Thursday, October 21, 2010

పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా..


జీవితం మీద ఎన్నో ఆశలతో, ఇంకా ఏదో మంచి జరగాలనే కోరికలతో, బోలెడన్ని మనసులోనే కోరేసుకుంటూ గుళ్లు గోపురాలూ తిరుగుతూ ఉంటాం.. అసలు ఆ ప్రదేశాల దగ్గరకు వెళ్లగానే ఏదో తెలియని ప్రశాంతత.. అంతెందుకు, ఎక్కడైనా దేవుడి పాటలు విన్నా, గుడి గంటలు దూరంగా వినిపించినా ముఖ్యంగా హారతి కనిపించినా అప్పటి వరకూ మనసు అడుగుల్లో ఎక్కడో దాగి ఉన్న భక్తి  బైటికి వస్తుంది. దేవుడి పాటలకి, గుడి గంటలకి, హారతికి ఉన్న గొప్పతనం అలాంటిది.

ఒక్కసారిగా జీవితం ఆగిపోతుంది.. మన ఆలోచనలు, మన అనుభవాలు, అనుభూతులు, ఇష్టాయిష్టాలు, అనుబంధాలు, అన్నీ.. అన్నీ ఆగిపోతాయి ఉన్నట్టుండి. కాదు.. చావు మనకి దూరం చేస్తుంది వీటన్నిటినీ. మరి చనిపోయాక..? వేటి సంగతి ఎలా ఉన్నా దేహాన్ని మాత్రం ఒక నిప్పు కణిక కాల్చేస్తుంది..
అక్కడ హారతి.. ఇక్కడ చితి.. రెండూ ఒకే నిప్పు కణిక.. కానీ అర్థం చేసుకోడానికి ఒక జీవితకాలం పట్టేంత లోతైన భేదం ఉంది వాటి మధ్య.

చూడగానే అర్థం అయిపోయింది అనిపిస్తుంది మన సిరివెన్నెల గారి సుస్వాగతం చిత్రంలోని "ఆలయాన హారతిలో" అన్న పాట. కానీ విన్న ప్రతి సారీ కొత్త అర్థాన్ని వివరిస్తూ ఉంటుంది పాటలోని ప్రతి మాట..  ప్రేమ అమృతమా హాలాహలమా అన్న అతి సున్నితమైన విషయాన్ని చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, సులువైన పదాలతో వర్ణించారు.

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో..
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం..
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం..
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..


తన ప్రియురాలు ఖచ్చితంగా కనిపిస్తుంది అన్న గుండెలోని ఆశ తడి ఆవిరి అవుతున్నంత మాత్రాన, ఎండమావిలో తన చెలి ఉనికి కనిపిస్తుందా..! వాహ్.. ఎంత అద్భుతమైన వర్ణన.. ప్రేమ ఉంటే చాలు, ప్రపంచమంతా కనిపించడం మానేస్తుంది.. ప్రేమ ప్రపంచాన్ని మరిపిస్తుంది.. కానీ, కనిపించని ఆ ప్రేమ జాడని కనుక్కోవడం ఎంత కష్టం.! కనిపించని ఆ ప్రేమ ఆచూకీ కోసం ప్రపంచాన్ని, తనని మర్చిపోయి వెతుకుతూ తిరిగే ఒక మనసు వ్యధ ఇది. ఆ ప్రేమ జాడ తెలియని ప్రాణం, చుక్కలు దిక్కులు అన్నీ దాటుకుంటూ చేసే ప్రయాణమే ఈ పాట.  "ఎదుట ఉంది నడి రేయన్నది ఈ సంధ్యా సమయం" .అద్భుతం.. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో శాస్త్రి గారికి..

ఎండమావి లో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా..
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా...
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా...
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదుట ఉంది నడి రేయన్నది ఈ సంధ్యా సమయం..
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..


కొడుకు అనే కనుపాపను, తండ్రి అనే కనురెప్ప ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుంటూ ఉంటాడు. మరి అటువంటి కనుపాప కళ్లు తెరవకుండా కనే కల కోసం, తండ్రి సూర్యుడు కన్ను మూశాడట.. ఎంత బాగా పోల్చారు.. ఆ విషయం తెలియని కనుపాప ఇంకా కలవరిస్తూనే ఉందట తనకు కనిపించని ప్రియురాలి కోసం..  తనకు ఆయువిచ్చి, పెంచి పెద్ద చేసిన నాన్న అనే బంధం తన గురించే ఆలోచిస్తూ, ఏదీ చెప్పలేని మౌనంలో కాలిపోయినా కూడా, కనుల ముందుకు రాకుండా చీకటి తెరల వెనుకనే దాగి ఉన్న స్వప్నం కోసం తను ప్రారంభించిన వెతుకులాట ఆగలేదు కదా.. "పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా.." ఎంతో గొప్ప ఫిలాసఫీ ఇంత చిన్న పదాలతో నిర్మించబడిన ఒకే వాక్యంలో ఎలా పొదగబడిందంటారు..??
శాస్త్రి గారు.. మిమ్మల్ని పొగడడానికి నా దగ్గర మాటలు కరువయ్యాయండీ.. అద్భుతం.. హ్మ్.. చివరికి కనుపాప కలే కావాలి అడిగిందని నయనం శాశ్వతంగా  నిదురలోకి వెళ్లిపోయిందట..


సూర్య బింబమే అస్తమించెనుగ మేలుకోని కల కోసం..
కళ్లు మూసుకుని కలవరించెనే కంటి పాప పాపం..
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనం లో మసి అయినా..
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగెఆనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..


చిత్ర కథ మొత్తం ఒక్క పాటలో ఎంత అద్భుతంగా చెప్పారో కదా.. ఎక్కడో చదివాను... చేయి తిరిగిన రచయిత అంటే ఎన్నెన్నో గొప్ప గొప్ప పదాలు వాడేసి పెద్ద పెద్ద పుస్తకాలు రాసెయ్యడం మాత్రమే కాదట. అతి కొన్ని చిన్న చిన్న పదాలను ఉపయోగించి కూడా అర్థాన్ని ఎంతో అందంగా చెప్పగలగడం అట..  ఇక సిరివెన్నెల గారి గురించి ఈ విషయంలో చెప్పనవసరం లేదేమో కదూ.. 
Youtube Link : http://www.youtube.com/watch?v=sZAwHyQnEwQ

16 comments:

హరే కృష్ణ said...

Excellent! Very well written keep posting :)

శిశిర said...

ఈ పాటకి మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. ఈ పాటలో "కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం" అనే వాఖం నాకు చాలా ఇష్టం. ఆ సందర్భాన్ని ఇంతకంటే బాగా ఎవరైనా చెప్పగలరా అనిపిస్తుంది. అలాగే రాజా సినిమాలో ఒక పాటలో "కనులడిగిన కలలను చూడు, కంటికి కావలి నేనుంటా" అని రాశారు. ఎంత బాగుందో చూడండి. నీకు నేనున్నాను అని ఎంత భరోసా ఆ మాటల్లో.
అలాగే మీరు చెప్పిన పాటకి మరింత అందాన్నిచ్చింది బాలూ గారి గళం. ఎంత భావయుక్తంగా పాడారండీ ఆయన. అద్భుతం.

Sudarshan said...

చాలా థాంక్సండి! చిత్రకథ మొత్తం ఒక్కపాటలొ చెప్పడం ఎన్నోపాటలలో జరిగింది. అసలు గురువుగారి ప్రత్యేకతే అది. సన్నివేశానికి తగినట్టుగా వ్రాసి మొత్తం చిత్రానికే ప్రాణం పోస్తారు.

వేణూరాం said...

మనసు పలికే గారు..చాలా బాగా రాసారు.. సెంటిమెంట్ తో గుండెలు పిండేసారు..:) :)
ఇప్పటి వరకు రాసిన వాటిల్లో ఇదే బెస్స్ట్.. keep it up..
మరిన్ని మంచి పాటలు, మంచి వ్యాఖ్యానాలు ఆశిస్తున్నా..

గీతిక said...

నాకు బాగా నచ్చిన పాటల్లో ఇది ఒకటి. మీ వర్ణన చాలా బాగుంది.

3g said...

చాలా చాలా బాగా రాసారు. నేను సీతారామశాస్త్రి ఎవరని ఆలోచించడం మొదలుపెట్టింది మొదటిసారి ఈ పాట విన్న తరువాతే.
"సూర్య బింబమే అస్తమించెనుగ మేలుకోని కల కోసం.."
ఇక్కడ మీ లెక్క కొంచెం తప్పినట్టుంది, అది "సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కలకోసం..." అనుకుంట. మీరు పొరపాటు పడ్డారో లేక నేనో మళ్ళీ ఒకసారి పాట వినాలి.

మనసు పలికే said...

కృష్ణ.. ధన్యవాదాలు..:)

శిశిర గారు.. ధన్యవాదాలండీ, చాలా మంచి పాటని గుర్తు చేశారు..:) ఈ పాటని కూడా నా లిస్ట్‌లో చేర్చుకోవాలి. మీరు చెప్పింది నిజమండీ, నిజానికి సిరివెన్నెల గారు రాసిన చాలా పాటలు బాలు గారి గళం నుండే మన హృదయాలను చేరుకున్నాయి. సిరివెన్నెల గారు ప్రతి పాటా ఎంత అందంగా రాస్తారో, బాలు గారు అంత శ్రద్ధగా పాడతారు :)

సుదర్శన్ గారు, ధన్యవాదాలండీ కామెంటినందుకు.. మీరు చెప్పింది 100% నిజం అండీ.

వేణురాం గారు, చాలా చాలా థ్యాంక్స్ అండీ..:) మీరు ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి, మీ వ్యాఖ్యని ఫాలో అయిపోతాను..:)

గీతిక గారు, ధన్యవాదాలండీ..:)

3g గారు, అవునండోయ్. మీరు చెప్పింది కరెక్ట్.. ధన్యవాదాలు తప్పుని సరిదిద్దినందుకు..:)

అశోక్ పాపాయి said...

అబ్బో చాల బాగ రాశారు..అటు మనసుపలికే బ్లాగ్ లో అందరిని నవ్విస్తూ ఇటు సిరివెన్నెల బ్లాగ్ లో అందరిని ఆలోచింపచేస్తున్నారు

నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నీ
అగ్గితోటి కడుగు ఈ సమాజ్జ జీవచ్చాయాన్నీ
మారదు లోకము మారదు కాలము
దేవుడు దిగి రానీ ఎవ్వరూ ఏమై పోనీ
మారదు లోకము మారదు కాలము

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రె దాటు మందకి నీ జ్ణాన భోద దేనికి
ఏ చరిత్ర నేర్పుతుందీ చక్కని పాఠం
ఏ క్షణాన నేర్చుకుందీ జిత్తుల పాఠం
రామ బాణమార్పిందా ఈ రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా ఈ నిత్య కురుక్షేత్రం

నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నీ
అగ్గితోటి కడుగు ఈ సమాజ్జ జీవచ్చాయానన్నీ
మారదు లోకము మారదు కాలము
దేవుడు దిగి రానీ ఎవ్వరూ ఏమై పోనీ
మారదు లోకము మారదు కాలము

పాత రాతి గుహాలు పాల రతి గృహాలయినా..
అడవి నీతి మారిందా ఎన్నీ యుగాలయినా
వేట అదే వేటు అదే…నాటి కథే అంతా
నట్టడువులు నడి వీధికి నడచొస్తే వింతా
బలవంతులే బతకాలనే సూక్తి మరవకుండా
శతబ్దాలు చదవలేదా? ఈ అరణ్యకాండా

నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నీ
అగ్గితోటి కడుగు ఈ సమాజ్జ జీవచ్చాయాన్నీ
మారదు లోకము మారదు కాలము
దేవుడు దిగి రానీ ఎవ్వరూ ఏమై పోనీ
మారదు లోకము మారదు కాలము

Siva Krishna said...

మీ బ్లాగ్ చుసిన తరువాత నెనూ ఎప్పుడు చాలా తపన పడుతుంటాను ఎవరు ఎక్కువుగా పద ప్రయోగాలు చేస్తారో తెలుసుకోవడానికి ఇప్పుడు మీ బ్లాగ్ చుసినతరువాత నా దాహం తీరింది.

మీ టెస్ట్ చాలా బాగుంది

మనసు పలికే said...

అశోక్, ధన్యవాదాలు టపా మీకు నచ్చినందుకు, మరియు మరో మంచి పాట లిరిక్స్ ఇచ్చినందుకు..:) ఈ పాట కూడా ఉంది నా లిస్ట్‌లో..:)

శివ కృష్ణ గారు, చాలా చాలా థ్యాంక్స్..
>>ఇప్పుడు మీ బ్లాగ్ చుసినతరువాత నా దాహం తీరింది.
ఇది నాకు చాలా చాలా గొప్ప కాంప్లిమెంట్..:) కానీ ఈ కాంప్లిమెంట్‌కి నేను అర్హురాలిని కానేమో..!!

మధురవాణి said...

చాలా బాగా రాసావు అపర్ణా!
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా..
నువ్వు చివర్లో చెప్పిన మాటలకి ఈ వాక్యమే నిదర్శనం.
అసలు సిరివెన్నెల గారికి పదానికో నమస్కారం చేయచ్చు కదా! :)

మనసు పలికే said...

మధుర గారు, ధన్యవాదాలు వ్యాఖ్య పెట్టినందుకు..:)
అవునండీ.. జీవితంలో ఒక్కసారైనా ఆయన్ను కలిసి ఆ పాదాలకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలన్నది నా కోరిక..:)
అవునూ, మీ పేరు గుర్తు తెచ్చుకుంటే గుర్తొచ్చేది ఆ పెళ్లి కూతురు ఫొటోనే.. మార్చేశారా..! ఎందుకు చెప్మా..

శిశిర said...

పైన తప్పు రాసినట్టున్నానండి. "కలతెరుగని కలలను చూడు, కంటికి కావలి నేనుంటా" అని అనుకుంటా ఆ వాక్యం.

మందాకిని said...

అపర్ణ,
మీతో ఒక సంతోషం పంచుకోవాలని మీ బ్లాగ్ వెతుక్కుంటూ వచ్చాను.
సీతారామశాస్త్రిగారి గురించి ఎంతో చక్కగా ఓ అభిమాని రాసిన వ్యాసాల గురించి మీకు చెపుదామని... మీరూ బాగా రాస్తారు కదా. ఇక్కడికెళ్ళి చూడండి మరి.
http://tanmayeevirinchi.blogspot.com/

శాస్త్రిగారి పాటలతొ మన మిత్రుల్లో ఇంకొకరి బ్లాగ్ కూడా ఉంది కదూ. వారికీ చెప్పాలి.

మనసు పలికే said...

మందాకిని గారు, మీకు బోలెడు ధన్యవాదాలండీ.. నన్ను వెతికి మరీ ఈ బ్లాగుని పరిచయం చేసినందుకు.. మీరన్నట్లు, బ్లాగు చాలా చాలా బాగుంది.. ముఖ్యంగా సిరివెన్నెల గారికి లేఖలు రాయాలి అన్న తన్మయి గారి ఆలోచన అద్భుతం..:) మీ వ్యాఖ్య చూసి వెంటనే అన్నీ చదివేశా..:) మీకు మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను..:)

మనసు పలికే said...

మర్చిపోయాను, మన ఇంకో మిత్రుడు, సాయి ప్రవీణ్.. మరో మిత్రురాలు ఆ.సౌమ్య గారు..:)