్టాలే ఉంటాయా మన జీవితాల్లో, నవ్వుల పువ్వులు కూడా పూస్తున్నాయి సరిగ్గా చూడు అంటూ సున్నితమైన హాస్యంతో చెప్పారు. జీవితాన్ని ఒక టి.వి. గా తీసుకుంటే మన మనసనే రెమోట్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుందని, ఏడుపుగొట్టు ఆలోచనల్ని రానివ్వకుండా మనమే చూసుకోవచ్చని ఎంత బాగా చెప్పారో. హహ్హ.. చివరికి మనం లోతైన ఊబిలా భావించే కష్టాల్ని చిలిపి కష్టాలు అని తేల్చేసి వార్తల్లో హెడ్‌లైన్స్ తో పోల్చేసారు. నాకు తెలుసు ఇది ధారుణమే అని. మరే.. మనకే బోలెడన్ని కష్టాలు ఉన్నట్లు మనం తెగ ఫీల్ అయిపోయి సంతోషంగా ఏడ్చేస్తూ ఉంటామా.. ఇప్పుడేమో ఈయనగారు ఇలా వచ్చేసి కొత్తగా "కష్టాలు అన్నీ సిల్లీగానే ఉంటాయి" అంటే ఏమనుకోవాలి.? అసలు బాధల్లో తీవ్రంగా లీనమైపోయి గుండెలవిసేలా ఏడవడం ఎంత బాగుంటుందనీ.. ఆ ఆనందం ఈయనకెలా తెలుస్తుంది..? ఇంకా చూడండి.. మన గుండెలకి లోతుగా తగిలే గాయాలు అయొడిన్‌తో మానిపోయేవట. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా..?
       అయ్యోలూ అమ్మోలూ ఇంతేనా బ్రతుకు హో హో హో
       ఆహాలూ ఓహోలూ ఉంటాయి వెతుకు హా హా హా
       మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు?
       ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు!
       వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు?
       అయొడిన్‌తో అయిపోయే గాయాలే మనకు గండాలు

ఇంకా చూడండి. మన మీద ఎంతో ప్రేమతో మనతో ఉండిపోడానికి వచ్చింది ఈ ట్రబుల్ అని ఎంతో ఆనందిస్తూ ఉంటామా. కాదట. ఎక్కడికో వెళుతూ ఉంటే దారిలో కనిపించి "హెల్లో హౌ డు యు డు" అని మాత్రమే అడుగుతుండట. జీవితాంతం మనం కష్టాల్ని సంతోషంగా అనుభవించడానికి, ఆతిథ్యం ఇస్తా అన్నా కూడా మనతో ఉండదట. ట్రబుల్ ఏమైనా పనీ పాటా లేకుండా గాలికి తిరుగుతూ ఉంటుందా తీరిగ్గా మనతో కాలక్షేపం చెయ్యడానికి అని కొశ్చను:(. మనసు చివుక్కుమనదూ..!! ఇరుకు అద్దెల్లు ఉన్నందుకు మనమంతా ఆనందంగా బాధ పడుతూ ఉంటే ఈయనేంటండీ, గాలికి కూడా స్థానం లేని ఇంట్లో పెను తుఫాను అడుగు ఎలా పెడుతుందని అంటారు..?
       ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవొయ్ ట్రబులు
       “హలో హౌ డు యూ డూ” అని అంటోంది అంతే నీ లెవెలు
       ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా
       తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా
       గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు
       కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు?

చూసారా చూసారా మళ్లీ అదే మాట. అంతు లేకుండా ముక్కు చీదుకుంటూ మనం అనుభవించే కష్టాలు చెంచాడేనా..? పైగా ఆ మాత్రం కష్టాలకి ఆయాసం వద్దని హితబోధ ఒకటి. తిప్పి తిప్పి కొడితే కరెంటు, రెంటే మన కష్టాలట. ఏడ్చీ ఏడ్చీ తెచ్చుకునే కన్నీళ్లు కూరలో కారం ఎక్కువైనందుకట. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా మీరే చెప్పండి. మనం చేసే ఫైటింగంటే దోమల్తో చేసేదేనా.? ఎంత అవమానం. ఈ అవమానం మనకి కాదు, మనం ఎంతో ప్రేమగా బాధ్యతగా ఎప్పుడూ మన వెన్నంటే ఉంచుకునే మన కష్టాలకి, కన్నీళ్లకీనూ..
       ఒరేయ్ ఆంజనేయ్లూ! తెగ ఆయస పడిపోకు చాలు
       మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
       కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
       కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
       నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
       భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్!

అసలవి లేకుండా మన రోజు గడుస్తుందా అంట. అటువంటి కష్టాలు, కన్నీళ్ళకి మనం ఎంత పెద్ద పీట వేయాలి! ఇలా అవమానించి సాగనంపితే మళ్లీ మనకి హెల్లో చెప్పడానికి అయినా వస్తాయా అసలు. ఇక మనం ఏడ్చేదెలా.. కన్నీళ్లు పెట్టుకునేదెలా చెప్మా..!!
ఏదేమైనా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా.. మీకు ఇలాంటి చిలిపి కష్టాలు, చెంచాడు కష్టాలు దరిదాపుల్లోకి కూడా రావొద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Youtube Link : http://www.youtube.com/watch?v=cPu0_Q19UGc

Tuesday, November 30, 2010

నమ్మక తప్పని నిజమైనా..

ప్రేమ.. నిర్వచించలేని ఒక అనుభూతి. పదాల్లో కూర్చలేని ఒక భావం. ప్రేమికులిద్దరూ కలిసున్నంత వరకూ ప్రపంచమంతా అందంగా, ఇంత అందమైన ప్రపంచం తమ కోసమే దేవుడు సృష్టించాడు అన్నంత ఆనందంగా ఉంటారు.మరి ఏదైనా కారణాల వల్ల విడిపోతేనో..!! ఆ బాధ చెప్పనలవి కానిది. తినడానికైనా, తాగడానికైనా, మట్లాడ్డానికైనా గొంతుకడ్డం పడే బాధ అది. ఇక నిద్ర సంగతంటారా.. అదెలా ఉంటుందో కొద్ది రోజుల వరకూ గుర్తు కూడా రాదు. మరి అటువంటి బాధకి అక్షర రూపం ఇవ్వడం మామూలు విషయం కాదు. నిన్నటి దాకా నిచ్చెలి చేతుల్లో చెయ్యేసి పక్క పక్కనే నడుస్తూ జీవితాన్ని రంగుల్లో ఊహించుకుంటూ ఉండే ప్రియుడు, ఒక్క సారిగా తన చేతిలో సఖి చెయ్యి మాయం అయిందని తెలుసుకుని అది నిజమే అని తెలిసి కూడా, నిజమా కాదా అన్న సంఘర్షణలో ఉన్న తన మనసుకి సర్ది చెప్పలేక సతమతమయ్యే ఒక ప్రేమికుడి వ్యధ.. "బొమ్మరిల్లు" చిత్రం లోని ఈ "నమ్మక తప్పని నిజమైనా" పాట.ఇక ఇటువంటి భావాలని అక్షర రూపంలో పొందు పరచడం మన శాస్త్రి గారికి వెన్నతో పెట్టిన విద్యేమో.. ఆ బాధని మన మనసు మూలాల్లోకి తీసుకెళ్లిపోతాడు. ఒకానొక క్షణంలో మన కళ్లలో నీటి తెర అడ్డు పడటం అన్నది చాలా సాధారణ విషయం (ఎన్నో పాటల్లో నాకు అనుభవానికొచ్చింది).

నువ్విక రావు అన్న నమ్మలేని నిజాన్ని చెబుతూ ఉన్నా ఎందుకు వినదో నా మనసు.. నువ్వొస్తావు అన్న పిచ్చి ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎదురుగా ఎవరొస్తున్నా అది నువ్వే అన్న ఆశ. మరి నీ రూపం నా చూపులనొదిలి వెళ్లలేదుగా. నువ్వు లేని ఈ ఏకాంతంలో ఇంకెంత మంది ఉన్నా నేను ఒంటరినే కదా.. నన్ను ఇటువంటి ఒంటరితనంలో వదిలి వెళ్లావు కదూ.. నువ్వు నిన్నటి కలవే అని తెలుసు. అయినా, కన్నులు తెరిచుకుని అదే (నీ) కలలో ఉన్నాను ఇప్పటికీ. మరి నువ్వు నన్ను వదిలి వెళ్లినంత మాత్రాన నీ ఙ్ఞాపకాల్ని నేను మర్చిపోలేను కదా..
       నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెపుతున్నా
                               ఎందుకు వినదో నా మది ఇపుడైనా
       ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
                               నీ రూపం నా చుపులనొదిలేనా
       ఎందరితో కలిసున్నా నే నొంటరిగానే ఉన్నా
                               నువ్వొదిలిన ఈ ఏకాంతంలొనా
       కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా
                               ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా

"ఈజన్మంతా విడిపోదీ జంటా అని దీవించిన గుడిగంటను ఇక నామది వింటుందా" ఎంత గొప్పగా రాసారో.. ఇద్దరం కలిసి తిరిగిన ఏ చోటైనా నువ్వు లేని నన్ను గుర్తు పడుతుందా.. వాహ్.. నీ ప్రేమ గుర్తులతో నన్ను నిలువునా తడిమి.. ఙ్ఞాపకాలను మాత్రం వదిలి వెనుదిరిగావు. నీ వియోగంతో చెమర్చిన ఈ కనులతో నిన్ను ఎలా వెతికేది..
       ఈజన్మంతా విడిపోదీ జంటా
                  అని దీవించిన గుడిగంటను ఇక నామది వింటుందా
       నా వెను వెంట నువ్వే లేకుండా
                  రోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా
       నిలువున నను తడిమిఅలా వెనుదిరిగిన చెలిమి అలా
                  తడి కనులతో నిను వెదికేది ఎలా

కానీ ఇక నువ్వు రావు అన్నది నిజం. మరి, నిరంతరం వెలిగే వెన్నెల లాంటి నీ స్నేహంలో కనీసం కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి అని ఆనందించమంటావా.. లేదా నువ్వు రావన్న నిజాన్ని తలుచుకుంటూ నా ఊహల్లో కలిగే వేదన చీకటిలో జీవితం గడిచిపోతుంది అనుకోవాలా..చిరునవ్వులతో పరిచయమై ఎన్నటికీ మరచిపోలేని సిరిమల్లెల పరిమళాన్ని అందించి చేజారిపోయావు.. నా ఆశల తొలి వరానివి. వాహ్. ఎంత అద్భుతంగా రాసారో..
       నీ స్నేహంలొ వెలిగే వెన్నెల్లో
                  కొనాళ్ళయినా సంతోషంగా గడిచాయనుకోనా
       నా ఊహల్లో కలిగే వేదనలో
                  ఎనాళ్ళైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
       చిరు నవ్వుల పరిచయమా సిరి మల్లెల పరిమళమా
                  చేజారిన ఆశల తొలి వరమా... 

Youtube link : http://www.youtube.com/watch?v=62W-xiJABTQ&feature=related

Thursday, November 25, 2010

పుటుక్కు జర జర డుబుక్కు మే

"పుటుక్కు జర జర డుబుక్కు మే.. " ఎక్కడో విన్నట్లు ఉంది కదూ.. ఈ వాక్యం గురించి ఏదో చిత్రంలో ప్రకాష్‌రాజ్ మాట్లాడతాడు. ఈ వాక్యానికి చాలా పెద్ద అర్థం చెబుతాడు. కానీ నాకు ఈ వాక్యం వినగానే మాత్రం గుర్తొచ్చేది "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రం లోని "పారిపోకే పిట్టా" పాట.మన అందరికీ తెలిసిన విషయమే.. సీతారామ శాస్త్రి గారు అతి సులువైన, అందరికీ అర్థమయ్యే పదాలతో ఎంత గొప్ప భావాన్నైనా పలికించగలరని. ఈ పాటని కూడా అలాగే చాలా సులువైన పదాలతో అర్థవంతంగా రాశారు.
తన ప్రియురాలికి దూరమై ఎలాగైనా చెలి చెంతకి చేరుకోవాలని సంకల్పంతో చేసే ప్రయాణంలో ఉన్న ఒక ప్రియుడి ఆరాటం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ పాటలో మనకి. నాకు ఈ పాట వింటూంటే నిజంగా దోసెడు విరజాజుల్ని తెచ్చి ముద్దగా మాలకట్టినట్లుగా అనిపిస్తుంది. అంత అందమైన పదాల అల్లిక ఈ పాట. ఇందులో ఎక్కువగా ఆకర్షించిన పాత్ర ప్రభుదేవాది. ప్రియుడి కబురుని ప్రియురాలి చెంతకు చేర్చమని రకరకాల పక్షులకి విన్నవిస్తాడు.

పాట మొదలుపెట్టడమే పారిపోయే పిట్టతో మొదలు పెడతారు. పారిపోయే ప్రేమ పిట్టను పారిపోవద్దని చాలా గారంగా బ్రతిమాలుతూ చెంతకు చేరకపోతే ఎలా అని గద్దిస్తూ.. మజిలీ చేర్చవా, నీ వెంటే వస్తాగా అంటూ.. చాలా నచ్చింది నాకు ఈ పల్లవి.

       పారిపోకే పిట్టా.. చేరనంటే ఎట్టా
       అంత మారాం ఏంటంట మాట వినకుండా
       సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా
       తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట..

అనుకోని పరిస్థితుల్లో ప్రేమికులు ఇద్దరూ దూరమైనప్పుడు ఎవ్వరూ సంతోషంగా ఉండరు. విచిత్రం ఏమిటంటే, ఎవరికి వారు అవతలి వారు సంతోషంగా ఉంటే చాలు అని ఆశ పడుతూ ఉంటారు. ఇంత సున్నితమైన ప్రేమికుల మనస్తత్వాన్ని చాలా అందంగా వర్ణించారు సిరివెన్నెల. ప్రియుడు తన సంతోషాన్నంతా తన చెలితో పంపించాడట. ఇక్కడింకో చమత్కారం.. ప్రియుడి పేరు సంతోష్. తన సంతోషాన్నంతా ప్రియురాలి వెంట పంపించాడట ఆ సంతోష్. మరి తన చెలి ఆ సంతోషాన్ని భద్రంగా చూసుకుంటుందో లేదో అని బెంగ. చెలి సంతోషంగా ఉందో లేదో అన్న సందేహాన్ని ఇంత కన్నా అందంగా ఎవరూ వ్యక్త పరచలేరేమో అన్నంత అందంగా రాసారనిపించింది. 
ప్రతి క్షణం ఎంతో సరదాగా నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే అతను, తన అల్లరిని, చిందర వందర సరదాని చెలి అందెలుగా తొడిగాడట. (తన అల్లరి తనకు దూరమై అతను ముభావంగా ఉన్నాడన్నది కనిపించే సత్యం.) మరి ఆ అందెల్ని ప్రతి రోజూ సందడిగా ఆడిస్తుందా లేదా అన్న సందేహం.కానీ ఇలా విడిపోయినప్పుడు ఆ ప్రేయసి మాత్రం సంతోషంగా అల్లరిగా ఎలా ఉండగలుగుతుందండీ..?? అదొక ఆశ అంతే..

       నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
       భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా
       తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా
       ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా

ఇక్కడే సందేహాలకి సమాధానాలు కూడానూ.. చెలికొమ్మ చినబోయిందనుకుంటా.. ప్రియుడి కోసమే ఎదురు చూసే తన ప్రియురాలి గుండె గూటికి అతను వచ్చేస్తున్నాడని ముందు గానే కబురు చెప్పమంటూ చిలుకమ్మని వేడుకోవడం.. అతడు వచ్చేలోగా విన్న కథలన్నీ ఆ అమ్మాయికి చెప్పమని కాకమ్మని కోరడం..
       
       చినబోయిందేమో చెలి కొమ్మ..
       ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా
       నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి
       నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా…
       తీసుకుపో నీ వెంట..వస్తా తీసుకుపో నీ వెంట

ప్రేమలో ఉన్నా విరహంలో ఉన్నా ఆకలి నిద్దుర ఉండవట. ఇటువంటి ప్రయోగం చాలా పాటల్లో, కథల్లో, కవితల్లో చూసా కానీ ఇంత అందంగా అయితే ఎప్పుడూ చూడలేదు. ప్రియుడి దారిలో ఆకలి కనిపించిందట. అన్నం పెట్టను పోవే అని కసిరిందంటూ ప్రేయసి నిందించిందట. తన వద్దకు రావొద్దని తరిమేసినందుకు నిద్దుర చాలా చిరాగ్గా కనిపించిందట ప్రియుడికి.. నాకు ఈ ప్రయోగాలు ఎంత బాగా నచ్చాయో..

       ఆకలి కనిపించింది…నిన్నెంతో నిందించింది
       అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
       నిద్దర ఎదురయ్యింది..తెగ చిరాగ్గ ఉన్నట్టుంది
       తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది

ప్రేమా.. నిన్ను ఎదిరించే వాళ్లు, నువ్వడిగింది ఇవ్వని వాళ్లంటూ ఎవరూ లేరన్న సత్యం నీకు కూడా తెలుసు కదా.. మరి ఎందుకమ్మా ఇంత గారం చేస్తావు. నీ పంతం ముందు ఏ రోజైనా ఏ ఘనుడైనా గెలిచినట్లు చరిత్రలో లేదు కదా..

       ఏం గారం చేస్తావే ప్రేమ
       నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
       ఆ సంగతి నీకూ తెలుసమ్మా
       నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
       తీసుకుపో నీ వెంట..
       ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట
       తీసుకుపో నీ వెంట..తీసుకుపో నీ వెంట

Youtube Link : http://www.youtube.com/watch?v=MiQoDE6Jqjc

Tuesday, October 26, 2010

మమత కొలువులోని పెళ్లికి ఆహ్వానం..

పెళ్లంటే మామూలు పెళ్లి కాదు.. అనురాగాన్ని మంత్రంగా.. అనుబంధాన్ని సూత్రంగా చేసుకుని, మమతల కొలువులో జరుగుతున్న పెళ్లి.. అమ్మాయికి అత్తయ్యే దగ్గరుండి అమ్మలా జరుపుతున్న పెళ్లి.. ఆడకూతురు ఒక పైశాచిక మృగం చేతుల నుండి తప్పించుకుని, మరో ప్రేమమూర్తి హృదయంలోకి అడుగిడటానికి చేసుకుంటున్న పెళ్లి.. "పెళ్లి" చిత్రంలోని ఆ పెళ్లి సన్నివేశం ఎంత హృద్యంగా ఉంటుందో, కన్నులకు కట్టినట్లు చూపించింది దర్శకుడు కోడి రామకృష్ణ అయితే, దాన్ని మనసు లోపలి వరకూ చేరవేసింది మాత్రం ఖచ్చితంగా సిరివెన్నెలే.. 
అత్తా కోడళ్లు అంటే అదొక కత్తి మీద సాము లాంటి బంధంగా సృష్టించేశాం మనం. మరి ఇలా అత్తే ఒక తల్లిలా జరిపే పెళ్లి అయితే నా కంట పడలేదు. కానీ ఒకవేళ జరిగితే ఎలా ఉంటుందీ..?? ఇదిగో ఈ కింద ఉన్నంత అందంగా ఉంటుంది..:)
అనురాగం అనుబంధం కలగలిసి మమతల కొలువులో జరుపుతున్న పెళ్ళికి ఇచ్చే మంగళ వాయిద్యం ఇది.. విని తరించండి మరి..

అనురాగమే మంత్రంగా
అనుబంధమే సూత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్ళికి
మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం(2)


పెళ్లంటే మూడు ముళ్లేనా.? ఏడడుగులేనా..? కాదు.. వాటికి అతీతంగా ఇంకేదో ఉంది.. ప్రపంచమంతా ఏకమై నిన్ను వెలేసినా నీకు నేనున్నానన్న నమ్మకాన్ని అందించడం.. అసలు మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతమట హిందూ సంప్రదాయం ప్రకారం..ఇక ఏడడుగులేమో వధూ వరులకి ఎన్నడూ విడిపోని స్నేహబంధాన్ని పెనవేస్తుందని మన గట్టి నమ్మకం. మూడు ముళ్లకి, ఏడు అడుగులకి మనం ఇచ్చిన గౌరవం అలాంటిది.. మరి, నాతిచరామి అని ప్రమాణాలు చేసిన అబ్బాయి, లేదా పుట్టిల్లు ఒక కన్ను, అత్తిల్లు రెండో కన్ను అని ఆ రెండిటి గౌరవం నిలబెడతా అని మాటిచ్చిన అమ్మాయి వాటిని నిలబెట్టుకోలేకపోతే (నిలబెట్టుకోకపోతే..) శిక్ష ఎవరికి..?  ఈ చిత్రం విషయంలో మాత్రం తప్పు అబ్బాయిదే.. శిక్ష అమ్మాయికే.. కానీ తన దురదృష్టానికి ఆ ఆడకూతురు కృంగి పోలేదు.. పెళ్లి అంటే కేవలం మూడు ముళ్లే కాదు అని తెలుసుకోవడమే కాకుండా ప్రేమగా చేరువైన ఒక స్నేహ బంధాన్ని మరో ముడిగా జత చేసుకుంది. ఏడు అడుగులు వేసి అక్కడితో ముళ్లపొదలో ఆగిపోయిన తన జీవితానికి ప్రేమ అను ఎనిమిదో అడుగుతో మళ్లీ వసంతపు బాటల్ని పరుచుకుంది.. నాతిచరామి మంత్రానికి అర్థం తెలిసిన మనిషి అడుగుల్లో తన అడుగులు కలుపుకుంటూ, ఒక కొత్త రకపు వెలుగులతో నిండిన తన కొత్త జీవితపు పుటల్ని తెరుచుకుంటూ కదిలిపోయే సమయమట.. అంతే కాదు, ఇది ఆగని పయనమట.. అద్భుతం కదూ...

మూడు ముళ్ళతోనే పెళ్లి పూర్తి కాదు అని
మరో ముడిగ చేరుకున్న స్నేహ బంధమిది
సప్తపదితో ఆగరాదు జీవితం అని
అష్టపదిగ సాగమన్న ప్రేమ పదము ఇది
నాతిచరామి మంత్రములో అర్ధం తెలిసిన నేస్తముతో
అడుగు కలుపుతూ వెలుగు వెతుకుతూ సాగే సమయమిది
ఆగని పయనమిది.....

అనురాగమే మంత్రంగా..........

సాధారణంగా కొడుకు ఎంత కౄరుడైనా తల్లి గుండె తన పిల్లల కోసమే కొట్టుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం, కొడుకు పైశాచికత్వానికి కోడలు బలవ్వడం చూసి తనలోని నిజమైన మాతృత్వాన్ని తట్టి లేపిన ఒక తల్లి కనిపిస్తుంది.. కోడలి జీవితం బాగుండాలని జరిగిపోయిన మూడు ముళ్లు, ఏడు అడుగుల పెళ్లి అనబడు ఒక పీడ కలకి మరో ముడిని, మరో అడుగుని జత పరిచి ఒక కొత్త అంకాన్ని కోడలుకి ప్రసాదిస్తుంది..ఆడదంటే ఆడదానికి శతృవు కాదు, అత్త కూడా ఒక అమ్మే అని నిరూపిస్తుంది.. మరి జీవితమంటే బ్రహ్మ ఆడుకుంటున్న బొమ్మలాటేగా.. కానీ ఆ బ్రహ్మ రాతని కూడా మార్చి చూపిస్తుంది మన మానవత్వం. ఇంతవరకూ చరిత్రలో ఎక్కడా జరగని/చదవని మొదటి కథగా, కేవలం మూడు ముళ్ల బంధంలా కాకుండా మనసులు పెనవేసిన సంబంధంగా తరతరాలకూ నిలిచిపోండని అత్తయ్య ఒక తల్లిగా దీవించే చల్లని తరుణం..

ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని
అత్త గుండెలోన కూడ అమ్మ వున్నదని
బొమ్మలాటలాడుతున్న బ్రహ్మ రాతలని
మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది
చరితలు చదవని తొలి కథగా
మనసులు ముడి పడు మనుగడగా
తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగ దీవించే
చల్లని తరుణమిది

అనురాగమే మంత్రంగా..........

ఈ సన్నివేశానికి ఇంత కన్నా అందమైన పదాల కూర్పుని ఎవ్వరూ అందించలేరన్నంత అందంగా రాశారు మన సీతారామ శాస్త్రి గారు.. ఇంతకన్నా ఆయన గురించి చెప్పడానికి నాకు మాటలు లేవండీ. జీవితంలో ఒక్కసారి ఆయన్ని కలిసి పాదాభివందనం చేస్తే ఈ జీవితానికి చాలు అనిపిస్తుంది..
నాకు ఈ పాట Youtube లో దొరకలేదు, క్షమించగలరు లింక్ ఇవ్వలేకపోతున్నందుకు..

Thursday, October 21, 2010

పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా..


జీవితం మీద ఎన్నో ఆశలతో, ఇంకా ఏదో మంచి జరగాలనే కోరికలతో, బోలెడన్ని మనసులోనే కోరేసుకుంటూ గుళ్లు గోపురాలూ తిరుగుతూ ఉంటాం.. అసలు ఆ ప్రదేశాల దగ్గరకు వెళ్లగానే ఏదో తెలియని ప్రశాంతత.. అంతెందుకు, ఎక్కడైనా దేవుడి పాటలు విన్నా, గుడి గంటలు దూరంగా వినిపించినా ముఖ్యంగా హారతి కనిపించినా అప్పటి వరకూ మనసు అడుగుల్లో ఎక్కడో దాగి ఉన్న భక్తి  బైటికి వస్తుంది. దేవుడి పాటలకి, గుడి గంటలకి, హారతికి ఉన్న గొప్పతనం అలాంటిది.

ఒక్కసారిగా జీవితం ఆగిపోతుంది.. మన ఆలోచనలు, మన అనుభవాలు, అనుభూతులు, ఇష్టాయిష్టాలు, అనుబంధాలు, అన్నీ.. అన్నీ ఆగిపోతాయి ఉన్నట్టుండి. కాదు.. చావు మనకి దూరం చేస్తుంది వీటన్నిటినీ. మరి చనిపోయాక..? వేటి సంగతి ఎలా ఉన్నా దేహాన్ని మాత్రం ఒక నిప్పు కణిక కాల్చేస్తుంది..
అక్కడ హారతి.. ఇక్కడ చితి.. రెండూ ఒకే నిప్పు కణిక.. కానీ అర్థం చేసుకోడానికి ఒక జీవితకాలం పట్టేంత లోతైన భేదం ఉంది వాటి మధ్య.

చూడగానే అర్థం అయిపోయింది అనిపిస్తుంది మన సిరివెన్నెల గారి సుస్వాగతం చిత్రంలోని "ఆలయాన హారతిలో" అన్న పాట. కానీ విన్న ప్రతి సారీ కొత్త అర్థాన్ని వివరిస్తూ ఉంటుంది పాటలోని ప్రతి మాట..  ప్రేమ అమృతమా హాలాహలమా అన్న అతి సున్నితమైన విషయాన్ని చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, సులువైన పదాలతో వర్ణించారు.

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో..
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం..
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం..
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..


తన ప్రియురాలు ఖచ్చితంగా కనిపిస్తుంది అన్న గుండెలోని ఆశ తడి ఆవిరి అవుతున్నంత మాత్రాన, ఎండమావిలో తన చెలి ఉనికి కనిపిస్తుందా..! వాహ్.. ఎంత అద్భుతమైన వర్ణన.. ప్రేమ ఉంటే చాలు, ప్రపంచమంతా కనిపించడం మానేస్తుంది.. ప్రేమ ప్రపంచాన్ని మరిపిస్తుంది.. కానీ, కనిపించని ఆ ప్రేమ జాడని కనుక్కోవడం ఎంత కష్టం.! కనిపించని ఆ ప్రేమ ఆచూకీ కోసం ప్రపంచాన్ని, తనని మర్చిపోయి వెతుకుతూ తిరిగే ఒక మనసు వ్యధ ఇది. ఆ ప్రేమ జాడ తెలియని ప్రాణం, చుక్కలు దిక్కులు అన్నీ దాటుకుంటూ చేసే ప్రయాణమే ఈ పాట.  "ఎదుట ఉంది నడి రేయన్నది ఈ సంధ్యా సమయం" .అద్భుతం.. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో శాస్త్రి గారికి..

ఎండమావి లో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా..
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా...
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా...
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదుట ఉంది నడి రేయన్నది ఈ సంధ్యా సమయం..
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..


కొడుకు అనే కనుపాపను, తండ్రి అనే కనురెప్ప ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుంటూ ఉంటాడు. మరి అటువంటి కనుపాప కళ్లు తెరవకుండా కనే కల కోసం, తండ్రి సూర్యుడు కన్ను మూశాడట.. ఎంత బాగా పోల్చారు.. ఆ విషయం తెలియని కనుపాప ఇంకా కలవరిస్తూనే ఉందట తనకు కనిపించని ప్రియురాలి కోసం..  తనకు ఆయువిచ్చి, పెంచి పెద్ద చేసిన నాన్న అనే బంధం తన గురించే ఆలోచిస్తూ, ఏదీ చెప్పలేని మౌనంలో కాలిపోయినా కూడా, కనుల ముందుకు రాకుండా చీకటి తెరల వెనుకనే దాగి ఉన్న స్వప్నం కోసం తను ప్రారంభించిన వెతుకులాట ఆగలేదు కదా.. "పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా.." ఎంతో గొప్ప ఫిలాసఫీ ఇంత చిన్న పదాలతో నిర్మించబడిన ఒకే వాక్యంలో ఎలా పొదగబడిందంటారు..??
శాస్త్రి గారు.. మిమ్మల్ని పొగడడానికి నా దగ్గర మాటలు కరువయ్యాయండీ.. అద్భుతం.. హ్మ్.. చివరికి కనుపాప కలే కావాలి అడిగిందని నయనం శాశ్వతంగా  నిదురలోకి వెళ్లిపోయిందట..


సూర్య బింబమే అస్తమించెనుగ మేలుకోని కల కోసం..
కళ్లు మూసుకుని కలవరించెనే కంటి పాప పాపం..
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనం లో మసి అయినా..
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగెఆనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..


చిత్ర కథ మొత్తం ఒక్క పాటలో ఎంత అద్భుతంగా చెప్పారో కదా.. ఎక్కడో చదివాను... చేయి తిరిగిన రచయిత అంటే ఎన్నెన్నో గొప్ప గొప్ప పదాలు వాడేసి పెద్ద పెద్ద పుస్తకాలు రాసెయ్యడం మాత్రమే కాదట. అతి కొన్ని చిన్న చిన్న పదాలను ఉపయోగించి కూడా అర్థాన్ని ఎంతో అందంగా చెప్పగలగడం అట..  ఇక సిరివెన్నెల గారి గురించి ఈ విషయంలో చెప్పనవసరం లేదేమో కదూ.. 
Youtube Link : http://www.youtube.com/watch?v=sZAwHyQnEwQ

Friday, September 24, 2010

కరకు గర్జనల మేఘముల మేనికీ..

నాకు తెలిసి, తెలుగు మీద ఏ కొంచెం మమకారం ఉన్న వారి లిస్ట్ తీసినా ఈ పాటని ఇష్టపడని వారు ఉండరేమో.. తెలుగుదనం బ్రతికి ఉన్నంతవరకూ తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారికి ఈ పాట ఒక విందుభోజనమే.. అంతటి అందమైన అద్భుతమైన పాట ఇది.. ఏదా అని చూస్తున్నారా..? మన సీతారామ శాస్త్రిగారికి "సిరివెన్నెల" అని నామకరణం చేసిపెట్టిన చిత్రంలోని "ఆదిభిక్షువు వాడినేది కోరేదీ.."  నే చెప్పింది నిజమే కదా..:)

భక్తి అంటే కేవలం అర్చనలు, అభిషేకాలు, స్తోత్రాలేనా.? ఇవన్నీ అందుకుంటున్నప్పుడు భక్తులు నాలుగు మాటలు అన్నా పడాలేమో.. కానీ అదేంటో.. శివయ్యే అన్నిటికీ ముండుంటాడు.. వరాలిచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. తన అభయహస్తం తోనే తన నెత్తి మీదే కష్టాలు కొన్ని తెచ్చుకుంటాడు.. నిజమే భోళా శంకరుడు..:) అందుకే భక్తితో.. ప్రేమతో నాలుగు మాటలు అన్నా వరాల వర్షం కురిపిస్తాడు.:))
అందుకే.. అప్పుడెప్పుడో శ్రీనాధుడు ఆ శివయ్యని నానా మాటలు అనేసి వరాలు పొందేశాడు..
సిరిగల వానికి చెల్లును తరుణులు 
పదియారు వేల తగ పెండ్లాడన్
తిరుపమున కిద్దరాండ్రా పరమేశా
గంగ విడుము పార్వతి చాలున్ 

(ఈ పద్యంలో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్ద గలరు..)
పాపం.. శివయ్యకే అన్ని కష్టాలు కదూ.. ఇంతటితో ఊరుకుంటే ఏముంది..? ఇదిగో కింద ఉంది చూడండి.. మన సిరివెన్నెల ఎన్నెన్ని మాటలనేశారో ఆ శివయ్యని..


ఆది భిక్షువు వాడినేది కోరేదీ..
బూడిదిచ్చేవాడినేది అడిగేదీ..

ఏది కోరేది.. వాడినేది అడిగేదీ..(2)

తీపి రాగాల కోయిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది(2)
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన
వాడినేది అడిగేదీ..
ఏది కోరేదీ వాడినేది అడిగేదీ..(2)

తేనెలొలికే పూల బాలలకు
మూణ్ణాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేదీ..(2)
బండ రాళ్లను చిరాయువుగ
జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేదీ..
ఏది కోరేది వాడినేది అడిగేదీ..(2)

గిరిబాలతో తనకు కల్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసి జేసినాడు
వాడినేది కోరేదీ..
వర గర్వమున మూడు లోకాలు పీడింప
తలపోయు ధనుజులను కరుణించినాడూ..
వాడినేది అడిగేదీ...
ముఖ ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేదీ..
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడూ..




ఈ పాట గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది.. ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని ఎలా అందివ్వగలరో..!! ఈ పాట విన్నప్పుడల్లా, మనసు ఒక సంపూర్ణత్వాన్ని పొందిన భావన కలుగుతుంది. ఒక completeness, ఒక saturated feeling..  అలాంటి భావన. ఏమో మాటల్లో చెప్పలేక పోతున్నాను.. నా భావాన్ని చెప్పడానికి నాకు వచ్చిన భాష సరిపోవడం లేదు :(  భాషకందని భావం అంటే ఇదేనేమో.. లేదా.. నాకు వచ్చిన అతి కొంచెం భాష సరిపోవడం లేదేమో.. ఈ పాటకి నా మాటలు ఏమి జత చేసినా, అది పాట అందాన్ని తగ్గించడమే అవుతుంది.. అందుకే ఈ అందమైన భావాన్ని మనసులోనే దాచి పెట్టేసుకుందామని నిర్ణయించుకున్నాను.. :))


You Tube Link : http://www.youtube.com/watch?v=hRgJgo0hRMA
 

Sunday, September 19, 2010

అమ్మమ్మ.కాం

"టివి సీరియల్" అన్న పేరు వినగానే మనలో ఎంత మందికి తరువాత చెప్పబోయే మాటలు వినాలనిపిస్తుంది..? నాకు మాత్రం అసలు ఆ పేరు విన్న వెంటనే మొదట అక్కడి నుండి లేచి వెళ్లిపోవాలనిపిస్తుంది. అంత "ఇష్టం" నాకు సీరియల్స్ అంటే. కానీ మట్టిలోనే మాణిక్యం ఉన్నట్లుగా అలాంటి ఏడుస్తూ ఏడిపించే చెత్త సీరియల్స్ మధ్యలో ఒక మంచి సందేశాత్మకమయిన సీరియల్ చూసి విస్తు పోయాను (మొదట్లో..) అదే మన "అమ్మమ్మ.కాం".

నేనైతే ఎక్కువగా చూడలేదు కానీ, తెలిసిన వారు చెబితే అనుకున్నాను సీరియల్స్ కూడా ఇంత మంచిగా ఉంటాయా అని. సీరియల్ గురించి విస్తుపోవడం ఒక వంతైతే, ఒక అమ్మాయినో, అబ్బాయినో పెట్టి వెనకాల 20 మందిని పెట్టి సీరియల్ పేరుని పది సార్లు రాగయుక్తంగా పాడించేసి(ఆడించేసి) పాట అయిపోయిందనిపించే సాహిత్యం ఉంటున్న ఈ రోజుల్లో ఇంత మంచి పాట విని ఆశ్చర్యం ఆనందం రెండు ఒకే సారి కలగడం రెండో వంతు. ఈ పాట మీద ఆసక్తితో మన గూగులమ్మని అడిగి చూశాను. అందులో ఈ పాట గురించిన ఒక వీడియో చూశాను. అందులో సిరివెన్నెల గారు ఏమన్నారంటే " ఏదైనా సినిమాలో పాట అయితే కొన్ని సార్లు వినేసి, మళ్లీ కొత్త పాటల మోజులో పడిపోతాం. కానీ సీరియల్ కోసం రాసిన పాట అయితే 365 రోజులు ప్రతి ఇంట్లో వినాల్సి వస్తుంది. మరి ఆ పాట విన్న ప్రతి సారీ కొత్త అర్థాన్ని వినిపించగలగాలి. అదే ఈ నా ప్రయత్నం.."
నాకైతే సిరివెన్నెల గారు నూరు శాతం తను కోరుకున్నది సాధించారు అనిపించింది. కావాలంటే మీరే చూడండి..


పల్లవి :
ఏ దారమూ పంపందే వెళ్లదే ఆ మబ్బుదాకా గాలిపటం..
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టి తో తన చుట్టరికం..
ఉన్నపాటుగా.. కలగలేదుగా.. చందమామనే చేరే ఙ్ఞానం.
చిన్ననాటనే.. మొదలయిందిగా.. దాయి దాయనే ఊహా గానం.
నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం.
వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడీ తీరం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.

చరణం:
అపుడు అపుడూ గతమే వెతుకు సుడిలో పడితే సలహా అడుగూ..
గడిచిన రోజులు తలవడమెందుకు ఏం లాభం అనకూ..
ఏ దిక్కులు తోచని చిక్కుల దారిని దాటిన
నాటి స్మృతి చూపద నీ ప్రగతి..
లక్షంటే తనకై  తానే వెనకకు జరిగిన ఒకటికి అర్థం..
ఆ ఒకటే లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్ధం..
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.

చరణం:
గుహలే గృహమై ఒదిగే బ్రతుకు మహలే నెలవై ఎదిగే వరకు
ఏ ఆలోచన వేసిందో కద ఎపుడో ముందడుగూ..
ఆ రాతియుగాలను నేటి సుఖాలుగ
మలచిన ఆశలకు మొదలేదో అడుగూ..
వేగంగా రివ్వూరివ్వున గాల్లో దూసుకు పోయే బాణం
తననొదిలిన విల్లేదంటే ఏమో అంటే చేరదు గమ్యం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.


మనం ఎంత ఎత్తుకి ఎదిగినా,అంతరిక్షం లోకి వెళ్లినా, ఒకప్పుడు నిలబడ్డ నేలని, ఆ అనుభవాలని మర్చిపోవద్దు అని ఎంత సున్నితంగా చెప్పారో.. నేను చూసిన వీడియోలోనే చెప్పారు సిరివెన్నెల. మన తరువాత తరాలు అంతరిక్షంలోకి వెళ్లిపోయి, అక్కడే వేరు వేరు గ్రహాల్లోనో, అక్కడ కూడా స్థలం సరిపోకపోతే శాటిలైట్స్ లోనే నివాసాలు ఏర్పరుచుకుని ఉండిపోవచ్చు. మరి అప్పుడు వారికి ఏ విషయంలో అయినా అనుమానాలు సందేహాలు వగైరా వస్తే వెంటనే అప్పుడెప్పుడో మన అమ్మమ్మలు తాతయ్యలు భూమి మీద ఉన్నప్పుడు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏమి పాటించారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ కాలానికి తగ్గట్లుగా, తరానికి తగ్గట్లుగా దానిని అక్కడ కూడా అప్లై చెయ్యొచ్చట.:)
అందుకే పాటలో చెప్పారు,
"అపుడు అపుడూ గతమే వెతుకు సుడిలో పడితే సలహా అడుగూ..
గడిచిన రోజులు తలవడమెందుకు ఏం లాభం అనకూ."


 ముఖ్యంగా నాకు ఈ పాటలో నచ్చిన వాక్యాలంటే
"నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం.
వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడీ తీరం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం."

అయినా అసలు ఏ పదం గురించి చెప్పాలి..? ఏ వాక్యం గురించి చెప్పాలి. మీరే చెప్పండి.
"ఏ దారమూ పంపందే వెళ్లదే ఆ మబ్బుదాకా గాలిపటం..
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టి తో తన చుట్టరికం.."
ఎంత బాగంటుంది కదా.. నిజమే, ఈ ప్రపంచంలో ఏదీ కూడా తన బేస్ ని మర్చిపోదు. మనుషులే ప్రతి దాంట్లో ముందుంటారు. మర్చిపోయే విషయంలో కూడా..

మనుషులు అంతరిక్షంలో కి వెళ్లారు, చందమామని ముద్దాడి వచ్చారు అంటే అది కేవలం సాంకేతిక పరిఙ్ఞానం మరియు సాధించాలి అన్న తపన అని తెలుసు. ఇలా చిన్నప్పుడు అన్నం తినకపోతే అమ్మ చందమామని చూపించి "దాయి దాయి" అని పిలిచినప్పుడు కలిగిన ఇష్టం అని తెలియదు.

అదేంటో పాట విన్న ప్రతి సారి కొత్త అర్థాన్ని ఇవ్వడం అంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇలా ఇప్పటికే ఒక నిర్వచనం కలిగి ఉన్న విషయాలకి మళ్లీ కొత్త నిర్వచనం ఇస్తారని మాత్రం తెలియదు.
లక్షంటే తనకై  తానే వెనకకు జరిగిన ఒకటికి అర్థం..
ఆ ఒకటే లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్ధం..


గుహల్లోనే మన జీవితాలని గడిపి రాళ్లతోనే మిగిలిపోవాల్సిన మనం ఇలా సుఖ సౌఖ్యాలతో జీవించే స్థాయికి ఎదిగాం అంటే అసలు ఈ ఆశలకి ఆలోచనలకి మొదలు ఎక్కడ ఉండుంటుందంటారు..? కాస్త తెలిస్తే చెబుదురూ..:)) 

ఈ పాటలో మరో గొప్ప విషయం ఏమిటంటే..  Picturisation కూడా చాలా బాగుంటుంది. పాట అంతా.. ఒక అమ్మాయి పుట్టినప్పటి నుండీ పెళ్లయ్యి, అమ్మ అయ్యి, అమ్మమ్మ కూడా అయినంత వరకూ చూపిస్తారు. కానీ ఎక్కడా ఆ అమ్మాయి ముఖం కూడా చూపించరు.. చాలా కొత్తగా అనిపించింది:))
YouTube Links:
http://www.youtube.com/watch?v=sAuXk3RBJPM
http://www.youtube.com/watch?v=9U5owvrCVF8

Wednesday, August 18, 2010

నీదో కాదో రాసున్న చిరునామా..

ఆకాశం నాభి నుండి పరుగు పరుగున కిందికి దూకే వాన.. నేల తల్లి పొత్తిళ్ల లోకి పసి బిడ్డలా ఒదిగి పోయే  వాన; ఒక్కో సారి అతి సుకుమారంగా, ఒక్కో సారి భయంకరంగా, మరో సారి బాధ్యతలా.
మీరూహించింది నిజమే.. ఇప్పుడు మనం "వాన" చిత్రం లోని పాటను గుర్తు చేసుకోబోతున్నాం.. ఈ మధ్యనే సిరివెన్నెల గారు ఒక interview లో చెప్పిన మాటలు (కొన్ని మార్పులతో): "ప్రేమ అనబడే ఈ అర్థం లేని భావాన్ని ఎందులో అని చూపించగలం..? ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. తల్లి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రి కూతురి మధ్య, భార్యభర్తల మధ్య. ఇవన్నీ ప్రేమలే.. నిజానికి ప్రేమ అనేది రంగు రూపు లేని ఒక ఫీలింగ్. అందుకే ప్రేమను వర్ణించడానికి నేను తీసుకునే వస్తువులు సాధ్యమైనంత వరకు ప్రకృతిలోంచి పుట్టినవై ఉంటాయి. చినుకు, ఆకాశం, నేల, గాలి, చెట్టు, ఆకు, పువ్వు, కాయ వీటన్నిటిల్లో కూడా ప్రేమ ఉంటుంది. ఇవన్నీ ప్రేమకు స్వరూపాలే." 
మరి వాన లో వర్ణించిన ప్రేమ ఎలా ఉందో చూద్దామా.!


ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో...
ఎదను తడిమింది నేడు.. చినుకంటి చిన్నదేమో...
మైమరచి పోయా మాయలో... 
ప్రాణమంత మీటుతుంతే.. వాన వీణలా...                     "ఎదుట నిలిచింది"

నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి...
కలే అయితె ఆ నిజం ఎలా తట్టుకోవాలీ....
ఔనో కాదో అడగకంది నా మౌనం...
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం...
చెలిమి బంధమల్లుకుందే.. జన్మ ఖైదులా..ఆ..               "ఎదుట నిలిచింది"

నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందొ నా లేఖా...
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా..
నీదో కాదో రాసున్న చిరునామా...
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ...
వరం లాంటి శాపమేదో.. సొంతమైందిలా..ఆ...               "ఎదుట నిలిచింది" 


ఎక్కడో విన్నాను, ప్రేమంటే ఒక తీపి బాధ అట. ఈ పాట వింటే అది నిజమేనేమో అనిపిస్తుంది.. అంతటి తియ్యని ప్రేమలోని బాధని, కలో నిజమో తెలియని అయోమయాన్ని చాలా అందంగా.. అందమైన పదాలతో వర్ణించారు. వింటున్నంత సేపూ, విన్న తరువాత కూడా చాలా సమయం మనసంతా ఏదో తెలియని హాయితో నిండి పోయి ఉంటుంది. కారణం.. పదాల అల్లిక కొంత అయితే, ఆ అల్లికకు అందించిన సంగీతం, గానం ఇంకా అద్భుతం.
ఈ పాటలో చాలా గొప్ప గొప్ప పదాలు, గంభీరమైన పదాలు అంటూ ఏవీ లేవు. చాలా మామూలు పదాలతో ఇంతటి అందాన్ని సృష్టించారు సిరివెన్నెల. ముఖ్యంగా తన ప్రేమ ప్రియురాలి వరకూ చేరిందా లేదా అన్న అనుమానం/ అయోమయం ఎంత చక్కా చెప్పారంటే..
"నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందొ నా లేఖా...
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా..
నీదో కాదో రాసున్న చిరునామా...
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ..."
నిజంగా అద్భుతం..:) మనసుకు ప్రశాంతంగా ఉంటుంది వింటున్నంత సేపూ..

కలో నిజమో తెలియని సందిగ్ధ స్థితి..
"నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి...
కలే అయితె ఆ నిజం ఎలా తట్టుకోవాలీ...." 

"చెలిమి బంధమల్లుకుందే.. జన్మ ఖైదులా" చెలిమి బంధం జన్మ ఖైదట.. అసలు అలా వర్ణించాలన్న ఆలోచన ఎలా వచిందబ్బా.. 
అన్ని రకాల పాటలు ఎంత అలవోకగా రాసేస్తారో సిరివెన్నెల గారు. ఆ పాత్ర లోకి దూరిపోయి రాస్తే తప్ప ఇంత అందమైన పాటలు రావు మరి..
 


Tuesday, August 3, 2010

సిరివెన్నెల - పట్టుదల

నిన్న రాత్రి ఈటీవీ లో బాలు గారి ఆధ్వర్యంలో నిర్వహించే "పాడుతా తీయగా" కార్యక్రమం చూశాను. సిరివెన్నెల గారు అతిథి.. మొదటగా, నాకు ఈ విషయం చెప్పి కార్యక్రమం చూడమని చెప్పిన నా ఫ్రెండ్ నాగేంద్రకు ధన్యవాదాలు. (సాధారణం గా టీవీ ఎక్కువగా చూడకపోవడం వల్ల నాకు లోక ఙ్ఞానం కొంచెం తక్కువ :) ).
ఆ కార్యక్రమంలో ఒకతను పాడిన పాట ఇంకా నా మదిలో తిరుగుతూనే ఉంది. 'పట్టుదల ' చిత్రం లోని "ఎప్పుడూ.. ఒప్పుకోవద్దురా ఓటమి". ఈ పాట చాలా మందికి తెలిసే ఉంటుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నట్టు గుర్తు.. మళ్లీ నిన్న విన్నాను. ఆ చిత్రం చూసినట్లు కూడా  నాకు గుర్తు లేదు. ఈ పాట పాడిన తరువాత, సిరివెన్నెల గారు ఈ పాటకి సంబంధించిన కొన్ని ఙ్ఞాపకాలని ప్రేక్షకులతో పంచుకున్నారు. పాట ఈ విధంగా సాగుతుంది.


ఎప్పుడూ.. ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ.. వదులుకోవద్దురా ఓరిమి..
విశ్రమించవద్దు ఏ క్షణం..
విస్మరించవద్దు నిర్ణయం..
అప్పుడే నీ జయం నిశ్చయం రా..                                          "ఎప్పుడూ"


నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా..
నీరసించి నిలిచి పోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణా..
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా..
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
ఆశయమ్ము సారధౌనురా.. (దీక్ష కన్న సారధెవరురా).. 
నిరంతరం ప్రయత్నమున్నదా.. నిరాశకే నిరాశ పుట్టదా..
ఆయువంటు ఉన్న వరకు చావు కూడ నెగ్గలేదు శవము పైనె గెలుపు చాటదా..
(నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటయ్యితే..)                  "ఎప్పుడూ"


నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా..
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా..
(పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హుంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా.. )
గుటక పడని అగ్నిగుండం సాగరాన్ని ఈదుకుంటు తూరుపింట తేలుతుందిరా..
(ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి అవధులన్ని అధిగమించరా.. )
నిశా విలాసమెంత సేపురా.. ఉషోదయాన్ని ఎవ్వడాపురా..
(త్రివిక్రమా పరాక్రమించరా.. విశాల విశ్వమాక్రమించరా...)
రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా..
(జలధి సైతమార్పలేని జ్వాల వోలె ప్రజ్వలించరా..)                     "ఎప్పుడూ"




ఇక ఈ పాటకి సంబంధించి సిరివెన్నెల గారి ఙ్ఞాపకాల విషయానికి వస్తే, మొదటగా సిరివెన్నెల గారు పై విధంగా పాట రాసి ఇచ్చారంట. కానీ, ఆ చిత్ర నిర్మాత గారు ఈ పాటలో కొన్ని వాక్యాలు మార్చి ఇమ్మని చెప్పారంట.సాధారణంగా ఎవరితోనూ గొడవ పడని సిరివెన్నెల గారు ఈ పాట గురించి ఆ చిత్ర నిర్మాతతో గొడవ పెట్టుకున్నంత పని చేశారంట. ఈ పాటలో ఏదైనా మార్చాల్సి వస్తే ఆ చిత్రంలోని తన పాటలు అన్నీ తీసెయ్యమని చెప్పారంట (ఆ చిత్రం లో అన్ని పాటలు సిరివెన్నెల గారే రాశారు(ట)). కానీ చివరికి నిర్మాత గారు చెప్పినట్లుగానే మార్చాల్సి వచ్చిందట. బ్రాకెట్లలో పెట్టినవి మారిన వాక్యాలే. 
పాట భావానికి వస్తే, నిజానికి నాకు ఈ పాట ఏ సందర్భంలో వస్తుందో కూడా తెలియదు. కానీ వినగానే ఏదో తెలియని ఉద్రేకం.. ఇంకేదో.. ఏమో చెప్పలేకపోతున్నాను. ఏదో సాధించెయ్యగలను అన్న నమ్మకం. పదాల ఇంద్రజాలపు కెరటం ఉవ్వెత్తున ఎగసిపడి నా మీదకి వచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న భావన.
"నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా.."
ఎంత చేదు సత్యం కదా! జననం నుండి మరణం వరకూ ప్రతి విషయంలో ఏదో ఒక విధంగా కష్టాలు కలుగుతూనే ఉంటాయి. అలా అని నీరసించిపోతే.. ఇంక మనకంటూ ఏదీ మిగలదు. అసలు బ్రతుకంటేనే నిత్య ఘర్షణ.. అద్భుతమైన వర్ణన.
"దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా"
మనకి దేవుడు అన్నీ సమకూర్చినా, ఇంకా ఏదో తక్కువ చేశాడని నిందిస్తూ ఉంటాం.. దేన్నీ సాధించకపోడానికి వంద కారణాలు వెతుక్కుంటాం.. కానీ ఏ అవయవ లోపం లేకుండా.. అన్నీ చెయ్యగలిగే స్థితిలో ఉన్నాం అంటే మనం ఎంత అదృష్టవంతులమో గుర్తించం.. దేహం, ప్రాణం, నెత్తురు, సత్తువ వీటన్నిటికన్నా గొప్ప సైన్యం ఉండదట.  ఆశ అస్త్రం.. శ్వాస శస్త్రం.. నీ ఆశయం నిన్ను నడిపే సారథి. అద్భుతం కదూ!. నీ నిరంతర ప్రయత్నంతో నిరాశకే నిరాశ పుడుతుందట. నీకు ఆయువున్నంత వరకూ.. నీపై చావు కూడా నెగ్గలేదు. కేవలం నీ శవం పైనే తన గెలుపు చాటుకోగలదు.
"నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా..
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా.. 
గుటక పడని అగ్నిగుండం సాగరాన్ని ఈదుకుంటు తూరుపింట తేలుతుందిరా.."
ఈ వాక్యాలకి నా వ్యాఖ్యానం ఏదిచ్చినా, వాటి అందాన్ని/భావాన్ని తక్కువ చేసినదాన్నే అవుతానని భయమేస్తుంది.. అంత బాగా నచ్చాయి నాకు ఈ వాక్యాలు.అత్యద్భుతం..అంత గొప్ప గగనం ముందు, చిన్న చిన్న రెక్కలతో ఎగిరే గువ్వ పిల్లల రెక్క గొప్పట. మరి అవి, గగనం అంత పెద్దగా ఉంది కదా, మనం ఎగరలేములే అని గూడులోనే కూర్చోవు కదా..! సముద్రం ఎంత పెద్దదైనా, చిన్న చిన్న మొప్పలతో ఈదుతున్న చేప పిల్లల ముందు.. కాదు కాదు.. ఆ చేప పిల్లల మొప్పల ముందు ఆ సముద్రం కూడా చిన్నదేనట. సూర్యాస్తమయాన్ని ఇలా కూడా వర్ణించొచ్చని నాకు ఇంత వరకూ తెలియదు. ఆ సూర్యభగవానుడిని మింగడానికి అసుర సంధ్య పొంచి ఉంటుందట పడమర దిశలో.. కానీ.. ఆ అసుర సంధ్య, ఏరోజూ నెగ్గలేదట, ఎందుకనగా.. ఆ భాస్కరుడు మండుతున్న అగ్నిగోళమై సముద్రాలనీదుకుంటూ... తూరుపింట తేలుతాడట.. ఇది సూర్యోదయం.. సూర్యోదయాన్ని ఇలా కూడా వర్ణించొచ్చన్న విషయం కూడా తెలియదు.. ఆ నిశి ఎంతసేపు అలా ఆడుకుంటుంది..? ఎవ్వరూ ఆపలేని ఉషోదయం నిశి తలుపులు మూసేస్తుందిగా.. మన రగులుతున్న గుండె కూడా ఒక సూర్యగోళం లాంటిదేనట.. మరి, అగాధాల అసుర సంధ్యలు మనల్ని మింగడానికి ప్రయత్నించినా.. కష్టాల సంద్రాల్ని ఈదుకుంటూ తూరుపు విజయాలనందుకోవాలి.. అదే కదా జీవిత పరమార్థం.. ఏమంటారు...!!

Thursday, July 22, 2010

కొత్త బంగారు లోకం

ఇప్పుడు మనమొక కొత్త బంగారు లోకానికి వెళ్లొద్దామా.? ఏంటి అలా చూస్తున్నారు.? అర్థం కాలేదా..? ఈరోజు మనం పాడుకోబోయే పాట "కొత్త బంగారు లోకం " చిత్రం లోనిదండీ.. ఒక భావాన్ని పలికించడానికి, సిరివెన్నెల గారు ఎంచుకునే పదాలని, వాటి అల్లికని చూస్తూ ఉంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండీ.. ఆ గొప్పతనం నాకు ఈ పాటలో చాలా చక్కగా కనిపిస్తుంది. ఆయన రాసిన పాటల్ని పొగడ్డం మానేద్దామని నిశ్చయించుకున్నానా!! కానీ, మీరే చెప్పండి.. ఎలా మానాలి.? ఒక్కొక్క పాట వింటుంటే అభినందించకుండా ఉండలేకపోతున్నాను.ప్రతి పాటలో ఒక్కొక్క వాక్యం మనకి ఎన్నో విషయాలు చెబుతుంది. ఇంకా చిత్రం ఏంటంటే , విన్న ప్రతి సారి, అదే వాక్యం కొత్త అర్థాన్ని చూపిస్తుంది. ఆ వాక్యాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అటువంటి గొప్ప పాటల్లో మన కొత్త బంగారు లోకం పాట కూడా ఒకటి.


నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా
నీ చిక్కులు నీకే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా


అలలుండని కడలేదని అదిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా


పొరబాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా
మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె పెనుచీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేశాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే జతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాతా అనుకోదేం ఎదురీతా


పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా


"పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా"
పై వర్ణణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందంటారు సుమండీ..?నాకైతేనేమో, సిరివెన్నెల గారు కనిపిస్తే ఈ పాటలన్నీ విడి విడి గా చూపించి, ఆయా పాటలు రాసే సమయంలో ఆయన మనఃస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. అపుడైతే ఆయనకి ఇన్ని గొప్ప గొప్ప ఆలోచనలు ఎలా వచ్చేవో తెలిసిపోతుంది కదా.. నాకు తెలుసు, ఇప్పుడు మీరంతా నా తెలివితేటలు చూసి నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారని. కానీ, చెప్పొద్దూ.. నాకు చాలా సిగ్గు పొగడ్తలంటే.. ;)
"పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా" ఎంత గొప్పగా వర్ణించారు కదండీ కాలం కఠినత్వాన్ని. ఈ వాక్యం వినగానే నా చిన్న మెదడు ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది (వేదాంతమో, వైరాగ్యమో నాకు ఇప్పటికీ అనుమానమే..) మొత్తానికి నేనో పెద్ద వేదాంతి లాగా ఆలోచించేస్తూ ఉంటాను. కానీ నాకున్న సుగుణాలలో ఇదొకటి, నా వేదాంతం లాంటి వైరాగ్యంతో ఎవ్వరినీ కష్టపెట్టక పోవడం. మొత్తానికి నాకు బాగా అర్థం అయిన విషయం ఏమిటంటే.. నేను అసలు విషయాన్ని వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నానని.
కానీ ఏం చెయ్యాలండీ. నిజానికి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, గత కొద్ది రోజులుగా భోజనం ముఖం ఎరుగని మనిషి ముందు పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టి తిను అన్నట్లుగా ఉంది. (ముందు దేన్ని తినాలో అర్థం కాక వెర్రి చూపులు చూస్తూ..) ప్రతి వాక్యం లోనూ గొప్ప గొప్ప భావాన్ని దాచిపెట్టారు సిరివెన్నెల గారు. దేన్నని చూడాలి ముందు..? :( ఒకటి రాస్తూ ఉంటే అంతకంటే అందమైన వర్ణణ ఇంకోటి గుర్తొస్తుంది.
"మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె పెనుచీకటి చెబుతుందా"
నిజం చెప్పనా..? ఆ భాస్కరుడి గురించి నేను ఇంత గొప్పగా ఎప్పుడూ ఆలోచించలేదండీ.. ఇది చూసిన తరువాత మాత్రం ఆ సూర్య భగవానుడంటే ఏదో తెలియని గౌరవం, ఇష్టం ఏర్పడ్డాయి. మనసులో ఆ సూర్యుడి గురించి ఆలోచన వచ్చిన ప్రతి క్షణం (అంటే, ఎండ ఎక్కువగా ఉందనో లేదా అసలు ఈ రోజు ఎండే లేదనో.. ఇలా అన్నమాట) ఈ వాక్యం గుర్తొస్తుంది. మన కోసమే కదా పాపం ఆయన అలా నిత్యం మండిపోతున్నాడు అని.
పొరబాటున మనం చెయ్యి జార్చుకున్న తరుణం తిరిగి రాదని ఎంత అందంగా చెప్పారో కదా..! ప్రతి పూటని ఒక్కో పుటలా వర్ణించారు.. నిజమే కదా, నిజానికి ప్రతి ఘడియ నుండీ మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ప్రతి క్షణం మనకి ఏదో నేర్పిస్తుంది. సరిగ్గా అర్థం చేసుకోవాలే గానీ.. జీవితం కన్నా గొప్ప పుస్తకం ఏదీ ఉండదు. కాలం కన్నా గొప్ప ఉపాధ్యాయుడు ఎవ్వరూ ఉండరు.ఆ విషయాన్ని ఎంతో అందంగా, అతి సులువైన పదాలతో చెప్పారు సిరివెన్నెల గారు.
ఇక ఇంత చేసిన ఆ మహానుభావుడిని ఎలా పొగడకుండా ఉండగలనండీ..? నాకు ఒక్క విషయం బాగా అర్థం అవుతూ ఉంది. నా దగ్గర ఇంక పొగడడానికి పదాలు లేవని.. :( దయచేసి కొంచెం సహాయపడుదురూ.. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను (ఋణం మాత్రం తప్పకుండా ఈ జన్మ లోనే తీర్చుకుంటాను.. :P )

4 comments:


Sai Praveen said...
చాలా బాగా రాస్తున్నారండి. నేను కూడా "సిరివెన్నెల విరిజల్లులు" పేరుతొ ఇటువంటి ప్రయత్నమే చేస్తున్నాను నా బ్లాగులో. నా బ్లాగు పేరు కూడా సిరివెన్నెల :)
మధురవాణి said...
This post has been removed by the author.
డేవిడ్ said...
అపర్ణ గారు నేను చాల సార్లు సిరివెన్నెల గారి పాటలు విని ఎంజాయి చేశాను కాని ఆ పాటలోని భావాల్ని అంతగా గమనించలేదండి...పాటలోని భావాల్ని చాల చక్కగ వివరించారు... ఎంతగ ఇన్వాల్వ్ అయ్యరో ఇంతగా బాగ రాసారు.
సిరివెన్నెల said...
@ సాయి ప్రవీణ్ గారు. నేను మీ బ్లాగుని కూడా చూసాను :) అనుకోకుండా ఇద్దరం ఒకే పడవ మీద ప్రయాణిస్తున్నాం అన్నమాట :):). సిరివెన్నెల గారు చూస్తే ఎంతగా ఆనంద పడతారో కదా.. @ డేవిడ్ గారూ!! ధన్యవాదాలండీ. ఆయన మీద ఉన్న అభిమానమే నన్ను అంతగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది :) జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని కలిస్తే చాలు.

Monday, July 5, 2010

ఆరాటపు తడిగానం

ఆకాశానికి పుడమి తల్లి ప్రేమలేఖ ఆహ్వానం, భూదేవికి అంబరం పంపే ఆరాటపు తడిగానం. ప్రేమకు ఇంత కన్నా గొప్ప నిర్వచనం ఉండదేమో. మరి సిరివెన్నెల గారా మజాకా..?? ఈ పాటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది, నేను మాట్లాడేది నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం లోని "ఘల్ ఘల్" పాట గురించి అని. నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఈ ప్రపంచం లోని అన్ని భావాలని ఆయన గారు అర్ధం చేసేస్కుని ఇంత గొప్ప పాటలు రాసేస్తారా అని. లేకపోతే ఏంటండీ.. భక్తి, ఆరాధన, ప్రేమ, స్ఫూర్తి, కోపం, చిలిపి తనం.. ఇలా ఎన్నో భావాలని తన మాటలతో రక్తి కట్టించారు. ఇక ఈ ప్రేమ భావానికి వస్తే





ఘల్ ఘల్ ఘల్ ఘల్.. ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్..
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే..
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లో వినిపించే తడి గానం ప్రేమంటే...
అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం..
దాహం లో మునిగిన చివురుకి చల్లని తన చెయ్యందించీ స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే..
మేఘం లో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే.. ||ఘల్ ఘల్||



ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా..
ప్రణయం ఎవరి హృదయం లో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా..
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే..
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం..
సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటే..
దరి దాటి ఉరకలు వేసే ఏ నది కైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే..
సిరి పైరై ఎగిరే వరకూ చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే.. ||ఘల్ ఘల్||



మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే..
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే..
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే..
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే..
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా..
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రంతై ఎదురవదా.. ||ఘల్ ఘల్||





ఏం రాయాలండీ...? ఈ పాట వర్ణనకి నా మాటలు సరిపోతాయని నేననుకోను. కానీ ప్రయత్న లోపం ఉండకుండా, ఎదో ఉడతా భక్తి గా నాలుగు మాటలైనా మన సిరివెన్నెల గారిని పొగడకపోతే నా మనసు నన్ను క్షమించక పోవచ్చు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఎంత మంచిగా పాటలు రాస్తే మాత్రం ఎన్ని సార్లని ఆయనకి పొగడ్తల మాల వేస్తాం..? కాకపోతే ఏమిటండీ..?
"ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే..
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లో వినిపించే తడి గానం ప్రేమంటే..."
ఈ పోలిక విన్న తర్వాత ఎవరికైనా ఏం చెయ్యాలనిపిస్తుంది..? వడగాలి వస్తే ఎదో మామూలు గాలే అనుకుని ఉండే దాన్ని ఈ పాట వినక ముందు. కాదట. అది ఆకాశానికి ఈ పుడమి తల్లి ప్రేమ సందేశం అట. ఆ వెంటనే పే..ద్ద వర్షం వస్తే అందులో తడుచుకుంటూ "వానా వానా వల్లప్పా.. " అని పాడుకోడం మాత్రమే తెలుసు. కానీ దానికి కూడా ఒక అర్థం ఉందట. అది మన పుడమి తల్లి ప్రేమలేఖ కి బదులు గా వినిపించే తడి గానం అట. ఇదేముంది..? ఇంకా ముందుంది చూడండి.
"దాహం లో మునిగిన చివురుకి చల్లని తన చెయ్యందించీ స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే..
మేఘం లో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే.. "
మీరే చెప్పండి.. ఈ మనిషిని ఏమనాలి..? చివరికి ఒక విత్తు ని మొక్క గా మొలిపించే చి..న్న చినుకుది కూడా ప్రేమేనట. ఇక మన మాగాణి నేల లోగిలి లో కనిపించే రంగు రంగుల ముగ్గు కూడా ప్రేమేనట.ఇంకా చిత్రం.. ఆ రంగులన్నీ కూడా మన మేఘాల మాష్టారువే నట. అదేనండీ.. ఇంద్రధనుస్సు.




ఇన్ని రోజులూ జన్మదినం అంటే మనం ఈ భూమి మీదకి వచ్చిన రోజని మాత్రమే తెలుసండీ నాకు. ఇప్పుడేమో కొత్తగా ఈయన వచ్చి, ప్రాణం పుట్టిన రోజుని ఎవరైనా గుర్తించగలరా అని అడుగుతుంటే నేనేమని చెప్పాలి..? అలాగే ప్రణయం కూడా ఎవరి హృదయం లో ఎపుడు ఉదయిస్తుందో చెప్పలేమంట.. నిజమేనంటారా..? మరీ చోద్యం గా లేదూ..? చివరికి ప్రేమంటే నిర్వచించే పదానికి కూడా ప్రేమంటే ఎమిటో తెలియదంట. చరితలు, కవితలు, సరిగమలు వీటన్నిటికీ అతీతమైనదంట ప్రేమంటే.. ఏమిటో.. (ఒక్కసారి శుభలగ్నం లో ఆమని ని గుర్తు తెచ్చుకోండి.) ఏం చెప్తామండీ.. ఉరకలు వేసే నదికి ఆ ఉరవడి తెచ్చిన తొలి చినుకు ఏదంటే..! ఇక చేనుకు కూడా తెలియదట, తనలో నాటిన విత్తులు మొక్కలుగా మారి సిరి పైరు గా ఎదిగేంత వరకూ; తన లోని ఈ కొత్త కళకు తొలిపిలుపు గురించి.
మట్టి కి బంగారానికి తేడా తెలియాలంటే మండే కొలిమిని అడగాల్సిందేనట. బంగారం అని పిలిపించుకోవాలంటే బంగారానికి ఎంత కష్టమో కదా.. నాగలి పోటు చేసే మేలు గురించి నిజం తెలుసుకోవాలంటే పండే పొలాన్ని మాత్రమే అడగాలి. గెలుపంటే ఒక్కొక్కరూ ఒక్కో రకం గా నిర్వచిస్తారు. మన సిరివెన్నెల ఎమంటున్నారో తెలుసా.? శరీరం మొత్తం గాయలతో ఉన్నప్పుడు, ఆ గాయాలను కూడా వరమాల గా మార్చి వరించే ప్రియురాలట. ఇక వలపు సంగతి, మనసులకు తనంత తానే అడగక దొరికే వరమట. ఇక్కడో చిత్రం ఉందండీ.. అన్ని మనసులకూ కాదు. వలపు కొలువై ఉండే విలువ ఉండాలట.
"జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా.."
ఎన్ని అనుకున్నా ఈ వాక్యం దగ్గరికి వచ్చే సరికి సిరివెన్నెల గారిని పొగడకుండా ఉండలేకపోతున్నాను. నడకల్లో తడబాటు కూడా నాట్యం గా మారొచ్చు అన్న ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా..? నాకైతే ఎప్పుడూ రాలేదు.నీ అడుగుల్లో ఎప్పుడూ అడుగులు కలిపే వారుంటే అలాంటి తడబాటు కూడా నాట్యం అవుతుందట. ఇక ఏమంటామండీ ఆయన్ని..? నోరు కట్టి పడేశారు కదా..
ఎప్పటి లాగానే మీ సలహాల కోసం ఎదురు చూస్తూ..
మీ
అపర్ణ.


1 comments:




Viswa Ravi said...
chaaaaaala chakkaga vishleshinchaavu.. and u r correct.. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. this is an amazing line.. ee song complete ga asalu mana sadharana alochanaki andani kavitvam... nenu kuda sirivennela gariki ekalavya sishyunni ani cheppi garvapadadaamanukune abhimaanini. nee analysis nenu oohinchaledu.. good going. keep it up.. :)

Thursday, May 27, 2010

గమ్యం

గమ్యం. ఇది చీకటి,వెలుగు కి మరియు ఈరోజు, రేపటి కి భేదం తెలియని ఒక జీవితానికి, గమనం నేర్పించిన పాఠం. అసలు జీవితం అంటే ఏమిటో, ఆ జీవితం లో ప్రతి క్షణం ఎంత అమూల్యమైనదో, ఆ అమూల్యమైన క్షణాలను నలుగురికీ ఉపయోగపడేలా ఎలా జీవించాలో, అసలు మనిషి అంటే ఏమిటో 'గమ్యం' చాలా చక్కగా చూపిస్తుంది. ఆ చిత్రం(జీవితం) లోని సారాన్నంతా ఒక్క పాటలో ఎంతో అద్భుతంగా వివరించి చెబుతారు సిరివెన్నెల గారు. ఇది ఒక పాట అనడం కన్నా ఒక గొప్ప తత్వవేత్త తన జీవితం లోని ప్రతి రుచినీ అనుభవంచి, రంగరించి వెలువరిచిన గొప్ప జీవిత సత్యాలని చెప్పొచ్చేమో.. ఈ వాక్యాల అర్ధాన్ని తెలుసుకుంటే బాధలో ఉన్న ప్రతి మనిషికీ ఇది ఒక టానిక్ లాగా పని చేస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. నాకు ఎన్నో సార్లు ఇదే పాట కొత్త కొత్త అర్ధాలతో ఊరటనిచ్చింది. అందుకే సిరివెన్నెల గారన్నా, ఆయన మాటలన్నా, పాటలన్నా నాకు చాలా చాలా ఇష్టం.మరి అంతగా ప్రభావితం చూపించే మన "ఎంతవరకు" పాట గమనం ఎలా సాగుతుందో చూద్దామా..?!


ఎంతవరకూ ఎందుకొరకు వింత పరుగూ అని అడక్కూ..
గమనమే నీ గమ్యమైతే బాట లోనే బ్రతుకు దొరుకు.
ప్రశ్న లోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు.
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా..
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా.. "ఎంతవరకు "


కనపడేవెన్నెన్ని కెరటాలు.. కలగలిపి సముద్రమంటారు..
అడగరే ఒక్కొక్క అల పేరూ..
మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు..
పలకరేం మనిషీ అంటే ఎవరూ..
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది..
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నవి.
నీ ఊపిరి లో లేదా గాలీ వెలుతురు నీ చూపుల్లో లేదా..
మన్నూ మిన్నూ నీరూ అన్నీ కలిపితే నువ్వే కాదా గాథా.. "ప్రపంచం "


మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై..
నీడలు నిజాల సాక్ష్యాలే..
శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే..
ఋతువులు నీ భావ చిత్రాలే..
ఎదురైన మందహాసం నీ లోని చెలిమి కోసం..
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం..
పుటుక చావు రెండే రెండు నీకవి సొంతం కావూ పోనీ..
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ.. "ప్రపంచం "


ఈ పాటని వర్ణించడానికి అద్భుతం అన్న పదం చాలా చిన్నది గా కనిపించడం లేదు అని మీరు అనగలరా..??అనలేరు. ఎందుకంటే ఆయన పాటల్లో ఉన్న భావం అలాంటిది. ఆయన పదాల్లో ఉన్న శక్తి అలాంటిది. ఎటువంటి భావాన్ని పలికించదానికి అయినా చాలా సులువైన పదాలతో పూర్తి చెయ్యగలరు.. అదే భావాన్ని అతి క్లిష్టమైన పదాలతోనూ పలికించగలరు. నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది.. అక్షరాలకు గానీ పదాలకు గానీ మనసు ఉంటే సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన తరువాత అవి చాలా గర్వపడతాయేమో అని. మరి, అంత మామూలు పదాలతో ఎవరూ ఊహించలేని గొప్ప అర్ధాన్ని పలికించడం అన్నది మామూలు విషయం కాదు కదా.


ఇక మన గమనం విషయానికి వస్తే, ఎంతవరకూ ఎందుకొరకు వింత పరుగు.. ఈ ప్రశ్న వేసుకోని వారు ఉంటారంటే నమ్మడం కొంచెం కష్టమే.. ఎందుకంటే ఏదో ఒక క్షణం లో ప్రతి ఒక్కరు ఇలా భావిస్తారు. కానీ ఆ గమనమే మన గమ్యం ఐనప్పుడు బ్రతుకంతా బాటలోనే కదా దొరికేది.. మన ప్రశ్న కి బదులు ఆ ప్రశ్న లోనే కదా దొరికింది, కానీ ఈ నిజం అన్ని హ్రుదయాలకు తెలియదు. జీవితాన్ని అర్ధం చేస్కున్న హ్రుదయానికి మాత్రమే తెలుస్తుంది.
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా..
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా..
వాహ్... శాస్త్రి గారు.. ప్రపంచాన్ని ఇంత గొప్ప గా అర్ధం చేస్కున్న వాళ్లు ఈ ప్రపంచం లో ఇంకెవరూ ఉండరేమో.. ప్రపంచం నీలోనే ఉన్నప్పుడు నువ్వే ప్రపంచానివి కదా..ప్రపంచం నువ్వే అయినప్పుడు నీకు ఎదురైన వాళ్లంతా నీ ప్రతిరూపాలే కదా.. నువ్వు చెయ్యవలసింది ఒక్కటే.. ఈ ప్రపంచం నీలోనే ఉందని గుర్తించాలి.. అది జరిగిన నాడు నీకు ఎదురైన ప్రతి జీవిని నిన్ను గా గుర్తించి పలకరిస్తావు.. అదేనేమో విశ్వజనీనమైన ప్రేమ అంటారు..


కనిపించే ఎన్నెన్నో కెరటాల సముదాయాన్నే సముద్రం అంటారట.. మరి ఒక్కొక్క కెరటాన్ని పేరు పెట్టి పిలవం ఎందుకు..? మనిషనే సంద్రం లో మనకి ఎదురైన వారంతా కెరటాలట.. మరి మనిషీ అంటె ఎవరూ పలకరెందుకు..? ఈ ప్రపంచపు గదిలో ఉన్నది నువ్వే.. నీ మది సరిగా చూస్తున్నదా..? నీ చుట్టూ ఉన్న అద్దాలలో విడి విడి రూపాలు మాత్రం నువ్వు కాదని భ్రమింపజేస్తున్నాయి.. నువ్వు పంచభూతాల సమాహారం.. నీ ఊపిరి లో గాలి ఉంది. నీ చూపుల్లో వెలుతురు ఉంది. ఈ నేల, ఆకాశం, నీరు అన్నీ కలిపితే నువ్వే..


నువ్వు మనసులో ఏవైతే ఆలోచిస్తావో, అవే నీకు ద్రుశ్యాలై బయట కనిపిస్తాయి. ఎంత గొప్ప సత్యం..!! నువ్వు ఎలా ఆలోచిస్తావో అదే నీకు కనిపిస్తుందట.. మంచిగా ఆలోచిస్తే మంచి కనిపిస్తుంది. చెడుగా ఆలోచిస్తే చెడు ఎదురవుతుంది. చివరికి నీడ కూడ ఎదో ఒక నిజం యొక్క సాక్ష్యమే..నీ లోని లోపాలే నీకు శత్రువులు.. నీ ఇష్టాలే నీకున్న స్నేహితులు. ఋతువులు కూడా నీ భావ చిత్రాలే.నీలోని చెలిమి కోసం ఒక మందహాసం స్నేహహస్తాన్ని అందిస్తుంది. మోసం , రోషం, ద్వేషం అన్నవి నీ మకిలి మదికి గుర్తులు. ఇవన్నీ వదిలి ఆ స్నేహహస్తాన్ని అందుకోవాలి.
పుటుక చావు రెండే రెండు నీకవి సొంతం కావూ పోనీ..
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ..
జీవితం లో ఒక్క సారైనా సిరివెన్నెల గారిని కలిసి సాష్టాంగ నమస్కారం చెయ్యాలన్న నా కోరిక ఈ భావాన్ని చూశాక ఇంకా బలపడింది. చిన్న చిన్న మాటల్లో ఎంత గొప్ప అర్ధాన్ని దాచారు..!! పుట్టుక చావు మనకి సొంతం కావట. అవి మన చేతుల్లో లేవు కదా.. కానీ ఆ రెండిటి మధ్యలో జీవిత కాలం మొత్తం మనదే.. ఇక ఏం రంగులు దిద్దుకుంటామన్నది మన చేతుల్లో ఉంది.. మరి ఇంద్రధనుస్సు ని మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి సిద్ధమా..?!
మీ సలహాలను స్వీకరించడానికి నేను సిద్ధం.. :)
మీ అపర్ణ.

1 comments:

Viswa Ravi said...
the command and ability to understand what Sirivennela is conveying.. tells me to suggest you to write some pen-down.. ee age lo neekunna paripakvata toooooooo good.... never stop what u r doing now.. glad to meet u here..

Monday, May 24, 2010

మొదటి పాట

దేనితో మొదలు పెట్టాలి.? ఎలా ముగించాలి..? ముగింపు సంగతి కాస్త పక్కన పెడితే సిరివెన్నెల గారి గురించి ఎలా మొదలు పెట్టాలి అన్న విషయం ఎంతకీ అంతు పట్టడం లేదు. ఏదో చిన్న పిల్లకాలువ గురించి ఐతే నాలుగు ముక్కల్లో / వాక్యాల్లో తేల్చెయ్యొచ్చు. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి నాలుగు వాక్యాల్లో తేల్చడం అంటే అరచేతుల్లో మహా సముద్రాన్ని పట్టుకుందాం అన్నంత అత్యాశ అవుతుంది. సూర్య భగవానుడి ని ఒంటి చేతి మీద బంతి లా ఆడించడం అంత అతిశయోక్తి అవుతుంది.
ఆయన ఒక మహార్ణవం. ఆయన కలం కోటి సూర్యుల తేజం. .వర్ణనాతీతం... ఆయన రాసే పాటల లోని పదాల అల్లిక విరజాజుల మాల. ఆస్వాదించే కొద్దీ ఆ సౌరభాలు మనసు మూలల్లోకి వెళ్లి ఒక అద్వితీయానుభూతి ని ప్రసాదిస్తాయి. ఇక్కడ మీతో పంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సిరివెన్నెల గారి మీద ఇంత గౌరవం అనుకోండి లేదా భక్తి అనుకోండి ( అది తమరికే వదిలేస్తున్నాను) మొదలైంది ఒక పాట తో... మీరందరూ 'నేనున్నాను' అన్న చిత్రం చూసే ఉంటారు అనుకుంటున్నాను. అందులో ' ఏ శ్వాస లో చేరితే ' పాట. అంతకు ముందు కూడా సిరివెన్నెల గారు చాలా పాటలు రాసారు. అవన్నీ అద్భుతాలే. కానీ నాకు ఊహ తెలిసిన తరువాత ఒక పాట వినగానే ఆ పాట రాసింది ఎవరో తెలుసుకుని ఆ పాటని మళ్ళీ మళ్ళీ విని పూర్తి గా ఆస్వాదించిన పాట ఇది. దాని కారణం గానే నా బ్లాగ్ ని కూడా ఇదే పాట తో మొదలు పెడదాం అని నిశ్చయించుకున్నాను.
పాట ఇలా సాగుతుంది.


ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ..
ఏ మోవి పై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో ..
ఆ శ్వాస లో నే లీనమై ఆ మోవి పై నే మౌనమై
నిను చేరనీ మాధవా.. "ఏ శ్వాస లో "


మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ..
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా..
తనువున నిలువున తొలచిన గాయములే తన జన్మ కీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరిందీ అష్టాక్షరి గ మారిందీ..
ఎలా ఇంత పెన్నిధీ వెదురు తాను పొందినదీ
వేణు మాధవా నీ సన్నిధీ... "ఏ శ్వాస లో "


చల్లని నీ చిరునవ్వులు కనపడకా కను పాపకీ
నలువైపులా నడి రాతిరి ఎదురవదా..
అల్లన నీ అడుగుల సడి వినపడక హృదయానికీ
అలజడితో అణువణువూ తడబడదా..
నీవే నడుపు పాదమిదీ నీవే మీటు నాదమిది
నివాళి గా నా మదీ నివేదించు నిమిషమిది..
వేణు మాధవా నీ సన్నిధీ.. "ఏ శ్వాస లో "


ఎంత అద్భుతమైన పాట.. చిత్రం లో 'అను' జీవితానికి(శ్రియ పోషించిన పాత్ర) పాటలో వెదురు/మురళి పాత్ర కి ఎంత గా పొంతన కుదిరిందంటే అసలు ఆ పాట కోసమే అను పాత్ర ని సృష్టించారేమో అన్నంత గా..
ఈ పాట లో ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అద్భుతం.. గాలి గాంధర్వం అవుతుంది కృష్ణుడి శ్వాసలో.. ఎంత గొప్ప ప్రయోగం..!! ఆయన పెదవుల పై మౌనం కూడా మంత్రం అవుతుంది.
ఎందరో మునీశ్వరులకు కూడా తెలియని జపములు జరిపి ఉంటుందేమో ఆ మురళి.. లేకపోతే ఆ జగన్నాటక సూత్రధారితో అంత సఖ్యతా..? లేదంటే ఆది పూర్వ జన్మ సుకృతం ఐనా అయ్యుండొచ్చు.. ఒక వెదురు ముక్క కృష్ణుడి ని చేరి అష్టాక్షరి గా మారింది.. ఎంత అందమైన నిజం.. ఆ మనోహరుడి చేతిలో సప్త స్వరాలు పలికించు వేణువు ఊహ మనసుని పులకింపజేస్తుంది. మరి అంతటి అదృష్టం ఆ వెదురు ముక్క ఎలా పొందిందంటారు..??
ఆ చిరునవ్వులు కనపడక పోతే చీకటి మాత్రమే కనిపిస్తుందట.. మురళీధరుడి అడుగుల సడి హృదయానికి వినిపించకపోతే అలజడి తో అణువణువూ తడబడుతుంది. ఈ పాదాన్ని నువ్వే నడపాలి.. ఈ నాదాన్ని నువ్వే మీటాలి. ఇక కొసమెరుపు.. రాధికా హృదయ రాగాంజాలీ నీ పాదముల వ్రాలు కుసుమంజలీ ఈ గీతాంజలి..
విచిత్రం ఏమిటంటే పై వాక్యాలన్నీ ఆ కృష్ణ భగవానుడి కి ఎంత పొంతన గా ఉన్నాయో ఆ చిత్రం లోని కథా నాయకుడి పాత్ర కి అంటే పొంతన గా ఉంటాయి. ముఖ్యం గా "తనువున నిలువున తొలచిన గాయములే తన జన్మ కీ తరగని వరముల సిరులని తలచినదా" ఈ వాక్యం అనుపమానం.. ఒక వెదురు ముక్క కి దాని తనువంతా గాయాలతో నిండి ఉన్నా ఆ గాయాలే దాని అదృష్టం అంట. ఆ గాయాల కారణం గానే ఆ మురళీధరుడి చేతి లో ఉండే అదృష్టాన్ని పొందింది. అలాగే అను పాత్ర కు జరిగే కొన్ని ఎదురు దెబ్బల కారణం గా కథానాయకుడికి దగ్గర అవుతుంది. అది తన అదృష్టం గా భావిస్తుంది.
సిరివెన్నెల గారి పాటల్లోకెల్లా ఇది గొప్ప పాట అని చెప్పను. ఇంతకంటే అద్భుతమైన వేల పాటలు ఆయన కలం నుండి అల్లుకుని విరజాజుల మాలలు అయ్యాయి. నా హృదయాన్ని మీటిన మొదటి పాటగా ఈ బ్లాగ్ లో దీనిని పరిచయం చేస్తున్నాను. మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ఆయన పాటల అలల్ని ఎన్నిటినో మీ ముందుకు తీసుకు వస్తాను.
ఆ పాటల ఉప్పెనను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ.. మీ సలహాల కోసం ఎదురు చూస్తూ...
మీ..
అపర్ణ..

2 comments:

శిశిర said...
అపర్ణ గారు, బాగుందండి మీ బ్లాగు. మీ ప్రయత్నం కూడా. నేనూ సిరివెన్నెలగారి అభిమానినే. విరజాజిపూలు వర్షపు చుక్కలతో ఎంత బాగుందో ఫోటో. బాగా రాస్తున్నారు.
సిరివెన్నెల said...
ధన్యవాదాలు శిశిర గారు. క్షమించాలి, ఆలస్యానికి :). నిజానికి నాకు విరజాజి పూల ఫొటో దొరకలేదండీ.. ఆ ఫొటో లో ఉన్న పూలని మేము సన్నజాజులు అంటాం.. కొందరు వీటినే విరజాజులు అంటారంట. మీరు కూడా వీటినే విరజాజులు అంటారా..?