Friday, July 15, 2011

అమృతమే చెల్లించి ఆ విలువతో..

పేరాశతో తన పసుపు కుంకుమలనే అమ్ముకున్న తెలుగింటి ఇల్లాలు. డబ్బు మీద వ్యామోహంతో తన జీవితాన్నే పణంగా పెట్టి ఆస్థిపరురాలిగా మారాను అనుకుంటూ తనని తాను అసలైన బీదరికంలోకి సాగనంపుకున్న మహిళ. నిజం తెలుసుకుని పశ్చాత్తాప పడుతూ తన మాంగల్యాన్ని తిరిగి కొనుక్కోవాలని ఆరాటపడే ఒక భార్య.


పెళ్లి అంటే మూడో మనిషితో పంచుకోలేని ఒక అపురూప బంధం అన్న నిజం తెలుసుకోలేని ఒక ఇల్లాలి కథ "శుభలగ్నం". యస్.వి.కృష్ణారెడ్డిగారి దర్శకత్వం, సంగీత దర్శకత్వం లో 1994లో వచ్చిన ఒక మంచి చిత్రం. సినిమా మొత్తాన్నీ ఒక్క పాటలో చూపించగలిగిన పాట "చిలక యే తోడు లేక". ఈ పాట పరిచయం లేని తెలుగు సంగీత ప్రియులు ఉంటారని నేననుకోను. సంగీతం, సాహిత్యం, గాత్రం అధుతంగా సమకూర్చిన మంచి పాట.

తెలిసి తెలిసి ఎండమావులు మాత్రమే కనిపించే ఎడారి వెంట ఒంటరిగా పరుగులు పెట్టిన చిలకని, సౌభాగ్యానికి వెల ఎంతమ్మా అంటే ఏం చెప్పగలుగుతుంది? సంతలో వస్తువులా పసుపు కుంకుమలని అమ్ముకున్న తరువాత, భర్తనే బంధం ఎలా తిరిగి వస్తుంది? 

 పల్లవి :
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
      తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
      మంగళ సూత్రం అంగడి సరుకా.. కొనగలవా చేజారాక
      లాభం.. ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
                                             || చిలకా ఏ తోడు ||
.కోరస్: గోరింకా యేదే చిలకా లేదింకా || 2 ||

"అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే" ఈ పదాలకి ఉన్న అర్థాన్ని ఆలోచించడానికి కూడా నేను ఖచ్చితంగా అనర్హురాలిని అనిపిస్తూ ఉంటుంది నాకు. విన్న ప్రతిసారి ఈ వాక్యం నన్ను ఎక్కడికో తీస్కెళ్తూ ఉంటుంది. అతితెలివితో చేసిన తప్పిదాన్ని ఇంత బాగా వర్ణించగలరా ఎవరైనా? కాసుల వర్షంలో బీదతనం. ఎలా మెచ్చుకుని సిరివెన్నెల గారిని ఆయనకి మాత్రమే అర్హమైన స్థానంలో కూర్చోబెట్టాలో తెలీడంలేదు.
చరణం1 :
      బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
      వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
      అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
      కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
                                             || చిలకా ఏ తోడు ||
కోరస్: కొండంతా అండే నీకు లేదింకా || 2 ||

నిజమే, ధనంతో సుఖాన్ని పొందొచ్చేమో కానీ, అనురాగాల్ని అనుబంధాల్ని కొనగలమా? చుట్టూ కాసుల రాశులు కొలువుదీరి ఉన్నా, పెదవుల పై చిరునవ్వు పూయించేవారు, చెక్కిలిపై కన్నీటిని తుడిచేవారు, చెంత లేనప్పుడు వెలుగుల లోకంలో ఉన్నా అది అమావాస్యే అవుతుంది. మనం అనాథలే అవుతాం. సంపద మైకంలో ప్రపంచాన్ని మరచిపోయినా, అనాథలమన్న విషయం కళ్లు తెరిపించి నిజాన్ని చూపించేసరికి.. మనం నడిచి వచ్చిన తీరం మన కళ్లను దాటి ఎప్పుడో దూరం అయిపోయి ఉంటుంది. 
చరణం2 :
      అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో..
      మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో..
      ఆనందం కొనలేని ధనరాశితో.. అనాథగా మిగిలావే అమవాసలో
      తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా
                                             || చిలకా ఏ తోడు ||

చేసిన తప్పుని తెలుసుకుని ఎడారి వెంట కన్నీటితో సాగే ఆమని నటన అద్భుతం.. ఆమనిని మాత్రం డబ్బుల పంజరంలో పెట్టి, జగపతి బాబు, రోజా సంతోషంగా ఉండే సన్నివేశం చిత్రీకరణ పాట భావాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఇక ఆమనికి సర్వెంట్స్ అందరూ కలిసి డబ్బుని వడ్డించే సన్నివేశం, ఆ తర్వాత తన భర్తతో తను సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకోవడం.. అన్నిటికన్నా అద్భుతం పాట చివర్లో ఆమని త్రాసుకి ఒకవైపు తాళిని మరో వైపు తన సంపదనంతా పెట్టి తన భర్తని తిరిగి పొందడానికి చేసే ప్రయత్నం.ఈ పాట చూడాలంటే ఇక్కడ నొక్కండి.

ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది, డబ్బు హోదా ఎంత ఉన్నా, మెట్టు మెట్టు ఎక్కుతూ ఎంత ఎత్తుకు ఎదిగినా, మన ఆఙ్ఞని అనుసరించేవాళ్లు చుట్టు ఎందరున్నా.. మనతో కలిసిపోయే వాళ్లు, మన సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకునే వాళ్లు లేని జీవితం నిజంగా వృధా అని..

Thursday, April 28, 2011

కప్పు కాఫీకి సిద్ధమా..!!

అతడొక అభినవ ప్రవరాఖ్యుడు (అనుకుంటున్నాను). అతడిని ఇష్టపడిన వరూధిని మనసులో ఎన్నెన్ని సందేహాలో.. ఇంకెన్ని సంశయాలో.. అతగాడి గురించిన ఆలోచనలన్నిటినీ ఆ అమ్మాయి మనస్సులోకి జొరబడి మరీ పదాల్ని అందంగా అల్లినట్లుగా పాటని రాసారు శాస్త్రి గారు. ఈ మధ్యనే విడుదలైన "కుదిరితే కప్పు కాఫీ" చిత్రం కోసం "అతడిలో ఏదో మతలబు ఉందే" అన్న పాట సిరివెన్నెల గారు రాయగా, యోగేశ్వర శర్మ గారు స్వరపరిచారు. పాట నాకైతే చాలా నచ్చింది:)

అమ్మాయి వాసనంటేనే పడని ఆ ప్రవరాఖ్యుడి ప్రవర్తనని చూసి విస్తుపోతూ, ఇష్టపడుతూ అతని మనస్సుని చదవడానికి ప్రయత్నిస్తున్న ఒక అమ్మాయి అంతరంగం. వెంటపడే అమ్మాయిని ప్రాణహాని గానో మానహాని గానో అనుకుంటూ పొగరుగానో బెదురుగానో వడి వడిగా పారిపోయే అబ్బాయి వాలకం. వెరసి సాహితీ ప్రియులకు ఒక మంచి కాఫీ లాంటి గీతం.

పల్లవి
అతడిలో ఏదో మతలబు ఉందే ఏంటంటే చెప్పడుగా..
అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడి వడిగా..
ప్రాణ హాని, మాన హాని వెంటపడి వస్తున్నట్టు..
పొగరనాలో బెదురనాలో వాలకం చూస్తుంటే..

విరక్తి చెందే వయస్సూ కాదు, తపస్సు చేసే మనస్సూ లేదు. అంటే, ఎలాంటి తేడానూ లేదు. మరెందుకో ప్రేమాన్నా, అమ్మాయన్నా ఈ దూరం. ప్రేమకి, పెళ్లికి, చివరికి అమ్మాయితో స్నేహానికి కూడా దూరంగా ఉండి ఏకాకిలా ఎన్నాళ్లుంటాడో పాపం..

చరణం1
విరక్తి చెందే వయస్సు కాదే పైలా పచ్చీసే..
తపస్సు చేసే తలంపు లేదే హుషారైన ఫేసే..
ఏతావాతా తేలేదేమిటి ఎలాంటి తేడా లేదే..
ప్రేమా భామా అనేవి మాత్రం చెవిలో పడరాదంతే..
ఎన్నాళ్లిలా ఏకాకిలా ఉంటాడో ఏమో తెలీదే...

కలిసి ఎంత దూరం ప్రయాణం చేసినా, ఒక మాటా ఉండదు ముచ్చట ఉండదు. తనేమీ చెప్పడు, ఏం చెప్పినా వినడు. అంతలా చేసిన తప్పేంటా అని చూస్తే అమ్మాయిగా పుట్టడమేనా.? ఆ అమ్మాయితో స్నేహం చేస్తే మడిలో ఉన్న అతగాడు మైల పడతాడా..! తియ్యగా ఉండే చిరునవ్వు చేదుగా అనిపిస్తుందా అతనికి..!!

చరణం2
తనేమి అనడూ అనేది వినడూ ఏం మనిషో గానీ..
అదో విధంగా అమాయకంగా చూస్తాడెందుకనీ..
అమ్మాయిగ జన్మించడమేనా నే చేసిన అపచారం..
మగ పుట్టుక మడి చెడిపోతుందా నాతో చేస్తే స్నేహం..
నే నవ్వితే చిరు చేదుగా ఉందేమో పాపం తనకీ..

చిన్న చిన్న పదాలు. గొప్పగా అర్థాలు, అంతరార్థాలు కూడా ఏమీ లేవు. కానీ నాకు మాత్రం భలే నచ్చాయి ఈ పాటలో వాడిన పదాలు. సినిమా అయితే నేను చూడలేదు. యూ ట్యూబ్ లింక్ కూడా దొరకలేదు..:( సినిమా అంతా చూసే సమయం లేక, ఆన్లైన్ మూవీలో ఈ పాట మాత్రమే చూసాను. వాళ్లిద్దరి హావభావాలు తప్పించి మిగిలినదంతా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ లొకేషన్స్ భలే ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ పాటకి స్వరాన్నందించిన హంసిక అయ్యర్ గొంతు చాలా బాగుంది. కానీ ఇంకాస్త తెలుగు వచ్చుంటే ఇంకా బగుండేది అనిపించింది.

డౌన్‌లోడ్ చేసుకుని వినాలనుకుంటే ఇక్కడ నొక్కండి.
ఆన్‌లైన్ వినాలనుకుంటే ఇక్కడ నొక్కండి.

Tuesday, March 1, 2011

జాగో జాగో రే జాగో


ఒక ఇష్టాన్ని/ ఒక గమ్యాన్ని/ ఉన్న ఒకే జీవితాన్ని, సున్నా నుండి మొదలు పెట్టడం; చాలా తెలుసు అనుకున్న విషయాలు, నిజానికి చాలా తక్కువ అని తెలిసిన తరువాత, మళ్లీ మొదటి నుండి సరైన దిశలో నేర్చుకోవడం... అదే కదూ, విత్తనం సరికొత్తగా మొలకెత్తడం అంటే. అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న నూనూగు మీసాల ప్రాయం, మనకెదురు నిలిచే దమ్ము ఎవరికుందన్న మొండి ధైర్యం, సత్తాని సరైన దిశలో పెట్టలేని మనసు, వయస్సు.. అన్నీ కలిసి కొత్తగా తమ గమ్యాన్ని / జీవితాన్ని నిర్మించుకోవడం.. దాని కోసం తమ  నుండి తాము కొత్తగా మొలకెత్తడం.. వాహ్.. అద్భుతం.. ఇక ఇలాంటి విషయం మన శాస్త్రిగారి చేతిలోకొస్తే అది ఎంత అందంగా చెక్కబడిన సాహిత్య శిల్పం అవుతుందో ఈ పాటని చూసి తెలుసుకోవచ్చు.. మేఘాల అంచుల్ని శ్రావ్యంగా మీటగల మనం ఇలా మట్టిలో ఎన్నాళ్లుంటాం..ఏమీ చేయలేని పక్షంలో తూర్పు తిరిగి దండం పెట్టుకునే కాలానికి ఇక చెల్లు చీటీ ఇచ్చేసి, ఆ సూర్యభగవానుడికే దారి చూపించేలా మేల్కొందాం. 

పల్లవి: 
 ఒక విత్తనం మొలకెత్తడం సరి కొత్తగా గమనించుదాం..
నిలువెత్తుగా తల త్తటం నేర్పేందుకనే తొలి పాఠం..
ముని వేళ్లతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం..
పసి వాళ్లలా ఈ మట్టిలో ఎన్నాళ్లిలాగ పడి వుంటాం..
ఉనికే మన కను రెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం..
ఇదిగో నీ దారిటు వుందని సూరీడుని రారమ్మందాం..
జాగో జాగో రే జాగో |6|
 

సందేహం(అతి) మన శతృవు. ఏదో జరుగుతుందన్న సందేహంతో ఆగిపోయే ఏ ఒక్కటీ తన గమ్యాన్ని చేరుకోలేదు. అందుకే, ఆకాశం నుండి దూకేస్తే అణువణువుగా విఛ్చిన్నమవుతానని తెలిసినా, చిన్న చినుకు ధైర్యంగా ముందుకెళ్లి, మరలా తనని తానే కలుపుకుంటూ.. ఏరుగా కలిసి, నదిగా మారి, వరదలా పొంగి, అనంతమైన అర్ణవాన్ని కలుస్తుంది.. తన గమ్యాన్ని చేరుకుంటుంది. సందేహాన్ని పక్కకు నెట్టి, సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఆరంభపు అడుగేస్తే విజయం మనదేగా.. 

 చరణం1 :
ఆకాశం నుండి సూటిగా దూకేస్తే వున్న పాటుగా 
ఎమౌతానంటు  చినుకలా ఆగిందా బెదురుగా..
కనుకే ఆ చినుకు ఏరుగా ఆ ఏరే వరద హోరుగా..
ఇంతింతై ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా..
సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా..
ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా..
జాగో జాగో రే జాగో |6|
 

పరిష్కారం లేని సమస్య ఉండదట. ఇంపాసిబుల్ అన్న పదమే చెబుతుందట ఐ యాం పాసిబుల్ అని. అలాంటప్పుడు, నిజంగా అసాధ్యమైన పని ఉంటుందా..!! అసాధ్యమైన పని ఉండదు అనే నిజం తెలుసుకోవడం నిజంగా అంత రహస్యమా..కాదని ఎంత బాగా చెప్పారో శాస్త్రి గారు. మొదట వేసే నీ అడుగే ఒక కొత్త పథాన్ని సృష్టిస్తుంది.. (వేసే పదం పథం - ఈ వాక్యం నాకు ఇలాగే అర్థమయింది.. కానీ అనుమానంగానూ ఉంది. దీనికింకేదైనా మంచి అర్థం ఉంటే తెలియజేయగలరు)
"ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్.." సందేహంతో మొదలంటూ కాకముందే ముగింపు పలికే వారం కాదు మనం. సంకల్పాన్ని నెరవేర్చుకోగలిగే ధీరులం. ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోగలిగేదే మన పయనం. "సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం" విజయానికి ఎంత గొప్ప నిర్వచనం. ఎటువంటి ఆటుపోట్లు, సవాళ్లు, సమస్యలు ఎదురైనా వాటికి ఎదురొడ్డి సమరానికి సై అనగలే సంసిద్ధతే విజయమట.
 
చరణం2 :
  ఏ.. పని మరీ అసాధ్యమేం కాదే ఆ..  నిజం మహా రహస్యమా
వేసే.. పదం పథం పదే పదే పడదోసే సవాళ్లనే ఎదుర్కోమా
మొదలెట్టక ముందే ముగిసే కథ కాదే మన ఈ పయనం
సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం..
జాగో జాగో రే జాగో |6|

ఈ పాట మొత్తం ఒకెత్తైతే.. "జాగో జాగో రే జాగో" అన్న పదాలు మరో ఎత్తు. ఈ వాక్యం దగ్గరికి వచ్చేసరికి, అసంకల్పితంగా ఏదో తెలియని ఉద్రేకం కలుగుతుంది మనసులో. ఏదో సాధించడానికి ఒక అదృశ్య ప్రోత్సాహం వెన్నంటి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది.మొత్తంగా ఒక శక్తివంతమైన(పవర్‌ఫుల్) సాహిత్యం అద్భుతమైన సంగీతాన్ని అల్లుకుని ఒక కొత్త ప్రోత్సాహాన్ని ఇస్తున్న భావన.

ఈ పాట మీరు ఇక్కడ చూడొచ్చు.

Friday, December 31, 2010

మనకొద్దీ చెంచాడు కష్టాలు

"అయ్యోలూ..అమ్మోలూ.. ఇంతేనా బ్రతుకు హో హో హో." మీకందరికీ జెమిని టి.వి. లో వచ్చే అమృతం సీరియల్ కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట తెలిసే ఉంటుంది. కారణం తెలియదు కానీ, ఈ పాట వినగానే అప్రయత్నంగా నాకు  ఒక కథ గుర్తొస్తుంది. ఈ పాట వింటే ఎంత నవ్వొస్తుందో, ఆ కథ వింటే అంత ఉద్వేగం ఆవహిస్తుంది. ఈ పాట గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా రెండు విరుద్ధమైన భావాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాను. అందుకే ఇక్కడ హాస్యపూరితమైన వ్యాఖ్యానం, మనసు పలికే బ్లాగులో ఉద్వేగభరితమైన కథనం.
 
ఎప్పుడూ కష్టాలే ఉంటాయా మన జీవితాల్లో, నవ్వుల పువ్వులు కూడా పూస్తున్నాయి సరిగ్గా చూడు అంటూ సున్నితమైన హాస్యంతో చెప్పారు. జీవితాన్ని ఒక టి.వి. గా తీసుకుంటే మన మనసనే రెమోట్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుందని, ఏడుపుగొట్టు ఆలోచనల్ని రానివ్వకుండా మనమే చూసుకోవచ్చని ఎంత బాగా చెప్పారో. హహ్హ.. చివరికి మనం లోతైన ఊబిలా భావించే కష్టాల్ని చిలిపి కష్టాలు అని తేల్చేసి వార్తల్లో హెడ్‌లైన్స్ తో పోల్చేసారు. నాకు తెలుసు ఇది ధారుణమే అని. మరే.. మనకే బోలెడన్ని కష్టాలు ఉన్నట్లు మనం తెగ ఫీల్ అయిపోయి సంతోషంగా ఏడ్చేస్తూ ఉంటామా.. ఇప్పుడేమో ఈయనగారు ఇలా వచ్చేసి కొత్తగా "కష్టాలు అన్నీ సిల్లీగానే ఉంటాయి" అంటే ఏమనుకోవాలి.? అసలు బాధల్లో తీవ్రంగా లీనమైపోయి గుండెలవిసేలా ఏడవడం ఎంత బాగుంటుందనీ.. ఆ ఆనందం ఈయనకెలా తెలుస్తుంది..? ఇంకా చూడండి.. మన గుండెలకి లోతుగా తగిలే గాయాలు అయొడిన్‌తో మానిపోయేవట. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా..?
       అయ్యోలూ అమ్మోలూ ఇంతేనా బ్రతుకు హో హో హో
       ఆహాలూ ఓహోలూ ఉంటాయి వెతుకు హా హా హా
       మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు?
       ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు!
       వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు?
       అయొడిన్‌తో అయిపోయే గాయాలే మనకు గండాలు

ఇంకా చూడండి. మన మీద ఎంతో ప్రేమతో మనతో ఉండిపోడానికి వచ్చింది ఈ ట్రబుల్ అని ఎంతో ఆనందిస్తూ ఉంటామా. కాదట. ఎక్కడికో వెళుతూ ఉంటే దారిలో కనిపించి "హెల్లో హౌ డు యు డు" అని మాత్రమే అడుగుతుండట. జీవితాంతం మనం కష్టాల్ని సంతోషంగా అనుభవించడానికి, ఆతిథ్యం ఇస్తా అన్నా కూడా మనతో ఉండదట. ట్రబుల్ ఏమైనా పనీ పాటా లేకుండా గాలికి తిరుగుతూ ఉంటుందా తీరిగ్గా మనతో కాలక్షేపం చెయ్యడానికి అని కొశ్చను:(. మనసు చివుక్కుమనదూ..!! ఇరుకు అద్దెల్లు ఉన్నందుకు మనమంతా ఆనందంగా బాధ పడుతూ ఉంటే ఈయనేంటండీ, గాలికి కూడా స్థానం లేని ఇంట్లో పెను తుఫాను అడుగు ఎలా పెడుతుందని అంటారు..?
       ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవొయ్ ట్రబులు
       “హలో హౌ డు యూ డూ” అని అంటోంది అంతే నీ లెవెలు
       ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా
       తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా
       గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు
       కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు?

చూసారా చూసారా మళ్లీ అదే మాట. అంతు లేకుండా ముక్కు చీదుకుంటూ మనం అనుభవించే కష్టాలు చెంచాడేనా..? పైగా ఆ మాత్రం కష్టాలకి ఆయాసం వద్దని హితబోధ ఒకటి. తిప్పి తిప్పి కొడితే కరెంటు, రెంటే మన కష్టాలట. ఏడ్చీ ఏడ్చీ తెచ్చుకునే కన్నీళ్లు కూరలో కారం ఎక్కువైనందుకట. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా మీరే చెప్పండి. మనం చేసే ఫైటింగంటే దోమల్తో చేసేదేనా.? ఎంత అవమానం. ఈ అవమానం మనకి కాదు, మనం ఎంతో ప్రేమగా బాధ్యతగా ఎప్పుడూ మన వెన్నంటే ఉంచుకునే మన కష్టాలకి, కన్నీళ్లకీనూ..
       ఒరేయ్ ఆంజనేయ్లూ! తెగ ఆయస పడిపోకు చాలు
       మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
       కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
       కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
       నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
       భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్!

అసలవి లేకుండా మన రోజు గడుస్తుందా అంట. అటువంటి కష్టాలు, కన్నీళ్ళకి మనం ఎంత పెద్ద పీట వేయాలి! ఇలా అవమానించి సాగనంపితే మళ్లీ మనకి హెల్లో చెప్పడానికి అయినా వస్తాయా అసలు. ఇక మనం ఏడ్చేదెలా.. కన్నీళ్లు పెట్టుకునేదెలా చెప్మా..!!
ఏదేమైనా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా.. మీకు ఇలాంటి చిలిపి కష్టాలు, చెంచాడు కష్టాలు దరిదాపుల్లోకి కూడా రావొద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Youtube Link : http://www.youtube.com/watch?v=cPu0_Q19UGc

Tuesday, November 30, 2010

నమ్మక తప్పని నిజమైనా..

ప్రేమ.. నిర్వచించలేని ఒక అనుభూతి. పదాల్లో కూర్చలేని ఒక భావం. ప్రేమికులిద్దరూ కలిసున్నంత వరకూ ప్రపంచమంతా అందంగా, ఇంత అందమైన ప్రపంచం తమ కోసమే దేవుడు సృష్టించాడు అన్నంత ఆనందంగా ఉంటారు.మరి ఏదైనా కారణాల వల్ల విడిపోతేనో..!! ఆ బాధ చెప్పనలవి కానిది. తినడానికైనా, తాగడానికైనా, మట్లాడ్డానికైనా గొంతుకడ్డం పడే బాధ అది. ఇక నిద్ర సంగతంటారా.. అదెలా ఉంటుందో కొద్ది రోజుల వరకూ గుర్తు కూడా రాదు. మరి అటువంటి బాధకి అక్షర రూపం ఇవ్వడం మామూలు విషయం కాదు. నిన్నటి దాకా నిచ్చెలి చేతుల్లో చెయ్యేసి పక్క పక్కనే నడుస్తూ జీవితాన్ని రంగుల్లో ఊహించుకుంటూ ఉండే ప్రియుడు, ఒక్క సారిగా తన చేతిలో సఖి చెయ్యి మాయం అయిందని తెలుసుకుని అది నిజమే అని తెలిసి కూడా, నిజమా కాదా అన్న సంఘర్షణలో ఉన్న తన మనసుకి సర్ది చెప్పలేక సతమతమయ్యే ఒక ప్రేమికుడి వ్యధ.. "బొమ్మరిల్లు" చిత్రం లోని ఈ "నమ్మక తప్పని నిజమైనా" పాట.ఇక ఇటువంటి భావాలని అక్షర రూపంలో పొందు పరచడం మన శాస్త్రి గారికి వెన్నతో పెట్టిన విద్యేమో.. ఆ బాధని మన మనసు మూలాల్లోకి తీసుకెళ్లిపోతాడు. ఒకానొక క్షణంలో మన కళ్లలో నీటి తెర అడ్డు పడటం అన్నది చాలా సాధారణ విషయం (ఎన్నో పాటల్లో నాకు అనుభవానికొచ్చింది).

నువ్విక రావు అన్న నమ్మలేని నిజాన్ని చెబుతూ ఉన్నా ఎందుకు వినదో నా మనసు.. నువ్వొస్తావు అన్న పిచ్చి ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎదురుగా ఎవరొస్తున్నా అది నువ్వే అన్న ఆశ. మరి నీ రూపం నా చూపులనొదిలి వెళ్లలేదుగా. నువ్వు లేని ఈ ఏకాంతంలో ఇంకెంత మంది ఉన్నా నేను ఒంటరినే కదా.. నన్ను ఇటువంటి ఒంటరితనంలో వదిలి వెళ్లావు కదూ.. నువ్వు నిన్నటి కలవే అని తెలుసు. అయినా, కన్నులు తెరిచుకుని అదే (నీ) కలలో ఉన్నాను ఇప్పటికీ. మరి నువ్వు నన్ను వదిలి వెళ్లినంత మాత్రాన నీ ఙ్ఞాపకాల్ని నేను మర్చిపోలేను కదా..
       నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెపుతున్నా
                               ఎందుకు వినదో నా మది ఇపుడైనా
       ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
                               నీ రూపం నా చుపులనొదిలేనా
       ఎందరితో కలిసున్నా నే నొంటరిగానే ఉన్నా
                               నువ్వొదిలిన ఈ ఏకాంతంలొనా
       కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా
                               ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా

"ఈజన్మంతా విడిపోదీ జంటా అని దీవించిన గుడిగంటను ఇక నామది వింటుందా" ఎంత గొప్పగా రాసారో.. ఇద్దరం కలిసి తిరిగిన ఏ చోటైనా నువ్వు లేని నన్ను గుర్తు పడుతుందా.. వాహ్.. నీ ప్రేమ గుర్తులతో నన్ను నిలువునా తడిమి.. ఙ్ఞాపకాలను మాత్రం వదిలి వెనుదిరిగావు. నీ వియోగంతో చెమర్చిన ఈ కనులతో నిన్ను ఎలా వెతికేది..
       ఈజన్మంతా విడిపోదీ జంటా
                  అని దీవించిన గుడిగంటను ఇక నామది వింటుందా
       నా వెను వెంట నువ్వే లేకుండా
                  రోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా
       నిలువున నను తడిమిఅలా వెనుదిరిగిన చెలిమి అలా
                  తడి కనులతో నిను వెదికేది ఎలా

కానీ ఇక నువ్వు రావు అన్నది నిజం. మరి, నిరంతరం వెలిగే వెన్నెల లాంటి నీ స్నేహంలో కనీసం కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి అని ఆనందించమంటావా.. లేదా నువ్వు రావన్న నిజాన్ని తలుచుకుంటూ నా ఊహల్లో కలిగే వేదన చీకటిలో జీవితం గడిచిపోతుంది అనుకోవాలా..చిరునవ్వులతో పరిచయమై ఎన్నటికీ మరచిపోలేని సిరిమల్లెల పరిమళాన్ని అందించి చేజారిపోయావు.. నా ఆశల తొలి వరానివి. వాహ్. ఎంత అద్భుతంగా రాసారో..
       నీ స్నేహంలొ వెలిగే వెన్నెల్లో
                  కొనాళ్ళయినా సంతోషంగా గడిచాయనుకోనా
       నా ఊహల్లో కలిగే వేదనలో
                  ఎనాళ్ళైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
       చిరు నవ్వుల పరిచయమా సిరి మల్లెల పరిమళమా
                  చేజారిన ఆశల తొలి వరమా... 

Youtube link : http://www.youtube.com/watch?v=62W-xiJABTQ&feature=related

Thursday, November 25, 2010

పుటుక్కు జర జర డుబుక్కు మే

"పుటుక్కు జర జర డుబుక్కు మే.. " ఎక్కడో విన్నట్లు ఉంది కదూ.. ఈ వాక్యం గురించి ఏదో చిత్రంలో ప్రకాష్‌రాజ్ మాట్లాడతాడు. ఈ వాక్యానికి చాలా పెద్ద అర్థం చెబుతాడు. కానీ నాకు ఈ వాక్యం వినగానే మాత్రం గుర్తొచ్చేది "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రం లోని "పారిపోకే పిట్టా" పాట.మన అందరికీ తెలిసిన విషయమే.. సీతారామ శాస్త్రి గారు అతి సులువైన, అందరికీ అర్థమయ్యే పదాలతో ఎంత గొప్ప భావాన్నైనా పలికించగలరని. ఈ పాటని కూడా అలాగే చాలా సులువైన పదాలతో అర్థవంతంగా రాశారు.
తన ప్రియురాలికి దూరమై ఎలాగైనా చెలి చెంతకి చేరుకోవాలని సంకల్పంతో చేసే ప్రయాణంలో ఉన్న ఒక ప్రియుడి ఆరాటం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ పాటలో మనకి. నాకు ఈ పాట వింటూంటే నిజంగా దోసెడు విరజాజుల్ని తెచ్చి ముద్దగా మాలకట్టినట్లుగా అనిపిస్తుంది. అంత అందమైన పదాల అల్లిక ఈ పాట. ఇందులో ఎక్కువగా ఆకర్షించిన పాత్ర ప్రభుదేవాది. ప్రియుడి కబురుని ప్రియురాలి చెంతకు చేర్చమని రకరకాల పక్షులకి విన్నవిస్తాడు.

పాట మొదలుపెట్టడమే పారిపోయే పిట్టతో మొదలు పెడతారు. పారిపోయే ప్రేమ పిట్టను పారిపోవద్దని చాలా గారంగా బ్రతిమాలుతూ చెంతకు చేరకపోతే ఎలా అని గద్దిస్తూ.. మజిలీ చేర్చవా, నీ వెంటే వస్తాగా అంటూ.. చాలా నచ్చింది నాకు ఈ పల్లవి.

       పారిపోకే పిట్టా.. చేరనంటే ఎట్టా
       అంత మారాం ఏంటంట మాట వినకుండా
       సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా
       తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట..

అనుకోని పరిస్థితుల్లో ప్రేమికులు ఇద్దరూ దూరమైనప్పుడు ఎవ్వరూ సంతోషంగా ఉండరు. విచిత్రం ఏమిటంటే, ఎవరికి వారు అవతలి వారు సంతోషంగా ఉంటే చాలు అని ఆశ పడుతూ ఉంటారు. ఇంత సున్నితమైన ప్రేమికుల మనస్తత్వాన్ని చాలా అందంగా వర్ణించారు సిరివెన్నెల. ప్రియుడు తన సంతోషాన్నంతా తన చెలితో పంపించాడట. ఇక్కడింకో చమత్కారం.. ప్రియుడి పేరు సంతోష్. తన సంతోషాన్నంతా ప్రియురాలి వెంట పంపించాడట ఆ సంతోష్. మరి తన చెలి ఆ సంతోషాన్ని భద్రంగా చూసుకుంటుందో లేదో అని బెంగ. చెలి సంతోషంగా ఉందో లేదో అన్న సందేహాన్ని ఇంత కన్నా అందంగా ఎవరూ వ్యక్త పరచలేరేమో అన్నంత అందంగా రాసారనిపించింది. 
ప్రతి క్షణం ఎంతో సరదాగా నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే అతను, తన అల్లరిని, చిందర వందర సరదాని చెలి అందెలుగా తొడిగాడట. (తన అల్లరి తనకు దూరమై అతను ముభావంగా ఉన్నాడన్నది కనిపించే సత్యం.) మరి ఆ అందెల్ని ప్రతి రోజూ సందడిగా ఆడిస్తుందా లేదా అన్న సందేహం.కానీ ఇలా విడిపోయినప్పుడు ఆ ప్రేయసి మాత్రం సంతోషంగా అల్లరిగా ఎలా ఉండగలుగుతుందండీ..?? అదొక ఆశ అంతే..

       నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
       భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా
       తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా
       ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా

ఇక్కడే సందేహాలకి సమాధానాలు కూడానూ.. చెలికొమ్మ చినబోయిందనుకుంటా.. ప్రియుడి కోసమే ఎదురు చూసే తన ప్రియురాలి గుండె గూటికి అతను వచ్చేస్తున్నాడని ముందు గానే కబురు చెప్పమంటూ చిలుకమ్మని వేడుకోవడం.. అతడు వచ్చేలోగా విన్న కథలన్నీ ఆ అమ్మాయికి చెప్పమని కాకమ్మని కోరడం..
       
       చినబోయిందేమో చెలి కొమ్మ..
       ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా
       నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి
       నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా…
       తీసుకుపో నీ వెంట..వస్తా తీసుకుపో నీ వెంట

ప్రేమలో ఉన్నా విరహంలో ఉన్నా ఆకలి నిద్దుర ఉండవట. ఇటువంటి ప్రయోగం చాలా పాటల్లో, కథల్లో, కవితల్లో చూసా కానీ ఇంత అందంగా అయితే ఎప్పుడూ చూడలేదు. ప్రియుడి దారిలో ఆకలి కనిపించిందట. అన్నం పెట్టను పోవే అని కసిరిందంటూ ప్రేయసి నిందించిందట. తన వద్దకు రావొద్దని తరిమేసినందుకు నిద్దుర చాలా చిరాగ్గా కనిపించిందట ప్రియుడికి.. నాకు ఈ ప్రయోగాలు ఎంత బాగా నచ్చాయో..

       ఆకలి కనిపించింది…నిన్నెంతో నిందించింది
       అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
       నిద్దర ఎదురయ్యింది..తెగ చిరాగ్గ ఉన్నట్టుంది
       తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది

ప్రేమా.. నిన్ను ఎదిరించే వాళ్లు, నువ్వడిగింది ఇవ్వని వాళ్లంటూ ఎవరూ లేరన్న సత్యం నీకు కూడా తెలుసు కదా.. మరి ఎందుకమ్మా ఇంత గారం చేస్తావు. నీ పంతం ముందు ఏ రోజైనా ఏ ఘనుడైనా గెలిచినట్లు చరిత్రలో లేదు కదా..

       ఏం గారం చేస్తావే ప్రేమ
       నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
       ఆ సంగతి నీకూ తెలుసమ్మా
       నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
       తీసుకుపో నీ వెంట..
       ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట
       తీసుకుపో నీ వెంట..తీసుకుపో నీ వెంట

Youtube Link : http://www.youtube.com/watch?v=MiQoDE6Jqjc