పెళ్లంటే మామూలు పెళ్లి కాదు.. అనురాగాన్ని మంత్రంగా.. అనుబంధాన్ని సూత్రంగా చేసుకుని, మమతల కొలువులో జరుగుతున్న పెళ్లి.. అమ్మాయికి అత్తయ్యే దగ్గరుండి అమ్మలా జరుపుతున్న పెళ్లి.. ఆడకూతురు ఒక పైశాచిక మృగం చేతుల నుండి తప్పించుకుని, మరో ప్రేమమూర్తి హృదయంలోకి అడుగిడటానికి చేసుకుంటున్న పెళ్లి.. "పెళ్లి" చిత్రంలోని ఆ పెళ్లి సన్నివేశం ఎంత హృద్యంగా ఉంటుందో, కన్నులకు కట్టినట్లు చూపించింది దర్శకుడు కోడి రామకృష్ణ అయితే, దాన్ని మనసు లోపలి వరకూ చేరవేసింది మాత్రం ఖచ్చితంగా సిరివెన్నెలే..
అత్తా కోడళ్లు అంటే అదొక కత్తి మీద సాము లాంటి బంధంగా సృష్టించేశాం మనం. మరి ఇలా అత్తే ఒక తల్లిలా జరిపే పెళ్లి అయితే నా కంట పడలేదు. కానీ ఒకవేళ జరిగితే ఎలా ఉంటుందీ..?? ఇదిగో ఈ కింద ఉన్నంత అందంగా ఉంటుంది..:)
అనురాగం అనుబంధం కలగలిసి మమతల కొలువులో జరుపుతున్న పెళ్ళికి ఇచ్చే మంగళ వాయిద్యం ఇది.. విని తరించండి మరి..
అనురాగమే మంత్రంగా
అనుబంధమే సూత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్ళికి
మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం(2)
పెళ్లంటే మూడు ముళ్లేనా.? ఏడడుగులేనా..? కాదు.. వాటికి అతీతంగా ఇంకేదో ఉంది.. ప్రపంచమంతా ఏకమై నిన్ను వెలేసినా నీకు నేనున్నానన్న నమ్మకాన్ని అందించడం.. అసలు మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతమట హిందూ సంప్రదాయం ప్రకారం..ఇక ఏడడుగులేమో వధూ వరులకి ఎన్నడూ విడిపోని స్నేహబంధాన్ని పెనవేస్తుందని మన గట్టి నమ్మకం. మూడు ముళ్లకి, ఏడు అడుగులకి మనం ఇచ్చిన గౌరవం అలాంటిది.. మరి, నాతిచరామి అని ప్రమాణాలు చేసిన అబ్బాయి, లేదా పుట్టిల్లు ఒక కన్ను, అత్తిల్లు రెండో కన్ను అని ఆ రెండిటి గౌరవం నిలబెడతా అని మాటిచ్చిన అమ్మాయి వాటిని నిలబెట్టుకోలేకపోతే (నిలబెట్టుకోకపోతే..) శిక్ష ఎవరికి..? ఈ చిత్రం విషయంలో మాత్రం తప్పు అబ్బాయిదే.. శిక్ష అమ్మాయికే.. కానీ తన దురదృష్టానికి ఆ ఆడకూతురు కృంగి పోలేదు.. పెళ్లి అంటే కేవలం మూడు ముళ్లే కాదు అని తెలుసుకోవడమే కాకుండా ప్రేమగా చేరువైన ఒక స్నేహ బంధాన్ని మరో ముడిగా జత చేసుకుంది. ఏడు అడుగులు వేసి అక్కడితో ముళ్లపొదలో ఆగిపోయిన తన జీవితానికి ప్రేమ అను ఎనిమిదో అడుగుతో మళ్లీ వసంతపు బాటల్ని పరుచుకుంది.. నాతిచరామి మంత్రానికి అర్థం తెలిసిన మనిషి అడుగుల్లో తన అడుగులు కలుపుకుంటూ, ఒక కొత్త రకపు వెలుగులతో నిండిన తన కొత్త జీవితపు పుటల్ని తెరుచుకుంటూ కదిలిపోయే సమయమట.. అంతే కాదు, ఇది ఆగని పయనమట.. అద్భుతం కదూ...
మూడు ముళ్ళతోనే పెళ్లి పూర్తి కాదు అని
మరో ముడిగ చేరుకున్న స్నేహ బంధమిది
సప్తపదితో ఆగరాదు జీవితం అని
అష్టపదిగ సాగమన్న ప్రేమ పదము ఇది
నాతిచరామి మంత్రములో అర్ధం తెలిసిన నేస్తముతో
అడుగు కలుపుతూ వెలుగు వెతుకుతూ సాగే సమయమిది
ఆగని పయనమిది.....
అనురాగమే మంత్రంగా..........
సాధారణంగా కొడుకు ఎంత కౄరుడైనా తల్లి గుండె తన పిల్లల కోసమే కొట్టుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం, కొడుకు పైశాచికత్వానికి కోడలు బలవ్వడం చూసి తనలోని నిజమైన మాతృత్వాన్ని తట్టి లేపిన ఒక తల్లి కనిపిస్తుంది.. కోడలి జీవితం బాగుండాలని జరిగిపోయిన మూడు ముళ్లు, ఏడు అడుగుల పెళ్లి అనబడు ఒక పీడ కలకి మరో ముడిని, మరో అడుగుని జత పరిచి ఒక కొత్త అంకాన్ని కోడలుకి ప్రసాదిస్తుంది..ఆడదంటే ఆడదానికి శతృవు కాదు, అత్త కూడా ఒక అమ్మే అని నిరూపిస్తుంది.. మరి జీవితమంటే బ్రహ్మ ఆడుకుంటున్న బొమ్మలాటేగా.. కానీ ఆ బ్రహ్మ రాతని కూడా మార్చి చూపిస్తుంది మన మానవత్వం. ఇంతవరకూ చరిత్రలో ఎక్కడా జరగని/చదవని మొదటి కథగా, కేవలం మూడు ముళ్ల బంధంలా కాకుండా మనసులు పెనవేసిన సంబంధంగా తరతరాలకూ నిలిచిపోండని అత్తయ్య ఒక తల్లిగా దీవించే చల్లని తరుణం..
ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని
అత్త గుండెలోన కూడ అమ్మ వున్నదని
బొమ్మలాటలాడుతున్న బ్రహ్మ రాతలని
మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది
చరితలు చదవని తొలి కథగా
మనసులు ముడి పడు మనుగడగా
తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగ దీవించే
చల్లని తరుణమిది
అనురాగమే మంత్రంగా..........
ఈ సన్నివేశానికి ఇంత కన్నా అందమైన పదాల కూర్పుని ఎవ్వరూ అందించలేరన్నంత అందంగా రాశారు మన సీతారామ శాస్త్రి గారు.. ఇంతకన్నా ఆయన గురించి చెప్పడానికి నాకు మాటలు లేవండీ. జీవితంలో ఒక్కసారి ఆయన్ని కలిసి పాదాభివందనం చేస్తే ఈ జీవితానికి చాలు అనిపిస్తుంది..
నాకు ఈ పాట Youtube లో దొరకలేదు, క్షమించగలరు లింక్ ఇవ్వలేకపోతున్నందుకు..
17 comments:
First commment naade :)
మంచి పాటను పరిచయం చేసావ్!
అంటే సినిమా కాన్సెప్ట్ కి సంబంధించినవరకు చాలా బాగా ఉంటుంది పాట
నిజ జీవితం లో ఇటువంటి అత్తలు కష్టం ఏమో అని నాకు డవుట్ :)
First comment naadi kaadu.:(
ఇలాంటివన్నీ (పెళ్లి, మూడు ముళ్ళు, ఏడు అడుగులు వగైరా..) అర్ధం కావడానికి నాకు ఇంకా చాలా టైం పడుతుంది.. :) :) మనసు పలికే గారు... ఎక్కడికో తీసుకెళ్ళి పోయారు...
సెంటిమెంట్ తో పిండేసారు మీరు , సిరివెన్నెల కలిసి..:)
ఇంత సెంటిమెంట్ తర్వాత మాకొక కామెడి పాట ప్రసాదించండి మీ నెక్స్ట్ పోస్ట్ లో..
పోస్ట్ సూపర్.. :) :)
నీ వయసుకి ఇంత పరిపక్వత చాలా గొప్ప విషయం.
keep it up. ధన్యవాదాలు నాకు ఈ పాట పరిచయం చేసినందుకు :)
Ya very nice song. ఏసుదాస్ గారి గాత్రం లో వినడానికి కూడా బాగుంటుంది ఈ పాట. ఈ సినిమాలో మిగిలిన పాటలు కూడా బాగుంటాయి. మీ వ్యాఖ్యానం బాగుంటుంది అపర్ణ, బాగా రాస్తున్నారు.
you can listen to these songs here http://www.telugufm.com/modules/music/moviedetail.aspx?mid=10097
కృష్ణ.. అవును. నీదే మొదటి వ్యాఖ్య..:) ధన్యవాదాలు
నువ్వు చెప్పింది నిజమే, నిజ జీవితంలో ఇలాంటి వాళ్లు ఉండరేమో.. కానీ, మనం పాట వరకూ అయితే ఆనందించవచ్చు కదా..:)
వేణురాం..:(
>>నాకు ఇంకా చాలా టైం పడుతుంది.. :) :)
హిహ్హిహ్హి.. సరే మీరు చెప్పినట్లుగా ఈసారి సిరివెన్నెల గారి కామెడీ పాట ఏదైనా పరిచయం చేస్తాను..:) ధన్యవాదాలు టపా నచ్చినందుకు.
సాయి, ధన్యవాదాలు..:) నా పరిపక్వత సంగతి నాకు తెలియదులే కానీ, నువ్వు ఇలా కాంప్లిమెంట్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది..:)
వేణు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలండీ లింక్ ఇచ్చినందుకు.. నా వ్యాఖ్యానం నచ్చినందుకు మళ్లీ ధన్యవాదాలు..:) అవునండీ ఈ సినిమాలో మిగిలిన పాటలు కూడా చాలా బాగుంటాయి..:)
హ్మ్..... ప్రవీణ్ కామెంట్ ని ఇంకోసారి అచ్చేసుకోండి నాపేరు మీద.
3g గారు, హహ్హహ్హా.. అలా అయితే ప్రవీణ్కి ఇచ్చిన రెస్పాన్సే మీకు కూడా అచ్చేసుకోండి, మీ పేరు మీద..:)))
ఈ పాటే కాదు సినిమా , అందులో సుజాత అభినయం చాలా నచ్చాయి నాకు . అత్త కు అమ్మ కు ఒకే అక్షరం తేడా . ఈ డైలాగు ను ఎన్ని సార్లు గుర్తు తెచ్చుకున్నానో . ఇందులో జాబిలమ్మ నీకు ఇంత కోపమా అన్న పాట కూడా చాలా బాగుంటుంది .
ఇలాంటి అత్తలే కాదు , ఇలా అర్ధము చేసుకొని , అత్తల తో సహకరించి , అభిమానించే కోడళ్ళు కూడా ఎవరూ వుండరేమో :)
నా మూడు లచ్చలను అలా అచ్చేయ్యడానికి కుదరదు అని 3g సాక్షిగా తెలియచేసుకుంటున్నాను
మాలా కుమార్ గారు, నిజమేనండీ అలాంటి కోడళ్లు కూడా ఉండకపోవచ్చు.. ఈ చిత్రంలో నాకు "ఓ యవ్వన వీణా" అన్న పాట కూడా బాగా నచ్చుతుంది..:)
కృష్ణ.. ఈ మూడు లక్షల గొడవ మాత్రం వదలవా..:)))
అపర్ణ! సాయి గారి కామెంటే నాది కూడా..
ఇప్పటివరకూ ఈ పాట పూర్తిగా విన్న పాపాన పోలేదు. ఈసారి వింటాను.
ఈ పాట కన్నా నీ పరిచయమే బాగుంది.:)
సవ్వడి గారు, ధన్యవాదాలు టపా నచ్చినందుకు. పాట కూడా తప్పకుండా నచ్చుతుంది.. త్వరగా వినండి మరి..:)
"ఔరా అమ్మక్కచెల్లా" .. గురించి రాయగలరు
//నల్లరాతి కండలతో కరుకైన వాడే ఆనందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల
జాణ జాణ పదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల//
నాకు బాగా నచ్చిన వాక్యాలు :-)
వావ్... బద్రి గారు, ఎంత చక్కటి పాట గురించి గుర్తు చేశారు.. నాకు కూడా ఆ వాక్యాలు చాలా నచ్చుతాయి..:)
Thank you sooo much..
ఈ పాట బాగుంది.
Post a Comment