Tuesday, November 30, 2010

నమ్మక తప్పని నిజమైనా..

ప్రేమ.. నిర్వచించలేని ఒక అనుభూతి. పదాల్లో కూర్చలేని ఒక భావం. ప్రేమికులిద్దరూ కలిసున్నంత వరకూ ప్రపంచమంతా అందంగా, ఇంత అందమైన ప్రపంచం తమ కోసమే దేవుడు సృష్టించాడు అన్నంత ఆనందంగా ఉంటారు.మరి ఏదైనా కారణాల వల్ల విడిపోతేనో..!! ఆ బాధ చెప్పనలవి కానిది. తినడానికైనా, తాగడానికైనా, మట్లాడ్డానికైనా గొంతుకడ్డం పడే బాధ అది. ఇక నిద్ర సంగతంటారా.. అదెలా ఉంటుందో కొద్ది రోజుల వరకూ గుర్తు కూడా రాదు. మరి అటువంటి బాధకి అక్షర రూపం ఇవ్వడం మామూలు విషయం కాదు. నిన్నటి దాకా నిచ్చెలి చేతుల్లో చెయ్యేసి పక్క పక్కనే నడుస్తూ జీవితాన్ని రంగుల్లో ఊహించుకుంటూ ఉండే ప్రియుడు, ఒక్క సారిగా తన చేతిలో సఖి చెయ్యి మాయం అయిందని తెలుసుకుని అది నిజమే అని తెలిసి కూడా, నిజమా కాదా అన్న సంఘర్షణలో ఉన్న తన మనసుకి సర్ది చెప్పలేక సతమతమయ్యే ఒక ప్రేమికుడి వ్యధ.. "బొమ్మరిల్లు" చిత్రం లోని ఈ "నమ్మక తప్పని నిజమైనా" పాట.ఇక ఇటువంటి భావాలని అక్షర రూపంలో పొందు పరచడం మన శాస్త్రి గారికి వెన్నతో పెట్టిన విద్యేమో.. ఆ బాధని మన మనసు మూలాల్లోకి తీసుకెళ్లిపోతాడు. ఒకానొక క్షణంలో మన కళ్లలో నీటి తెర అడ్డు పడటం అన్నది చాలా సాధారణ విషయం (ఎన్నో పాటల్లో నాకు అనుభవానికొచ్చింది).

నువ్విక రావు అన్న నమ్మలేని నిజాన్ని చెబుతూ ఉన్నా ఎందుకు వినదో నా మనసు.. నువ్వొస్తావు అన్న పిచ్చి ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎదురుగా ఎవరొస్తున్నా అది నువ్వే అన్న ఆశ. మరి నీ రూపం నా చూపులనొదిలి వెళ్లలేదుగా. నువ్వు లేని ఈ ఏకాంతంలో ఇంకెంత మంది ఉన్నా నేను ఒంటరినే కదా.. నన్ను ఇటువంటి ఒంటరితనంలో వదిలి వెళ్లావు కదూ.. నువ్వు నిన్నటి కలవే అని తెలుసు. అయినా, కన్నులు తెరిచుకుని అదే (నీ) కలలో ఉన్నాను ఇప్పటికీ. మరి నువ్వు నన్ను వదిలి వెళ్లినంత మాత్రాన నీ ఙ్ఞాపకాల్ని నేను మర్చిపోలేను కదా..
       నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెపుతున్నా
                               ఎందుకు వినదో నా మది ఇపుడైనా
       ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
                               నీ రూపం నా చుపులనొదిలేనా
       ఎందరితో కలిసున్నా నే నొంటరిగానే ఉన్నా
                               నువ్వొదిలిన ఈ ఏకాంతంలొనా
       కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా
                               ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా

"ఈజన్మంతా విడిపోదీ జంటా అని దీవించిన గుడిగంటను ఇక నామది వింటుందా" ఎంత గొప్పగా రాసారో.. ఇద్దరం కలిసి తిరిగిన ఏ చోటైనా నువ్వు లేని నన్ను గుర్తు పడుతుందా.. వాహ్.. నీ ప్రేమ గుర్తులతో నన్ను నిలువునా తడిమి.. ఙ్ఞాపకాలను మాత్రం వదిలి వెనుదిరిగావు. నీ వియోగంతో చెమర్చిన ఈ కనులతో నిన్ను ఎలా వెతికేది..
       ఈజన్మంతా విడిపోదీ జంటా
                  అని దీవించిన గుడిగంటను ఇక నామది వింటుందా
       నా వెను వెంట నువ్వే లేకుండా
                  రోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా
       నిలువున నను తడిమిఅలా వెనుదిరిగిన చెలిమి అలా
                  తడి కనులతో నిను వెదికేది ఎలా

కానీ ఇక నువ్వు రావు అన్నది నిజం. మరి, నిరంతరం వెలిగే వెన్నెల లాంటి నీ స్నేహంలో కనీసం కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి అని ఆనందించమంటావా.. లేదా నువ్వు రావన్న నిజాన్ని తలుచుకుంటూ నా ఊహల్లో కలిగే వేదన చీకటిలో జీవితం గడిచిపోతుంది అనుకోవాలా..చిరునవ్వులతో పరిచయమై ఎన్నటికీ మరచిపోలేని సిరిమల్లెల పరిమళాన్ని అందించి చేజారిపోయావు.. నా ఆశల తొలి వరానివి. వాహ్. ఎంత అద్భుతంగా రాసారో..
       నీ స్నేహంలొ వెలిగే వెన్నెల్లో
                  కొనాళ్ళయినా సంతోషంగా గడిచాయనుకోనా
       నా ఊహల్లో కలిగే వేదనలో
                  ఎనాళ్ళైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
       చిరు నవ్వుల పరిచయమా సిరి మల్లెల పరిమళమా
                  చేజారిన ఆశల తొలి వరమా... 

Youtube link : http://www.youtube.com/watch?v=62W-xiJABTQ&feature=related

15 comments:

రాజ్ కుమార్ said...

గొప్ప సాంగ్ గురించి రాసారు గొప్పగా... మీ మార్క్ వ్యాఖ్యానం తో.. :)nice post... ;)

హరే కృష్ణ said...

అపర్ణా,ఎప్పటిలానే చాలా బావుంది :)

నాది ఫస్ట్ కామెంట్ కాకపొతే
.
.
.

అంతా నువ్వే చేసావు అప్పూ... అంతా నువ్వే చేసావ్! ఫస్ట్ కామెంట్ నా నుండి లాక్కున్నావు
ఇప్పటికీ నా కామెంట్ నీ మాడరేషన్ లోనే ఉంది

Geetika said...

ఓహ్.. ఎక్స్‌లెంట్ సాంగ్.
చాలా బాగా వివరించారు.

మొత్తానికి మీ అందరి (కామెడీ) డైలాగ్స్ బాగున్నాయ్.

అశోక్ పాపాయి said...

సృష్టిలో తీయనైన అనుభూతినిచ్చేది ప్రేమ. యువతీ యువకుల మధ్య అనుకోకుండా చిగురించేది ప్రేమ. ఆ ప్రేమ పుట్టిన మరుక్షణం ప్రేయసీ ప్రియుల హృదయాలతో ఆడుకుంటుంది.ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు.వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ప్రేమను అర్థం చేసుకుంటారు.ఎవరైతే ప్రేమను అర్థం చేసుకున్నారో అలాంటి వారు తమ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినవారౌతారు.కాని పరిస్థితుల ప్రభావంతో విడిపోయిన జంటలు మీరు అన్నట్టుగానే చాలానే తారసపడుతుంటాయి.మళ్లి మీరు పరిచయం చేసిన ఈ పాటలో సిరివెన్నెల గారు చాల చక్కగ చెప్పారు.

మనసు పలికే said...

వేణూరాం.. ధన్యవాదాలు.:)

కృష్ణ.. ధన్యవాదాలు..:) నీది ఫస్ట్ కామెంటు కాదుగా..;)
>>అంతా నువ్వే చేసావు అప్పూ... అంతా నువ్వే చేసావ్! ఫస్ట్ కామెంట్ నా నుండి లాక్కున్నావు
ఇప్పటికీ నా కామెంట్ నీ మాడరేషన్ లోనే ఉంది
హహ్హహ్హా.. భలే పేరడీలు చేస్తావు నువ్వు..:)

మనసు పలికే said...

గీతిక గారు, ధన్యవాదాలు..:) నిజమేనండీ చాలా మంచి పాట.

అశోక్.. అబ్బో ప్రేమ గురించి చాలా చెప్పావే..:) నిజమే.. సిరివెన్నెల గారు చాలా చక్కగా వివరించారు ఈ పాటలో విడిపోయిన వాళ్ల బాధ ఎలా ఉంటుంది అని.

ఇందు said...

అబ్బా!!ఈ పాట వింటే చాలా బాధేస్తుందండీ...దీనితో నాకు కొన్ని గ్నాపకాలు ముడిపడి ఉన్నాయి.ఈ పాట లిరిక్స్ ఉన్న బొమ్మరిల్లు ఫొటో నాదగ్గర ఉండాలి.అది ఎటో మిస్స్ అయింది. నాకు చాల ఇష్టం ఈ పాట అంటే. ఆ ఫొటో కనపడక నేను చాల బాధపడ్డా...ఇప్పుడు అవన్ని గుర్తుచేసారు :(

మనసు పలికే said...

ఇందు గారు.. :(
ఇంకేమీ చెప్పలేను.

మనసు పలికే said...

వెన్నెల కుమార్ గారు, ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

kiran said...

అసలు ఈ పాట ఒక అద్బుతం అపర్ణ...!!
ఒకప్పుడు 24 గంటలు ఇదే విన్న రోజులు కూడా ఉన్నాయి.. :)
ఆ పాట తో పాటు నీ వివరణ కూడా బాగుంది.. :)

మనసు పలికే said...

కిరణ్ గారు, నిజమేనండీ.. ఈ పాట అద్భుతమే:)
ధన్యవాదాలు నా టపా నచ్చినందుకు.

జ్యోతి said...

మీ పోస్ట్ బాగుంది అపర్ణ గారు.
కానీ ఇలాంటి సందర్భానికే సిరివెన్నెలగారే రాసిన " ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా" పాట ఈ పాటకన్న చాలా నచ్చుతుంది నాకు.
అఫ్ కోర్స్ జిహ్వకో రుచి లా మనసుకో పాట అనుకోండి :)
ఈపాటలో చరణాలు అద్భుతంగా ఉంటాయి,ఆఖరి చరణం ది బెస్ట్.
"ఆపకిలా ఆనాటి కల అడుగడుగూ తూలిపోగా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగూ చూడనీక
జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మనీ
నిన్నలో వదిలెయ్యనీ ఇన్నాళ్ళ ఆశని
చెంతే వున్నా సొంతం కావని నిందించేకన్నా
నన్నే నేను వెలివేసుకొని దూరం అవుతున్నా"

మనసు పలికే said...

Mahek గారు, ధన్యవాదాలు టపా నచ్చినందుకు:).
మీరు చెప్పిన పాట కూడా చాలా బాగుంటుంది. అది కూడా నా లిస్ట్‌లో ఉందన్న మాట.
>>జిహ్వకో రుచి లా మనసుకో పాట అనుకోండి :)
హహ్హ.. బాగా చెప్పారు. నాకైతే ఆయన కలం కదిపితే చాలు, పేపర్ మీద ఏదున్నా నచ్చేస్తుంది:))

గిరీష్ said...

Excellent song and chala bagundi mee lekanam

మనసు పలికే said...

గిరీష్ గారు, ధన్యవాదాలు:)