Monday, March 28, 2011

చిత్రమాలికలో నా టపా - ఇందిరమ్మ ఇంటిపేరు

చిత్రమాలికలో నా టపా:)) ఇక్కడ చదవండి..

Tuesday, March 1, 2011

జాగో జాగో రే జాగో


ఒక ఇష్టాన్ని/ ఒక గమ్యాన్ని/ ఉన్న ఒకే జీవితాన్ని, సున్నా నుండి మొదలు పెట్టడం; చాలా తెలుసు అనుకున్న విషయాలు, నిజానికి చాలా తక్కువ అని తెలిసిన తరువాత, మళ్లీ మొదటి నుండి సరైన దిశలో నేర్చుకోవడం... అదే కదూ, విత్తనం సరికొత్తగా మొలకెత్తడం అంటే. అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న నూనూగు మీసాల ప్రాయం, మనకెదురు నిలిచే దమ్ము ఎవరికుందన్న మొండి ధైర్యం, సత్తాని సరైన దిశలో పెట్టలేని మనసు, వయస్సు.. అన్నీ కలిసి కొత్తగా తమ గమ్యాన్ని / జీవితాన్ని నిర్మించుకోవడం.. దాని కోసం తమ  నుండి తాము కొత్తగా మొలకెత్తడం.. వాహ్.. అద్భుతం.. ఇక ఇలాంటి విషయం మన శాస్త్రిగారి చేతిలోకొస్తే అది ఎంత అందంగా చెక్కబడిన సాహిత్య శిల్పం అవుతుందో ఈ పాటని చూసి తెలుసుకోవచ్చు.. మేఘాల అంచుల్ని శ్రావ్యంగా మీటగల మనం ఇలా మట్టిలో ఎన్నాళ్లుంటాం..ఏమీ చేయలేని పక్షంలో తూర్పు తిరిగి దండం పెట్టుకునే కాలానికి ఇక చెల్లు చీటీ ఇచ్చేసి, ఆ సూర్యభగవానుడికే దారి చూపించేలా మేల్కొందాం. 

పల్లవి: 
 ఒక విత్తనం మొలకెత్తడం సరి కొత్తగా గమనించుదాం..
నిలువెత్తుగా తల త్తటం నేర్పేందుకనే తొలి పాఠం..
ముని వేళ్లతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం..
పసి వాళ్లలా ఈ మట్టిలో ఎన్నాళ్లిలాగ పడి వుంటాం..
ఉనికే మన కను రెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం..
ఇదిగో నీ దారిటు వుందని సూరీడుని రారమ్మందాం..
జాగో జాగో రే జాగో |6|
 

సందేహం(అతి) మన శతృవు. ఏదో జరుగుతుందన్న సందేహంతో ఆగిపోయే ఏ ఒక్కటీ తన గమ్యాన్ని చేరుకోలేదు. అందుకే, ఆకాశం నుండి దూకేస్తే అణువణువుగా విఛ్చిన్నమవుతానని తెలిసినా, చిన్న చినుకు ధైర్యంగా ముందుకెళ్లి, మరలా తనని తానే కలుపుకుంటూ.. ఏరుగా కలిసి, నదిగా మారి, వరదలా పొంగి, అనంతమైన అర్ణవాన్ని కలుస్తుంది.. తన గమ్యాన్ని చేరుకుంటుంది. సందేహాన్ని పక్కకు నెట్టి, సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఆరంభపు అడుగేస్తే విజయం మనదేగా.. 

 చరణం1 :
ఆకాశం నుండి సూటిగా దూకేస్తే వున్న పాటుగా 
ఎమౌతానంటు  చినుకలా ఆగిందా బెదురుగా..
కనుకే ఆ చినుకు ఏరుగా ఆ ఏరే వరద హోరుగా..
ఇంతింతై ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా..
సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా..
ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా..
జాగో జాగో రే జాగో |6|
 

పరిష్కారం లేని సమస్య ఉండదట. ఇంపాసిబుల్ అన్న పదమే చెబుతుందట ఐ యాం పాసిబుల్ అని. అలాంటప్పుడు, నిజంగా అసాధ్యమైన పని ఉంటుందా..!! అసాధ్యమైన పని ఉండదు అనే నిజం తెలుసుకోవడం నిజంగా అంత రహస్యమా..కాదని ఎంత బాగా చెప్పారో శాస్త్రి గారు. మొదట వేసే నీ అడుగే ఒక కొత్త పథాన్ని సృష్టిస్తుంది.. (వేసే పదం పథం - ఈ వాక్యం నాకు ఇలాగే అర్థమయింది.. కానీ అనుమానంగానూ ఉంది. దీనికింకేదైనా మంచి అర్థం ఉంటే తెలియజేయగలరు)
"ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్.." సందేహంతో మొదలంటూ కాకముందే ముగింపు పలికే వారం కాదు మనం. సంకల్పాన్ని నెరవేర్చుకోగలిగే ధీరులం. ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోగలిగేదే మన పయనం. "సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం" విజయానికి ఎంత గొప్ప నిర్వచనం. ఎటువంటి ఆటుపోట్లు, సవాళ్లు, సమస్యలు ఎదురైనా వాటికి ఎదురొడ్డి సమరానికి సై అనగలే సంసిద్ధతే విజయమట.
 
చరణం2 :
  ఏ.. పని మరీ అసాధ్యమేం కాదే ఆ..  నిజం మహా రహస్యమా
వేసే.. పదం పథం పదే పదే పడదోసే సవాళ్లనే ఎదుర్కోమా
మొదలెట్టక ముందే ముగిసే కథ కాదే మన ఈ పయనం
సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం..
జాగో జాగో రే జాగో |6|

ఈ పాట మొత్తం ఒకెత్తైతే.. "జాగో జాగో రే జాగో" అన్న పదాలు మరో ఎత్తు. ఈ వాక్యం దగ్గరికి వచ్చేసరికి, అసంకల్పితంగా ఏదో తెలియని ఉద్రేకం కలుగుతుంది మనసులో. ఏదో సాధించడానికి ఒక అదృశ్య ప్రోత్సాహం వెన్నంటి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది.మొత్తంగా ఒక శక్తివంతమైన(పవర్‌ఫుల్) సాహిత్యం అద్భుతమైన సంగీతాన్ని అల్లుకుని ఒక కొత్త ప్రోత్సాహాన్ని ఇస్తున్న భావన.

ఈ పాట మీరు ఇక్కడ చూడొచ్చు.