Thursday, July 22, 2010

కొత్త బంగారు లోకం

ఇప్పుడు మనమొక కొత్త బంగారు లోకానికి వెళ్లొద్దామా.? ఏంటి అలా చూస్తున్నారు.? అర్థం కాలేదా..? ఈరోజు మనం పాడుకోబోయే పాట "కొత్త బంగారు లోకం " చిత్రం లోనిదండీ.. ఒక భావాన్ని పలికించడానికి, సిరివెన్నెల గారు ఎంచుకునే పదాలని, వాటి అల్లికని చూస్తూ ఉంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండీ.. ఆ గొప్పతనం నాకు ఈ పాటలో చాలా చక్కగా కనిపిస్తుంది. ఆయన రాసిన పాటల్ని పొగడ్డం మానేద్దామని నిశ్చయించుకున్నానా!! కానీ, మీరే చెప్పండి.. ఎలా మానాలి.? ఒక్కొక్క పాట వింటుంటే అభినందించకుండా ఉండలేకపోతున్నాను.ప్రతి పాటలో ఒక్కొక్క వాక్యం మనకి ఎన్నో విషయాలు చెబుతుంది. ఇంకా చిత్రం ఏంటంటే , విన్న ప్రతి సారి, అదే వాక్యం కొత్త అర్థాన్ని చూపిస్తుంది. ఆ వాక్యాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అటువంటి గొప్ప పాటల్లో మన కొత్త బంగారు లోకం పాట కూడా ఒకటి.


నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా
నీ చిక్కులు నీకే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా


అలలుండని కడలేదని అదిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా


పొరబాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా
మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె పెనుచీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేశాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే జతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాతా అనుకోదేం ఎదురీతా


పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా


"పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా"
పై వర్ణణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందంటారు సుమండీ..?నాకైతేనేమో, సిరివెన్నెల గారు కనిపిస్తే ఈ పాటలన్నీ విడి విడి గా చూపించి, ఆయా పాటలు రాసే సమయంలో ఆయన మనఃస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. అపుడైతే ఆయనకి ఇన్ని గొప్ప గొప్ప ఆలోచనలు ఎలా వచ్చేవో తెలిసిపోతుంది కదా.. నాకు తెలుసు, ఇప్పుడు మీరంతా నా తెలివితేటలు చూసి నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారని. కానీ, చెప్పొద్దూ.. నాకు చాలా సిగ్గు పొగడ్తలంటే.. ;)
"పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా" ఎంత గొప్పగా వర్ణించారు కదండీ కాలం కఠినత్వాన్ని. ఈ వాక్యం వినగానే నా చిన్న మెదడు ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది (వేదాంతమో, వైరాగ్యమో నాకు ఇప్పటికీ అనుమానమే..) మొత్తానికి నేనో పెద్ద వేదాంతి లాగా ఆలోచించేస్తూ ఉంటాను. కానీ నాకున్న సుగుణాలలో ఇదొకటి, నా వేదాంతం లాంటి వైరాగ్యంతో ఎవ్వరినీ కష్టపెట్టక పోవడం. మొత్తానికి నాకు బాగా అర్థం అయిన విషయం ఏమిటంటే.. నేను అసలు విషయాన్ని వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నానని.
కానీ ఏం చెయ్యాలండీ. నిజానికి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, గత కొద్ది రోజులుగా భోజనం ముఖం ఎరుగని మనిషి ముందు పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టి తిను అన్నట్లుగా ఉంది. (ముందు దేన్ని తినాలో అర్థం కాక వెర్రి చూపులు చూస్తూ..) ప్రతి వాక్యం లోనూ గొప్ప గొప్ప భావాన్ని దాచిపెట్టారు సిరివెన్నెల గారు. దేన్నని చూడాలి ముందు..? :( ఒకటి రాస్తూ ఉంటే అంతకంటే అందమైన వర్ణణ ఇంకోటి గుర్తొస్తుంది.
"మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె పెనుచీకటి చెబుతుందా"
నిజం చెప్పనా..? ఆ భాస్కరుడి గురించి నేను ఇంత గొప్పగా ఎప్పుడూ ఆలోచించలేదండీ.. ఇది చూసిన తరువాత మాత్రం ఆ సూర్య భగవానుడంటే ఏదో తెలియని గౌరవం, ఇష్టం ఏర్పడ్డాయి. మనసులో ఆ సూర్యుడి గురించి ఆలోచన వచ్చిన ప్రతి క్షణం (అంటే, ఎండ ఎక్కువగా ఉందనో లేదా అసలు ఈ రోజు ఎండే లేదనో.. ఇలా అన్నమాట) ఈ వాక్యం గుర్తొస్తుంది. మన కోసమే కదా పాపం ఆయన అలా నిత్యం మండిపోతున్నాడు అని.
పొరబాటున మనం చెయ్యి జార్చుకున్న తరుణం తిరిగి రాదని ఎంత అందంగా చెప్పారో కదా..! ప్రతి పూటని ఒక్కో పుటలా వర్ణించారు.. నిజమే కదా, నిజానికి ప్రతి ఘడియ నుండీ మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ప్రతి క్షణం మనకి ఏదో నేర్పిస్తుంది. సరిగ్గా అర్థం చేసుకోవాలే గానీ.. జీవితం కన్నా గొప్ప పుస్తకం ఏదీ ఉండదు. కాలం కన్నా గొప్ప ఉపాధ్యాయుడు ఎవ్వరూ ఉండరు.ఆ విషయాన్ని ఎంతో అందంగా, అతి సులువైన పదాలతో చెప్పారు సిరివెన్నెల గారు.
ఇక ఇంత చేసిన ఆ మహానుభావుడిని ఎలా పొగడకుండా ఉండగలనండీ..? నాకు ఒక్క విషయం బాగా అర్థం అవుతూ ఉంది. నా దగ్గర ఇంక పొగడడానికి పదాలు లేవని.. :( దయచేసి కొంచెం సహాయపడుదురూ.. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను (ఋణం మాత్రం తప్పకుండా ఈ జన్మ లోనే తీర్చుకుంటాను.. :P )

4 comments:


Sai Praveen said...
చాలా బాగా రాస్తున్నారండి. నేను కూడా "సిరివెన్నెల విరిజల్లులు" పేరుతొ ఇటువంటి ప్రయత్నమే చేస్తున్నాను నా బ్లాగులో. నా బ్లాగు పేరు కూడా సిరివెన్నెల :)
మధురవాణి said...
This post has been removed by the author.
డేవిడ్ said...
అపర్ణ గారు నేను చాల సార్లు సిరివెన్నెల గారి పాటలు విని ఎంజాయి చేశాను కాని ఆ పాటలోని భావాల్ని అంతగా గమనించలేదండి...పాటలోని భావాల్ని చాల చక్కగ వివరించారు... ఎంతగ ఇన్వాల్వ్ అయ్యరో ఇంతగా బాగ రాసారు.
సిరివెన్నెల said...
@ సాయి ప్రవీణ్ గారు. నేను మీ బ్లాగుని కూడా చూసాను :) అనుకోకుండా ఇద్దరం ఒకే పడవ మీద ప్రయాణిస్తున్నాం అన్నమాట :):). సిరివెన్నెల గారు చూస్తే ఎంతగా ఆనంద పడతారో కదా.. @ డేవిడ్ గారూ!! ధన్యవాదాలండీ. ఆయన మీద ఉన్న అభిమానమే నన్ను అంతగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది :) జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని కలిస్తే చాలు.

2 comments:

nagarjuna said...

ఈ పాటకు సాహిత్యం సిరివెన్నలగారని పోస్టు చూసేంతవరకు తెలియలేదు..నేనింకా చంద్రబోస్‌గారు రాసారనుకున్నాను. ఇంత చక్కని లిరిక్స్‌ బాలు గొంతునుండి వినపడుతుంటే ఓ మినీ భగవద్గీత చదివినట్టే అనిపించేది..


బై ది వే...వర్డ్‌ప్రెస్ బ్లాగు ’మనసు పలికే’ ప్రసీదగారు మీరేనా..?

మనసు పలికే said...

ధన్యవాదాలు నాగార్జున గారూ!! మీ follow up కి కృతఙ్ఞురాలిని..
నాకు వర్డ్‌ప్రెస్ ప్రసీద గారు తెలియదు. కాబట్టి ఆ 'మనసు పలికే' ప్రసీద గారు నేను కాదనే అనుకుంటున్నాను, ఎందుకంటే అనుకోకుండా నా పేరు అపర్ణ అయింది కదా.. ! :)
మీరన్నది ఖచ్చితంగా నిజం.. ఈ పాట వింటుంటే మిని భగవద్గీత వింటున్నట్లే ఉంటుంది. ఇంకా, గమ్యం చిత్రం లోని 'ఎంతవరకూ ఎందుకొరకూ' పాట విన్నా కూడా..