Friday, July 15, 2011

అమృతమే చెల్లించి ఆ విలువతో..

పేరాశతో తన పసుపు కుంకుమలనే అమ్ముకున్న తెలుగింటి ఇల్లాలు. డబ్బు మీద వ్యామోహంతో తన జీవితాన్నే పణంగా పెట్టి ఆస్థిపరురాలిగా మారాను అనుకుంటూ తనని తాను అసలైన బీదరికంలోకి సాగనంపుకున్న మహిళ. నిజం తెలుసుకుని పశ్చాత్తాప పడుతూ తన మాంగల్యాన్ని తిరిగి కొనుక్కోవాలని ఆరాటపడే ఒక భార్య.


పెళ్లి అంటే మూడో మనిషితో పంచుకోలేని ఒక అపురూప బంధం అన్న నిజం తెలుసుకోలేని ఒక ఇల్లాలి కథ "శుభలగ్నం". యస్.వి.కృష్ణారెడ్డిగారి దర్శకత్వం, సంగీత దర్శకత్వం లో 1994లో వచ్చిన ఒక మంచి చిత్రం. సినిమా మొత్తాన్నీ ఒక్క పాటలో చూపించగలిగిన పాట "చిలక యే తోడు లేక". ఈ పాట పరిచయం లేని తెలుగు సంగీత ప్రియులు ఉంటారని నేననుకోను. సంగీతం, సాహిత్యం, గాత్రం అధుతంగా సమకూర్చిన మంచి పాట.

తెలిసి తెలిసి ఎండమావులు మాత్రమే కనిపించే ఎడారి వెంట ఒంటరిగా పరుగులు పెట్టిన చిలకని, సౌభాగ్యానికి వెల ఎంతమ్మా అంటే ఏం చెప్పగలుగుతుంది? సంతలో వస్తువులా పసుపు కుంకుమలని అమ్ముకున్న తరువాత, భర్తనే బంధం ఎలా తిరిగి వస్తుంది? 

 పల్లవి :
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
      తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
      మంగళ సూత్రం అంగడి సరుకా.. కొనగలవా చేజారాక
      లాభం.. ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
                                             || చిలకా ఏ తోడు ||
.కోరస్: గోరింకా యేదే చిలకా లేదింకా || 2 ||

"అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే" ఈ పదాలకి ఉన్న అర్థాన్ని ఆలోచించడానికి కూడా నేను ఖచ్చితంగా అనర్హురాలిని అనిపిస్తూ ఉంటుంది నాకు. విన్న ప్రతిసారి ఈ వాక్యం నన్ను ఎక్కడికో తీస్కెళ్తూ ఉంటుంది. అతితెలివితో చేసిన తప్పిదాన్ని ఇంత బాగా వర్ణించగలరా ఎవరైనా? కాసుల వర్షంలో బీదతనం. ఎలా మెచ్చుకుని సిరివెన్నెల గారిని ఆయనకి మాత్రమే అర్హమైన స్థానంలో కూర్చోబెట్టాలో తెలీడంలేదు.
చరణం1 :
      బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
      వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
      అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
      కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
                                             || చిలకా ఏ తోడు ||
కోరస్: కొండంతా అండే నీకు లేదింకా || 2 ||

నిజమే, ధనంతో సుఖాన్ని పొందొచ్చేమో కానీ, అనురాగాల్ని అనుబంధాల్ని కొనగలమా? చుట్టూ కాసుల రాశులు కొలువుదీరి ఉన్నా, పెదవుల పై చిరునవ్వు పూయించేవారు, చెక్కిలిపై కన్నీటిని తుడిచేవారు, చెంత లేనప్పుడు వెలుగుల లోకంలో ఉన్నా అది అమావాస్యే అవుతుంది. మనం అనాథలే అవుతాం. సంపద మైకంలో ప్రపంచాన్ని మరచిపోయినా, అనాథలమన్న విషయం కళ్లు తెరిపించి నిజాన్ని చూపించేసరికి.. మనం నడిచి వచ్చిన తీరం మన కళ్లను దాటి ఎప్పుడో దూరం అయిపోయి ఉంటుంది. 
చరణం2 :
      అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో..
      మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో..
      ఆనందం కొనలేని ధనరాశితో.. అనాథగా మిగిలావే అమవాసలో
      తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా
                                             || చిలకా ఏ తోడు ||

చేసిన తప్పుని తెలుసుకుని ఎడారి వెంట కన్నీటితో సాగే ఆమని నటన అద్భుతం.. ఆమనిని మాత్రం డబ్బుల పంజరంలో పెట్టి, జగపతి బాబు, రోజా సంతోషంగా ఉండే సన్నివేశం చిత్రీకరణ పాట భావాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఇక ఆమనికి సర్వెంట్స్ అందరూ కలిసి డబ్బుని వడ్డించే సన్నివేశం, ఆ తర్వాత తన భర్తతో తను సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకోవడం.. అన్నిటికన్నా అద్భుతం పాట చివర్లో ఆమని త్రాసుకి ఒకవైపు తాళిని మరో వైపు తన సంపదనంతా పెట్టి తన భర్తని తిరిగి పొందడానికి చేసే ప్రయత్నం.ఈ పాట చూడాలంటే ఇక్కడ నొక్కండి.

ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది, డబ్బు హోదా ఎంత ఉన్నా, మెట్టు మెట్టు ఎక్కుతూ ఎంత ఎత్తుకు ఎదిగినా, మన ఆఙ్ఞని అనుసరించేవాళ్లు చుట్టు ఎందరున్నా.. మనతో కలిసిపోయే వాళ్లు, మన సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకునే వాళ్లు లేని జీవితం నిజంగా వృధా అని..

11 comments:

లత said...

మంగళసూత్రం అంగడి సరుకా సిరి ఉందని వెలకడతావా
బేరం ఏమిచ్చిందమ్మా నూరేళ్ళ భారం తప్ప
చిలుకా యే తోడు లేక
ఈ లైన్స్ కూడా బావుంటాయండి.చివరలో రోజా ఫ్లైట్ ఎక్కేప్పుడు వస్తాయి

శిశిర said...

బాగా పరిచయం చేశారు ఈ పాటని. నాకూ చాలా ఇష్టమైన పాట. చాలాసార్లు ఒక టపా రాద్దామనుకున్నాను కూడా. సినిమా చివరలో రోజా వెళ్ళిపోతున్నపుడు వచ్చే రెండు పంక్తుల సాహిత్యం కూడా చాలా బాగుంటుంది.

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంతటి చవకా సిరి ఉందని వెలకడతావా
బేరం ఏమిచ్చిందమ్మా నూరేళ్ళ భారం కాక


మీరన్నట్టు సాహిత్యం, గాత్రం అద్భుతంగా కుదిరిన పాట.

రాజ్ కుమార్ said...

Excellent song...
ఎంతయినా శాస్త్రిగారు..శాస్త్రిగారే..
"లాభం.. ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక" ఈ లైన్ చాలా ఇష్టం నాకు. బాలూ కూడా అద్భుతంగా పాడారు. ఎప్పటిలాగానే సిరివెన్నెల సాహిత్యానికి తగ్గట్టుగా ఉందీ మీ వ్యాఖ్యానం.

రాజ్ కుమార్ said...

ఇప్పుడే మళ్ళీ చూసేశాను సాంగ్ ని మీ పుణ్యమా అని.. చాలా బాగా పిక్చరైజ్ చేశాడు డైరెట్రు..
thanQ very much 4 sharing..

మనసు పలికే said...

లత గారు, శిశిర గారు,
మంచి లైన్లు గుర్తు చేసారు. ఇవి కూడా జత చేద్దాం అనుకుని మర్చిపోయాను:) చాలా బాగుంటుంది సాహిత్యం ఇందులో. బోలెడు ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి:))

శిశిర గారు, మరి ఆలస్యం వద్దు, త్వరగా రాయండి ప్లీజ్. మీ శైలిలో అద్భుతంగా ఉంటుంది ఈ పాట వ్యాఖ్యానం..

మనసు పలికే said...

వేణూరాం,
నిజమే.."ఎంతయినా శాస్త్రిగారు..శాస్త్రిగారే":)) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:))

ఇందు said...

Another wonderful song from Sirivennela :) Love this song...nd each nd every word in it is true! :)

Nice post appu!

వేణూశ్రీకాంత్ said...

తెలిసిన పాటనే కొత్తగా పరిచయం చేయడంలో మీకు మధురకు పోటీ రావడం చాలా కష్టం..
నాకు చాలా ఇష్టమైన పాట. చివర్లో లైన్స్ మర్చిపోయారు అవిచెప్దాం అని సంబరపడేలోపు శిశిరగారు లతగారు చెప్పేశారు :-))

గిరీష్ said...

అయ్యబాబోయ్ ఈ పాట కెవ్ అసలు..
అప్పట్లో ఫుల్ సాంగ్ నేర్చుకున్న..టచింగ్ సాంగ్

>>
మంగళ సూత్రం అంగడి సరుకా.. కొనగలవా చేజారాక
లాభం.. ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
>>

ఈ రెండు లైన్స్ చాలు పాట సూపర్ అనటానికి,
thanks for remainding me a good song andi.

మనసు పలికే said...

ధన్యవాదాలు ఇందు:))

వేణు గారు, హహ్హహ్హ.. అయితే మీ సంబరాల్ని శిశిర గారు, లత గారు వారి వ్యాఖ్యలతో ఆపేశారనమాట;)
ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి:)))

గిరీష్ గారు,
నిజమే, అప్పట్లో ఈ పాట మొత్తం నేర్చేసుకునే వాళ్లం.. ఇప్పటికీ నాకు మొత్తం వచ్చు ఈ పాట:) ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)

నవజీవన్ said...

యెస్వీ క్రిష్ణారెడ్డి గారిని ఒక దర్శకుడిగానే కాకుండా ఒక సంగీతదర్శకుడిగా కూడా చూస్తే మంచి పటిమ ఉన్న వ్యక్తి కనిపిస్తారు. ఇలాంటి పాటకు సంగీత దర్శకత్వం అందించడం అంత సులువైన విషయం ఏమీ కాదు. భావుకత ఉట్టిపడిన పాట.