Tuesday, October 26, 2010

మమత కొలువులోని పెళ్లికి ఆహ్వానం..

పెళ్లంటే మామూలు పెళ్లి కాదు.. అనురాగాన్ని మంత్రంగా.. అనుబంధాన్ని సూత్రంగా చేసుకుని, మమతల కొలువులో జరుగుతున్న పెళ్లి.. అమ్మాయికి అత్తయ్యే దగ్గరుండి అమ్మలా జరుపుతున్న పెళ్లి.. ఆడకూతురు ఒక పైశాచిక మృగం చేతుల నుండి తప్పించుకుని, మరో ప్రేమమూర్తి హృదయంలోకి అడుగిడటానికి చేసుకుంటున్న పెళ్లి.. "పెళ్లి" చిత్రంలోని ఆ పెళ్లి సన్నివేశం ఎంత హృద్యంగా ఉంటుందో, కన్నులకు కట్టినట్లు చూపించింది దర్శకుడు కోడి రామకృష్ణ అయితే, దాన్ని మనసు లోపలి వరకూ చేరవేసింది మాత్రం ఖచ్చితంగా సిరివెన్నెలే.. 
అత్తా కోడళ్లు అంటే అదొక కత్తి మీద సాము లాంటి బంధంగా సృష్టించేశాం మనం. మరి ఇలా అత్తే ఒక తల్లిలా జరిపే పెళ్లి అయితే నా కంట పడలేదు. కానీ ఒకవేళ జరిగితే ఎలా ఉంటుందీ..?? ఇదిగో ఈ కింద ఉన్నంత అందంగా ఉంటుంది..:)
అనురాగం అనుబంధం కలగలిసి మమతల కొలువులో జరుపుతున్న పెళ్ళికి ఇచ్చే మంగళ వాయిద్యం ఇది.. విని తరించండి మరి..

అనురాగమే మంత్రంగా
అనుబంధమే సూత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్ళికి
మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం(2)


పెళ్లంటే మూడు ముళ్లేనా.? ఏడడుగులేనా..? కాదు.. వాటికి అతీతంగా ఇంకేదో ఉంది.. ప్రపంచమంతా ఏకమై నిన్ను వెలేసినా నీకు నేనున్నానన్న నమ్మకాన్ని అందించడం.. అసలు మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతమట హిందూ సంప్రదాయం ప్రకారం..ఇక ఏడడుగులేమో వధూ వరులకి ఎన్నడూ విడిపోని స్నేహబంధాన్ని పెనవేస్తుందని మన గట్టి నమ్మకం. మూడు ముళ్లకి, ఏడు అడుగులకి మనం ఇచ్చిన గౌరవం అలాంటిది.. మరి, నాతిచరామి అని ప్రమాణాలు చేసిన అబ్బాయి, లేదా పుట్టిల్లు ఒక కన్ను, అత్తిల్లు రెండో కన్ను అని ఆ రెండిటి గౌరవం నిలబెడతా అని మాటిచ్చిన అమ్మాయి వాటిని నిలబెట్టుకోలేకపోతే (నిలబెట్టుకోకపోతే..) శిక్ష ఎవరికి..?  ఈ చిత్రం విషయంలో మాత్రం తప్పు అబ్బాయిదే.. శిక్ష అమ్మాయికే.. కానీ తన దురదృష్టానికి ఆ ఆడకూతురు కృంగి పోలేదు.. పెళ్లి అంటే కేవలం మూడు ముళ్లే కాదు అని తెలుసుకోవడమే కాకుండా ప్రేమగా చేరువైన ఒక స్నేహ బంధాన్ని మరో ముడిగా జత చేసుకుంది. ఏడు అడుగులు వేసి అక్కడితో ముళ్లపొదలో ఆగిపోయిన తన జీవితానికి ప్రేమ అను ఎనిమిదో అడుగుతో మళ్లీ వసంతపు బాటల్ని పరుచుకుంది.. నాతిచరామి మంత్రానికి అర్థం తెలిసిన మనిషి అడుగుల్లో తన అడుగులు కలుపుకుంటూ, ఒక కొత్త రకపు వెలుగులతో నిండిన తన కొత్త జీవితపు పుటల్ని తెరుచుకుంటూ కదిలిపోయే సమయమట.. అంతే కాదు, ఇది ఆగని పయనమట.. అద్భుతం కదూ...

మూడు ముళ్ళతోనే పెళ్లి పూర్తి కాదు అని
మరో ముడిగ చేరుకున్న స్నేహ బంధమిది
సప్తపదితో ఆగరాదు జీవితం అని
అష్టపదిగ సాగమన్న ప్రేమ పదము ఇది
నాతిచరామి మంత్రములో అర్ధం తెలిసిన నేస్తముతో
అడుగు కలుపుతూ వెలుగు వెతుకుతూ సాగే సమయమిది
ఆగని పయనమిది.....

అనురాగమే మంత్రంగా..........

సాధారణంగా కొడుకు ఎంత కౄరుడైనా తల్లి గుండె తన పిల్లల కోసమే కొట్టుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం, కొడుకు పైశాచికత్వానికి కోడలు బలవ్వడం చూసి తనలోని నిజమైన మాతృత్వాన్ని తట్టి లేపిన ఒక తల్లి కనిపిస్తుంది.. కోడలి జీవితం బాగుండాలని జరిగిపోయిన మూడు ముళ్లు, ఏడు అడుగుల పెళ్లి అనబడు ఒక పీడ కలకి మరో ముడిని, మరో అడుగుని జత పరిచి ఒక కొత్త అంకాన్ని కోడలుకి ప్రసాదిస్తుంది..ఆడదంటే ఆడదానికి శతృవు కాదు, అత్త కూడా ఒక అమ్మే అని నిరూపిస్తుంది.. మరి జీవితమంటే బ్రహ్మ ఆడుకుంటున్న బొమ్మలాటేగా.. కానీ ఆ బ్రహ్మ రాతని కూడా మార్చి చూపిస్తుంది మన మానవత్వం. ఇంతవరకూ చరిత్రలో ఎక్కడా జరగని/చదవని మొదటి కథగా, కేవలం మూడు ముళ్ల బంధంలా కాకుండా మనసులు పెనవేసిన సంబంధంగా తరతరాలకూ నిలిచిపోండని అత్తయ్య ఒక తల్లిగా దీవించే చల్లని తరుణం..

ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని
అత్త గుండెలోన కూడ అమ్మ వున్నదని
బొమ్మలాటలాడుతున్న బ్రహ్మ రాతలని
మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది
చరితలు చదవని తొలి కథగా
మనసులు ముడి పడు మనుగడగా
తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగ దీవించే
చల్లని తరుణమిది

అనురాగమే మంత్రంగా..........

ఈ సన్నివేశానికి ఇంత కన్నా అందమైన పదాల కూర్పుని ఎవ్వరూ అందించలేరన్నంత అందంగా రాశారు మన సీతారామ శాస్త్రి గారు.. ఇంతకన్నా ఆయన గురించి చెప్పడానికి నాకు మాటలు లేవండీ. జీవితంలో ఒక్కసారి ఆయన్ని కలిసి పాదాభివందనం చేస్తే ఈ జీవితానికి చాలు అనిపిస్తుంది..
నాకు ఈ పాట Youtube లో దొరకలేదు, క్షమించగలరు లింక్ ఇవ్వలేకపోతున్నందుకు..

Thursday, October 21, 2010

పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా..


జీవితం మీద ఎన్నో ఆశలతో, ఇంకా ఏదో మంచి జరగాలనే కోరికలతో, బోలెడన్ని మనసులోనే కోరేసుకుంటూ గుళ్లు గోపురాలూ తిరుగుతూ ఉంటాం.. అసలు ఆ ప్రదేశాల దగ్గరకు వెళ్లగానే ఏదో తెలియని ప్రశాంతత.. అంతెందుకు, ఎక్కడైనా దేవుడి పాటలు విన్నా, గుడి గంటలు దూరంగా వినిపించినా ముఖ్యంగా హారతి కనిపించినా అప్పటి వరకూ మనసు అడుగుల్లో ఎక్కడో దాగి ఉన్న భక్తి  బైటికి వస్తుంది. దేవుడి పాటలకి, గుడి గంటలకి, హారతికి ఉన్న గొప్పతనం అలాంటిది.

ఒక్కసారిగా జీవితం ఆగిపోతుంది.. మన ఆలోచనలు, మన అనుభవాలు, అనుభూతులు, ఇష్టాయిష్టాలు, అనుబంధాలు, అన్నీ.. అన్నీ ఆగిపోతాయి ఉన్నట్టుండి. కాదు.. చావు మనకి దూరం చేస్తుంది వీటన్నిటినీ. మరి చనిపోయాక..? వేటి సంగతి ఎలా ఉన్నా దేహాన్ని మాత్రం ఒక నిప్పు కణిక కాల్చేస్తుంది..
అక్కడ హారతి.. ఇక్కడ చితి.. రెండూ ఒకే నిప్పు కణిక.. కానీ అర్థం చేసుకోడానికి ఒక జీవితకాలం పట్టేంత లోతైన భేదం ఉంది వాటి మధ్య.

చూడగానే అర్థం అయిపోయింది అనిపిస్తుంది మన సిరివెన్నెల గారి సుస్వాగతం చిత్రంలోని "ఆలయాన హారతిలో" అన్న పాట. కానీ విన్న ప్రతి సారీ కొత్త అర్థాన్ని వివరిస్తూ ఉంటుంది పాటలోని ప్రతి మాట..  ప్రేమ అమృతమా హాలాహలమా అన్న అతి సున్నితమైన విషయాన్ని చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, సులువైన పదాలతో వర్ణించారు.

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో..
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం..
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం..
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..


తన ప్రియురాలు ఖచ్చితంగా కనిపిస్తుంది అన్న గుండెలోని ఆశ తడి ఆవిరి అవుతున్నంత మాత్రాన, ఎండమావిలో తన చెలి ఉనికి కనిపిస్తుందా..! వాహ్.. ఎంత అద్భుతమైన వర్ణన.. ప్రేమ ఉంటే చాలు, ప్రపంచమంతా కనిపించడం మానేస్తుంది.. ప్రేమ ప్రపంచాన్ని మరిపిస్తుంది.. కానీ, కనిపించని ఆ ప్రేమ జాడని కనుక్కోవడం ఎంత కష్టం.! కనిపించని ఆ ప్రేమ ఆచూకీ కోసం ప్రపంచాన్ని, తనని మర్చిపోయి వెతుకుతూ తిరిగే ఒక మనసు వ్యధ ఇది. ఆ ప్రేమ జాడ తెలియని ప్రాణం, చుక్కలు దిక్కులు అన్నీ దాటుకుంటూ చేసే ప్రయాణమే ఈ పాట.  "ఎదుట ఉంది నడి రేయన్నది ఈ సంధ్యా సమయం" .అద్భుతం.. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో శాస్త్రి గారికి..

ఎండమావి లో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా..
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా...
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా...
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదుట ఉంది నడి రేయన్నది ఈ సంధ్యా సమయం..
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..


కొడుకు అనే కనుపాపను, తండ్రి అనే కనురెప్ప ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుంటూ ఉంటాడు. మరి అటువంటి కనుపాప కళ్లు తెరవకుండా కనే కల కోసం, తండ్రి సూర్యుడు కన్ను మూశాడట.. ఎంత బాగా పోల్చారు.. ఆ విషయం తెలియని కనుపాప ఇంకా కలవరిస్తూనే ఉందట తనకు కనిపించని ప్రియురాలి కోసం..  తనకు ఆయువిచ్చి, పెంచి పెద్ద చేసిన నాన్న అనే బంధం తన గురించే ఆలోచిస్తూ, ఏదీ చెప్పలేని మౌనంలో కాలిపోయినా కూడా, కనుల ముందుకు రాకుండా చీకటి తెరల వెనుకనే దాగి ఉన్న స్వప్నం కోసం తను ప్రారంభించిన వెతుకులాట ఆగలేదు కదా.. "పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా.." ఎంతో గొప్ప ఫిలాసఫీ ఇంత చిన్న పదాలతో నిర్మించబడిన ఒకే వాక్యంలో ఎలా పొదగబడిందంటారు..??
శాస్త్రి గారు.. మిమ్మల్ని పొగడడానికి నా దగ్గర మాటలు కరువయ్యాయండీ.. అద్భుతం.. హ్మ్.. చివరికి కనుపాప కలే కావాలి అడిగిందని నయనం శాశ్వతంగా  నిదురలోకి వెళ్లిపోయిందట..


సూర్య బింబమే అస్తమించెనుగ మేలుకోని కల కోసం..
కళ్లు మూసుకుని కలవరించెనే కంటి పాప పాపం..
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనం లో మసి అయినా..
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగెఆనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..


చిత్ర కథ మొత్తం ఒక్క పాటలో ఎంత అద్భుతంగా చెప్పారో కదా.. ఎక్కడో చదివాను... చేయి తిరిగిన రచయిత అంటే ఎన్నెన్నో గొప్ప గొప్ప పదాలు వాడేసి పెద్ద పెద్ద పుస్తకాలు రాసెయ్యడం మాత్రమే కాదట. అతి కొన్ని చిన్న చిన్న పదాలను ఉపయోగించి కూడా అర్థాన్ని ఎంతో అందంగా చెప్పగలగడం అట..  ఇక సిరివెన్నెల గారి గురించి ఈ విషయంలో చెప్పనవసరం లేదేమో కదూ.. 
Youtube Link : http://www.youtube.com/watch?v=sZAwHyQnEwQ