"టివి సీరియల్" అన్న పేరు వినగానే మనలో ఎంత మందికి తరువాత చెప్పబోయే మాటలు వినాలనిపిస్తుంది..? నాకు మాత్రం అసలు ఆ పేరు విన్న వెంటనే మొదట అక్కడి నుండి లేచి వెళ్లిపోవాలనిపిస్తుంది. అంత "ఇష్టం" నాకు సీరియల్స్ అంటే. కానీ మట్టిలోనే మాణిక్యం ఉన్నట్లుగా అలాంటి ఏడుస్తూ ఏడిపించే చెత్త సీరియల్స్ మధ్యలో ఒక మంచి సందేశాత్మకమయిన సీరియల్ చూసి విస్తు పోయాను (మొదట్లో..) అదే మన "అమ్మమ్మ.కాం".
నేనైతే ఎక్కువగా చూడలేదు కానీ, తెలిసిన వారు చెబితే అనుకున్నాను సీరియల్స్ కూడా ఇంత మంచిగా ఉంటాయా అని. సీరియల్ గురించి విస్తుపోవడం ఒక వంతైతే, ఒక అమ్మాయినో, అబ్బాయినో పెట్టి వెనకాల 20 మందిని పెట్టి సీరియల్ పేరుని పది సార్లు రాగయుక్తంగా పాడించేసి(ఆడించేసి) పాట అయిపోయిందనిపించే సాహిత్యం ఉంటున్న ఈ రోజుల్లో ఇంత మంచి పాట విని ఆశ్చర్యం ఆనందం రెండు ఒకే సారి కలగడం రెండో వంతు. ఈ పాట మీద ఆసక్తితో మన గూగులమ్మని అడిగి చూశాను. అందులో ఈ పాట గురించిన ఒక వీడియో చూశాను. అందులో సిరివెన్నెల గారు ఏమన్నారంటే " ఏదైనా సినిమాలో పాట అయితే కొన్ని సార్లు వినేసి, మళ్లీ కొత్త పాటల మోజులో పడిపోతాం. కానీ సీరియల్ కోసం రాసిన పాట అయితే 365 రోజులు ప్రతి ఇంట్లో వినాల్సి వస్తుంది. మరి ఆ పాట విన్న ప్రతి సారీ కొత్త అర్థాన్ని వినిపించగలగాలి. అదే ఈ నా ప్రయత్నం.."
నాకైతే సిరివెన్నెల గారు నూరు శాతం తను కోరుకున్నది సాధించారు అనిపించింది. కావాలంటే మీరే చూడండి..
పల్లవి :
ఏ దారమూ పంపందే వెళ్లదే ఆ మబ్బుదాకా గాలిపటం..
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టి తో తన చుట్టరికం..
ఉన్నపాటుగా.. కలగలేదుగా.. చందమామనే చేరే ఙ్ఞానం.
చిన్ననాటనే.. మొదలయిందిగా.. దాయి దాయనే ఊహా గానం.
నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం.
వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడీ తీరం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.
చరణం:
అపుడు అపుడూ గతమే వెతుకు సుడిలో పడితే సలహా అడుగూ..
గడిచిన రోజులు తలవడమెందుకు ఏం లాభం అనకూ..
ఏ దిక్కులు తోచని చిక్కుల దారిని దాటిన
నాటి స్మృతి చూపద నీ ప్రగతి..
లక్షంటే తనకై తానే వెనకకు జరిగిన ఒకటికి అర్థం..
ఆ ఒకటే లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్ధం..
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.
చరణం:
గుహలే గృహమై ఒదిగే బ్రతుకు మహలే నెలవై ఎదిగే వరకు
ఏ ఆలోచన వేసిందో కద ఎపుడో ముందడుగూ..
ఆ రాతియుగాలను నేటి సుఖాలుగ
మలచిన ఆశలకు మొదలేదో అడుగూ..
వేగంగా రివ్వూరివ్వున గాల్లో దూసుకు పోయే బాణం
తననొదిలిన విల్లేదంటే ఏమో అంటే చేరదు గమ్యం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.
మనం ఎంత ఎత్తుకి ఎదిగినా,అంతరిక్షం లోకి వెళ్లినా, ఒకప్పుడు నిలబడ్డ నేలని, ఆ అనుభవాలని మర్చిపోవద్దు అని ఎంత సున్నితంగా చెప్పారో.. నేను చూసిన వీడియోలోనే చెప్పారు సిరివెన్నెల. మన తరువాత తరాలు అంతరిక్షంలోకి వెళ్లిపోయి, అక్కడే వేరు వేరు గ్రహాల్లోనో, అక్కడ కూడా స్థలం సరిపోకపోతే శాటిలైట్స్ లోనే నివాసాలు ఏర్పరుచుకుని ఉండిపోవచ్చు. మరి అప్పుడు వారికి ఏ విషయంలో అయినా అనుమానాలు సందేహాలు వగైరా వస్తే వెంటనే అప్పుడెప్పుడో మన అమ్మమ్మలు తాతయ్యలు భూమి మీద ఉన్నప్పుడు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏమి పాటించారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ కాలానికి తగ్గట్లుగా, తరానికి తగ్గట్లుగా దానిని అక్కడ కూడా అప్లై చెయ్యొచ్చట.:)
అందుకే పాటలో చెప్పారు,
"అపుడు అపుడూ గతమే వెతుకు సుడిలో పడితే సలహా అడుగూ..
గడిచిన రోజులు తలవడమెందుకు ఏం లాభం అనకూ."
ముఖ్యంగా నాకు ఈ పాటలో నచ్చిన వాక్యాలంటే
"నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం.
వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడీ తీరం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం."
అయినా అసలు ఏ పదం గురించి చెప్పాలి..? ఏ వాక్యం గురించి చెప్పాలి. మీరే చెప్పండి.
"ఏ దారమూ పంపందే వెళ్లదే ఆ మబ్బుదాకా గాలిపటం..
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టి తో తన చుట్టరికం.."
ఎంత బాగంటుంది కదా.. నిజమే, ఈ ప్రపంచంలో ఏదీ కూడా తన బేస్ ని మర్చిపోదు. మనుషులే ప్రతి దాంట్లో ముందుంటారు. మర్చిపోయే విషయంలో కూడా..
మనుషులు అంతరిక్షంలో కి వెళ్లారు, చందమామని ముద్దాడి వచ్చారు అంటే అది కేవలం సాంకేతిక పరిఙ్ఞానం మరియు సాధించాలి అన్న తపన అని తెలుసు. ఇలా చిన్నప్పుడు అన్నం తినకపోతే అమ్మ చందమామని చూపించి "దాయి దాయి" అని పిలిచినప్పుడు కలిగిన ఇష్టం అని తెలియదు.
అదేంటో పాట విన్న ప్రతి సారి కొత్త అర్థాన్ని ఇవ్వడం అంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇలా ఇప్పటికే ఒక నిర్వచనం కలిగి ఉన్న విషయాలకి మళ్లీ కొత్త నిర్వచనం ఇస్తారని మాత్రం తెలియదు.
లక్షంటే తనకై తానే వెనకకు జరిగిన ఒకటికి అర్థం..
ఆ ఒకటే లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్ధం..
గుహల్లోనే మన జీవితాలని గడిపి రాళ్లతోనే మిగిలిపోవాల్సిన మనం ఇలా సుఖ సౌఖ్యాలతో జీవించే స్థాయికి ఎదిగాం అంటే అసలు ఈ ఆశలకి ఆలోచనలకి మొదలు ఎక్కడ ఉండుంటుందంటారు..? కాస్త తెలిస్తే చెబుదురూ..:))
ఈ పాటలో మరో గొప్ప విషయం ఏమిటంటే.. Picturisation కూడా చాలా బాగుంటుంది. పాట అంతా.. ఒక అమ్మాయి పుట్టినప్పటి నుండీ పెళ్లయ్యి, అమ్మ అయ్యి, అమ్మమ్మ కూడా అయినంత వరకూ చూపిస్తారు. కానీ ఎక్కడా ఆ అమ్మాయి ముఖం కూడా చూపించరు.. చాలా కొత్తగా అనిపించింది:))
YouTube Links:
http://www.youtube.com/watch?v=sAuXk3RBJPM
http://www.youtube.com/watch?v=9U5owvrCVF8
12 comments:
బావుంది అపర్ణ
youtube లింక్ కూడా పెట్టేసేయ్ post లో
http://www.youtube.com/watch?v=sAuXk3RBJPM
http://www.youtube.com/watch?v=9U5owvrCVF8
Sirivennela is great
శాస్త్రి గారి మీద బ్లాగున్న సంగతే తెలీదండి నాకు.. సూపర్ అసలు..చాలా మంచి ప్రయత్నం.. ఇంకా మంచి మంచి పాటలు అందివ్వాలని ఆశిస్తున్నాను.
జై బోలో హరేకృష్ణ.. :) :)
ధన్యవాదాలు కృష్ణ.. నువ్వు చెప్పినట్లుగానే You Tube link కూడా పెట్టేశాను..:)
వేణురాం గారు, ధన్యవాదాలు..:) తప్పకుండా ప్రయత్నిస్తాను ఇంకా మంచి పాటలు అందించడానికి..
మీ తరఫున ఏమైనా సలహాలు ఉంటే కాస్త ఇటు పడేద్దురూ..:))
మీకు సలహా లిచ్చేతంతా సీన్ నాకు లేదు కాని... నాకు ఇష్టమైన కొన్ని శాస్త్రి గారి పాటల లిరిక్స్ ఇవ్వగలను :) :)వాటి మీద మీ వ్యాఖ్యానాలు చదవాలని ఉంది ..
వేణురాం గారు, హెంత మాట హెంత మాట.. జాజిపూలు అభిమానులు మరియు యు.బ్లా.స/వ.బ్లా.స సభ్యులు అడగడమూ.. నేను కాదనడమూనా.. తప్పకుండా.. నాకు కూడా కావల్సింది అదే..:)
అది నిజ్జంగా మంచి పాట, నేను ప్రతి ఎపిసోడ్ ను చూశాను, అన్ని ఎపిసోడ్లు download చేసినవి నా దగ్గర ఉన్నాయి :-)
పానీపూరి గారు, ముందుగా స్వాగతం నా బ్లాగులోకి..:) నిజంగానా.?? సీరియల్ కూడా చాలా బాగుంటుందా..! వినడమే కానీ చూడలేదు. రెండో మూడో ఎపిసోడ్స్ చూసి ఉంటాను అంతే...
manchi paata gurinchi raasaaru, good work.
routine edupugottu serials ante naaku kooda maha chiraaku. kaani ee serial baavuntundi, ide producers nunchi vachina inko serial 'laya' kooda baavundi. mallee reruns vaste thappakunda choodandi.
రాణి గారు, ధన్యవాదాలు కామెంటినందుకు..:) "లయ" కూడా బాగుంటుందా..? నాకు తెలియదండీ.. ఈ సారి వస్తే తప్పకుండా చూస్తాను..:)
ఈ సీరియల్ నేనూ చూశాను . ఇప్పటివరకు నేను చూసినవి 'రాధ మధు ' , ' లయ . ,. అమ్మమ్మా . కాం ' మాత్రమే . ఇవి మూడూ నాకు చాలా నచ్చాయి .
ఈ పాట , పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంది . పాట ,చివరలో అధారం ఐయిన చేయి చేయి వాలి పోతూ వుంటే ఇంకో చేయి వచ్చి పట్టుకోవటము చాలా నచ్చింది . ఈ పాట లింక్ ఇచ్చినందుకు థాంక్స్ .
మాలా కుమార్ గారు, ముందుగా నా బ్లాగు తలుపు తట్టినందుకు ధన్యవాదాలు.. :)
>>చివరలో అధారం ఐయిన చేయి చేయి వాలి పోతూ వుంటే ఇంకో చేయి వచ్చి పట్టుకోవటము చాలా నచ్చింది
నాకు కూడా చాలా ఇష్టం ఈ Picturisation.. ధన్యవాదాలు..:)
Post a Comment